. *ఈ జీవితమింతేలే*
. ******************
.
ఇంతేలే !
ఈ జీవితమింతేలే !
మన చేతిలో లేనిదీ.
విధి అధీనముననే ఉన్నదీ.
ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో
తెలియని అగాధ తగాద గాథల
సంశయమయమీ యీ జీవితం !
-------------------------- || ఇంతేలే ||
1. ఎవరితొ ఏ విధముగ ఉంటామో !
ఎప్పుడు ఏదీ చేస్తుంటామో
ఎవరము ఏమై కొనసాగేమో |
ఎంత కాలమూ బ్రతికుంటామో !
అసలెపుడేదీ - ఎంతకు తెలియని
వింత జీవితం !
----------------------------|| ఇంతేలే ||
2. మన అధీనమున ఏది లేనిదీ.
సృష్టి దృష్టి కనుసన్నల మనువిదీ.
ఏదీ ఏమై ఎపుడు తగులునో !
ఎపుడేమగుటకు ఏది ప్రేరణో !
తెలిసీ తెలియక కొనసాగేదీ.
చివరికి మృత్యువు వలలో చిక్కీ
అంతమయ్యి అటమాయమగునదీ
ఈ జీవితం !
-----------------------------|| ఇంతేలే ||
3. కాపురమున సరిగమలు చూతుమో !
సన్యసీంచి అన్ని పరిత్యజింతుమొ !
అష్ట కష్టముల ననుభవింతుమో !
సుఖ సంభోగము లనుభవింతుమో !
కష్టపడితె ఏదైన సాధ్యమని
అంటూ ఉంటరు నిజమది ఎంతో !
మనసు పెట్టితే కానిది లేదని
సలహాలిస్తరు ఔనో కాదో !
ఏదీ ఎంతకు అంతు పట్టకా
కొనసాగే తికమకల జీవితం !
-----------------------------|| ఇంతేలే ||
4. ఏదో ఎపుడో - ఏ విధముగనో
వలదనుకున్నా - ఆగదు మార్పూ !
చేర్పూ కూర్పుల - మార్పులు ఎన్నో
సంభవించుతూ కొనసాగే యీ
జీవన గమనము తీరూ తెన్నూ.
ఈ - మున్నాళ్ళ ముచ్చట జీవనమునకే
ఆశ పాశముల పరితాపాలూ.
చివరకు ఎపుడో మరణము ప్రాప్తము.
ఈ జీవితమపుడే పరిసమాప్తమూ !
-----------------------------------|| ఇంతేలే ||
5. ఏమై పుడుదుమొ ! ఎలా పుడుదుమో !
ఎవరికి పుడుదుమొ ! ఎలా పెరుగుదుమొ !
ఎవరితొ ఎవరిది - ఏ సంబంధమొ !
ఎలా ఉందుమో ! ఏది కందుమో !
దేనినే విధము చూసు కొందుమో !
చివరకు మరణము ఎలా ప్రాప్తమో !
తెలియనిదే ఈ వింత జీవితం !
----------------------------|| ఇంతేలే ||
6. ఉన్నంత కాలం - నీ ఆలోచన
సరిగా ఉంచీ - మంచిగ నడచుకొ !
ఏదేమైనా నిగ్రహించుకో !
సహించి మార్చుకు సంగ్రహించుకో !
మనకోసం ఈ కాలమాగనిది.
ఉన్న సమయముపయోగ పరచుకో ! (2)
--------------------------------|| ఇంతేలే ||
***********************
రచన :---- రుద్ర మాణిక్యం (కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
***********************************
No comments:
Post a Comment