Wednesday, February 5, 2025

 కాఫీ కబుర్లు సంఖ్య 815 (ఫిబ్రవరి 05 - 2025) -- ఉప్పు ఊసులు -- రుచులలో ఉప్పుకున్న ప్రాధాన్యత చాలా ఉంది.  ఉప్పు లేని వంటకమే లేదు.  పప్పు కూర పులుసు పచ్చడి చట్నీ వంటివి ఉప్పు లేకుండా తినలేం.  వంటకాలకు రుచి తెచ్చేదే ఉప్పు.  ఉప్పు తక్కువైతే.. ఏమిటీ చప్పిడి కూడా.. అంటాం.  ఉప్పు కొంచెం ఎక్కువైతే.. అబ్బ  ఉప్పు కషాయం.. అంటాం.  అంటే ఉప్పు సరిగ్గా సమపాళ్ళలో ఉంటేనే రుచి అన్నమాట.  అసలు ఉప్పుకు మోతాదు అంటూ ఉండదేమో..  మిగతావాటికి  చెంచాడు చిటికెడు సోలడు పిడికెడు గ్లాసుడు  అంటూ కొలతలు ఉన్నాయి.  ఉప్పుకు మాత్రం తగినంత  అనేస్తాం.. అంతేగానీ సరియైన కొలత అంటూ ఎవరూ చెప్పరు.  అందుకే తగినంత ఉప్పు కలపడం ఓ కళ అని నేనంటాను.  ఉప్పు లేని వంటిల్లు ఉండదు.  మా చిన్నతనంలో ఉప్పు  చిన్న చిన్న క్రిస్టల్స్ ఆకారంలో ఉండేది.  గడ్డలుప్పు, రాతి ఉప్పు అనేవాళ్ళం.  తరువాత మెత్తనుప్పు iodised salt రూపంలో.. ప్యాకింగ్ లలో రావడం మొదలైంది.  ఉప్పు  కేవలం వంటల్లోనే కాదు.. ఇతరత్రా కూడా కనిపిస్తుంది.  ఉప్పు కప్పురంబు..  అంటూ వేమన పద్యం రాసాడు.  ఉప్పుకు సంబంధించిన ఉపమానాలు ఉన్నాయి.  పాత సినిమాలలో..  అయ్యా  తమరుప్పు తిని ఇంతవాడినయ్యాను.‌. ఈ డైలాగ్ చాలా సినిమాల్లో విన్నాం.  ఇక్కడ ఆహారానికి సూచిక ఉప్పు.  అలాగే  ఉప్పు అంటే ఓ విశ్వాసం.  నా ఉప్పు తిని నాకే ద్రోహం తలపెడతావా, వాడి ఉప్పు తిన్నందుకు విశ్వాసం ఉండాలి, మీ ఉప్పు తిని ఇంతవాడినయ్యాను..  కథల్లో సినిమాలలో ఇటువంటి డైలాగులు కోకొల్లలు.  ఉప్పు కొన్ని మూఢ నమ్మకాలతో కూడా ముడిపడి ఉంది.  రాత్రి ఉప్పుని ఉప్పు అనరు.  లవణం అనాలిట. చేతిలో ఉప్పు వేయకూడదు. అలాచేస్తే దెబ్బలాటలు వస్తాయిట.  ఉప్పు కారం తింటే రోషం పౌరుషం ఉంటాయిట.  నువ్వు పెద్దవుతున్నావు  ఉప్పు కారం తింటుండాలి  అని మా అమ్మ ఎందుకనేదో తరువాత గానీ నాకర్ధం కాలేదు.  పూర్వపు రోజుల్లో బాల వితంతువులకు ఉప్పు కారం లేని చప్పిడి కూడే పెట్టేవారుట కోరికలు కలుగకుండా ఉంటాయని.  సముద్రంలో ఉప్పు ఉంటుంది.  ఉప్పు వ్యాపారులకు సముద్రం రహదారి.  శ్రామికుల చెమటలో ఉప్పుంటుంది.  ఒంట్లో ఉన్న ఉప్పు కంటెంట్ వచ్చే చెమట రూపంలో ఉంటుంది.  కన్నీటిలో కూడా ఉప్పు కంటెంట్ ఉంటుంది.  అప్పట్లో ఓడల్లో ఉప్పు రవాణా జరిగేది.  ఉప్పుకి ఒక అధిష్టాన దేవత ఉన్నట్లు పురాణాల్లో ఉంది‌.  ఉప్పు ఉద్యమాలకు పోరాటాలకు కూడా స్పూర్తిగా నిలిచింది.  గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.  ఉప్పుకి రక్తపుపోటుకి ఉన్న సంబంధం ఈనాటిదికాదు.  ముఖ్యంగా యాభై దాటినవారికి ఉప్పు ఎక్కువైతే బీపి పెరుగుతుంది.. తక్కువైతే లో బీపి అవుతుంది.  ఏదైనా ఇబ్బందే.  ఉప్పు తక్కువ స్థాయిలో ఉండటమే మంచిది.   బజ్జీలు సమోసాలు కట్లెట్స్ లతో ఉప్పు అద్దిన మిరపకాయలు ఇస్తుంటారు ఫుడ్ కోర్ట్స్ లలో  రుచిగా ఉంటుందని.  ఉప్పు అనే సలక్షణమైన పదం మనకి ఉన్నప్పుడు సాల్ట్ అని ఆంగ్లపదం తరుచూ ఎందుకు వాడతారో నాకర్ధం కాదు.  ఉప్పుతో ఉపయోగాలు ఉపమానాలు.. కొన్ని నష్టాలు (ఎక్కువైతే) కూడా ఉన్నాయనడం యదార్ధం.  ఈవిధంగా ఉప్పుతో మానవ సంబంధాలు అనేకం..  ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)

No comments:

Post a Comment