☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
97. అశిష్యాయ న దేయమ్
శిష్యుడు కానివానికి ఇవ్వరాదు(అథర్వవేదం)
విద్యకానీ, మంత్రం కానీ శిష్యునకే ప్రదానం చేయాలి. శిష్యలక్షణాలు లేనివానికి విద్యల నివ్వరాదు. కొన్ని మంత్రాల విషయంలోనైతే, 'సరియైన అధికారం లేనివారికి ఈ విద్యనిస్తే, ఆ ఇచ్చినవాడు పాపాత్ముడౌతాడు' అనే హెచ్చరికలు కనిపిస్తాయి.
ఉదాత్తలక్షణం కలిగిన విద్యకు సరియైన అధికారి కావాలి. భగవద్గీతను బోధించిన
శ్రీకృష్ణుడు చివరిగా- 'ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన' - అని పేర్కొన్నాడు.
'తపస్వి కానివానికి, భక్తుడు కానివానికి' దీనిని బోధించరాదు. విద్యకు ప్రధానార్హత శ్రద్ధ. అటు తర్వాత ఏకాగ్రత, సాధన. గురువాక్యం పట్ల, గ్రహించే విద్య పట్ల
సత్యభావం, దృఢమైన విశ్వాసం 'శ్రద్ధ' అనిపించుకుంటాయి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం' అని గీతావాక్యం.
( శిష్యలక్షణాలలో సహనం, శ్రద్ధ, ఆలస్యరహితం (బద్ధకం లేకపోవుట),
అతినిద్రను జయించుట, బుద్ధి కుశలత, గురువుపట్ల భక్తి.... ఇవి ప్రధానం.ఉద్రేక ప్రకృతి కలిగిన వానికి విద్య లభించడం కష్టం. విద్య కావాలనే తపన, వినయం శిష్యునికి ప్రధానార్హతలు.)
వేదాంతవిద్య కూడా ‘అథాతో బ్రహ్మజిజ్ఞాసా' అనే సూత్రము ద్వారా 'వివేకం, వైరాగ్యం, శమము (మనోనిగ్రహం), దమము (ఇంద్రియ నిగ్రహం), తితీక్ష (సహనం),
శ్రద్ధ, సమాధానము (ఏకాగ్రత), ముముక్షుత్వం" ఉన్నవాడే ఆత్మవిద్యకు అర్హుడు అని చెబుతున్నది. శ్రద్ధ లేనివాడు సంశయంతో ఉంటాడు. అతనికి ఆ విద్యపై గౌరవం కలగదు. గౌరవం లేని విద్య రాణించదు. అందుకే 'అజ్ఞశ్చ అశ్రద్ధ ధానశ్చ సంశయాత్మా వినశ్యతి - మూర్ఖుడు, శ్రద్ధలేనివాడు, సందేహంకలవాడు తత్త్వాన్ని
తెలుసుకోలేక నశిస్తాడు-అని శ్రీకృష్ణుడు గీతలో తెలియపరచాడు.
కొందరికి విద్యపట్ల, మంత్రంపట్ల కుతూహలం ఉంటుంది. కేవలం కుతూహలం అర్హత కాబోదు. కుతూహలంతో గురువు వద్దకు విద్యార్థి వచ్చి అడిగినంత మాత్రాన
ఆ గురువు మోహితుడై విద్యను బోధించరాదు. కనీసం ఒక సంవత్సర కాలం పరీక్షించమని శాస్త్రబోధ. కేవల కుతూహలపరుడు ఈ పరీక్షాకాలంలో నిలవలేక జారుకుంటాడు. ధనం ఉన్నంత మాత్రాన, దానిని గురువు దగ్గర గ్రుమ్మరించినంత మాత్రాన విద్య వచ్చి తీరుతుందని భ్రమించడం వృధా. అలాగే తన చెంత సంపదను
కుప్పవోయడమే శిష్యుని అర్హత క్రింద గురువు కూడా భ్రమించరాదు. గురుదక్షిణ కూడా శక్తివంచన లేని శ్రద్ధకే సంకేతం.
మనదేశంలో అనేక విద్యలు గురు-శిష్య సంప్రదాయం వలననే పరిపుష్టి చెందుతాయి. క్రమంగా ఆ సంప్రదాయం విచ్ఛిన్నమై 'డబ్బుకి విద్య కొనుక్కుంటున్నారు.
అధ్యాపకులు అమ్ముతున్నారు' అనే విపరీత ధోరణి నడుస్తోంది. దానితో విద్యపరిపూర్ణంగా ప్రకాశించడం లేదు.
శిష్యలక్షణాలలో సహనం, శ్రద్ధ, ఆలస్యరహితం (బద్దకం లేకపోవుట), అతినిద్రను జయించుట, బుద్ధి కుశలత, గురువుపట్ల భక్తి....ఇవి ప్రధానం. ఉద్రేక ప్రకృతి కలిగిన వానికి విద్య లభించడం కష్టం. విద్య కావాలనే తపన, వినయం శిష్యునికి
ప్రధానార్హతలు.
మంత్ర విషయంలోనైతే-మరిన్ని ఉత్తమ లక్షణాలు అవసరం. అది స్థూల దృష్టికి గోచరించే అంశం కాదు కనుక, కేవల విశ్వాసప్రధానమైనది. సాధనని ఎక్కడా కుంటుపరచకుండా సాగాలి. ఎంతో సాధన చేస్తేగానీ ఆధారం కనిపించదు. అది
కనబడకుండా విశ్వాసంగా కొనసాగించడం సామాన్య శ్రద్ధ కలవారికి అసాధ్యం.కనుక తీవ్రమైన శ్రద్ధ ఇక్కడ అవసరం. గురువుపై, మంత్రంపై అకుంఠితమైన సత్యనిష్ఠ,
దృఢనిశ్చయబుద్ధి అవసరం. దానికి తోడు మనోనిగ్రహం, శీలసంపద వంటివి అవసరం. అవి లేనివారికి మంత్రాధిదేవతల అనుగ్రహం దొరకడం కష్టం. కనుక -ఇన్ని లక్షణాలు కలిగినవానికి మాత్రమే మంత్రోపదేశం చేయాలని పై వేదవాక్యం చెబుతుంది.
అటువంటి శిష్యునకు విద్య లభించనప్పుడే అది అతడికీ, లోకానికి ఉపకారం. విద్యవల్ల సంపాదించే ధనాదులపై కంటే విద్యను సంపూర్ణంగా నేర్చుకోవడంపైనే శ్రద్ధను కనబరచాలి. కానీ నేటి రోజుల్లో దేశవిదేశాలలో సైతం పెరుగుతున్న సమాచార,
రవాణా సౌకర్యాల వల్ల అతి తక్కువ విద్యతో ఎక్కువ గుర్తింపు పొందే అవకాశాలు పెరుగుతున్నాయి. దానితో ఆ విద్యలో ఇంకా పురోగతి సాధ్యం కావడం లేదు.
భౌతిక విద్యలలో కన్నా, 'జ్యోతిష, వైద్య, వేద, యోగ, మంత్ర శాస్త్రాలలో” ఇంకా ఎక్కువ నిలుకడ అవసరం.
పరిపూర్ణంగా విద్యను పొందని పక్షంలో, తరువాతి తరాలలో ఈ అరకొర విద్యావేత్తయే పరమ పండితునిగా, గొప్ప ప్రమాణంగా నిలిచిపోయే ప్రమాదముంది.
అందుకే శ్రుతిమాత ఉత్తమశిష్యునికే విద్యనిమ్మని బోధించింది.
No comments:
Post a Comment