☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
94. బ్రహ్మచర్యేణ తపసా దేవ మృత్యుమపాఘ్నత
బ్రహ్మచర్యం చేత, తపస్సు చేత దేవతలు మృత్యువును
నశింపజేస్తారు(అథర్వవేదం)
జీవకోటికి వివిధ ప్రాకృతికాంశాల ద్వారా కావలసినవి సమకూర్చే ఈశ్వర శక్తులే దేవతలు. ఈ దైవీశక్తిని పొందడానికై వివిధ సాధనలు శాస్త్రములందు చెప్పబడినాయి.
అందులో బ్రహ్మచర్యం, తపస్సు ముఖ్యమైనవి. ఈ రెండిటికీ అనేక నిర్వచనాలున్నాయి.అన్ని నిర్వచనాలనీ గ్రహించవలసినదే.
ఇంద్రియనిగ్రహంతో కామనాసక్తిని విడనాడి - భగవచ్చింతన, అధ్యయనముల పట్ల శ్రద్ధాళువులైన వారు బ్రహ్మచర్యపాలకులు. బాల్యం నుండి ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, యోగాది సాధనల ద్వారా సంయమన శక్తిని సంపాదించి, విద్యాధ్యయనంపై
ఏకాగ్రత కలవారు బ్రహ్మచారులు. కేవలం అవివాహితులైనంత మాత్రాన
బ్రహ్మచారులనడం తగదు. ప్రధానంగా సంయమన శక్తియే బ్రహ్మచర్యం.
సాధారణంగా- 'విద్యార్థిదశ'ను బ్రహ్మచర్యం అనడం సంప్రదాయం. ఆ దశలో ఇంద్రియ చాపల్యం, భోగలాలస, అవినయం ఏర్పడితే వ్యక్తిత్వం వికసించదు. ఆ
కారణంచేతనే విద్యార్థికి బ్రహ్మచర్య పాలన అత్యావశ్యకం. విద్యార్థి దశలోనే యోగాభ్యాసం, ధ్యానం, నైతిక విలువలను అలవరిచితే వారిలో అంతర్గత శక్తి జాగృతమై ఆయువు వృద్ధి చెందుతుంది. దీనినే "దేవతలు మృత్యువును పోగొడతారు"అని వేదం వర్ణించింది.
వివిధ దీక్షల సాఫల్యానికి కూడా బ్రహ్మచర్యపాలన ప్రధాన నియమంగా పేర్కొన్నారు.ముఖ్యంగా నేటి యువత కోల్పోతున్నది ఈ బ్రహ్మచర్య తేజస్సునే. తద్వారా బాల్య
కౌమారావస్థలలోనే వివిధ శారీరక మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు.దుర్భలజాతిగా మారుతున్నారు. సమాజ పరిసరాలు, మాధ్యమ రంగం ఆకర్షణ నిమిత్తం అశ్లీల, ఉద్రేక అంశాలను ప్రకటిస్తూ, విషప్రసరణను సాగించడం కూడా
ఈ సమస్యను మరింత జ్వలింపజేస్తుంది. వైదిక విలువలతో కూడిన విద్యార్థి జీవితాన్ని ఏర్పరచడమే దీనికి పరిష్కారం.
ఇంక - పై మంత్రంలో రెండవ శబ్దం- తపస్సు. ఈ మాటకి కేవలం అరణ్యాలలో అంతర్ముఖత్వాన్ని అవలంబించడమనే అర్థాన్ని గ్రహించరాదు. 'తప ఆలోచనే' 'తపః
స్వధర్మ వర్తిత్వం' - వంటి ధాత్వర్థాలను, శాస్త్రనిర్వచనాలను గమనించినట్లయితే-సరియైన ఆలోచన విధానం, తనదైన ధర్మాన్ని నియమబద్ధంగా అనుసరించడం
తపస్సు. ఇంకో అర్థంలో - నియమపాలనయే తపస్సు. కొందరు బ్రహ్మచర్యాన్ని తపస్సుతో అంతర్భాగంగా పేర్కొన్నారు.
వివాహితులైన వారు కూడా పర (పురుష / స్త్రీ) వాంఛలేకుండా, తన
భాగస్వామియందే మమతను నిబద్ధం చేసి, పర్వదినాలలో, దీక్షాదినాలలో నిగ్రహాన్ని పాటిస్తూ... నియమంతో కూడిన సాంగత్యాన్ని అవలంబించితే వారిని కూడా 'బ్రహ్మచారి'గానే వేదసంస్కృతి వర్ణించింది.
ఈ బ్రహ్మచర్య, తపస్సుల వలన ప్రాణశక్తి శుద్ధమై, మానసిక దైహిక దృఢత్వం వర్ధిల్లుతుంది. ఆయువు, చురుకుతనం, మేధస్సు, పవిత్రత, మంచి ఆలోచనలు,కరుణ, సౌమనస్యం వంటి దైవీగుణాలు పెంపొందుతాయి. క్రమంగా అజ్ఞానం
నిర్మూలనమై, బ్రహ్మజ్ఞానం కూడా సిద్ధిస్తుంది. ఈ అజ్ఞాన నిర్మూలనయే
మృత్యునాశనం-అని గ్రహించాలి.
ఈ బ్రహ్మచర్య, తపస్సుల వలనే అనేక మంది యోగులు సిద్ధపురుషులయ్యారు.పరతత్త్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు. ప్రపంచాన్ని తరింపజేశారు. యతులు
మాత్రమే కాకుండా వసిష్ఠ, అగస్త్య, గౌతమాది మహర్షులు కూడా గృహస్థాశ్రమంలోనే బ్రహ్మచర్య తపస్సులను పాటించి శాశ్వత ధర్మాలను దర్శించి జనజీవన విధానాన్ని తీర్చిదిద్దారు.
ఈ వైదిక నియమాలను బాల్యదశ నుండి బోధన ద్వారా, సాధన ద్వారా శిక్షణగా అందించడం-ఉత్తమ సమాజాన్ని ఆశించే ప్రతివారి కర్తవ్యం. ఈ దశలో ప్రభుత్వాలు,మేధావులు ప్రయత్నించినప్పుడు భారతజాతి అభ్యుదయ పథగామి కాగలదు.
No comments:
Post a Comment