నటరాజు అంటే నృత్యం చేసేవాళ్లలో రాజు లాంటివాడు అని అర్థం. తనను ఆశ్రయిస్తే మన అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే పరమశివుణ్ని విశ్వ సృష్టి, స్థితి, లయ కారకుడిగా ప్రభామండలంలో నటరాజ మూర్తిగా కొలువుదీర్చారు భారతీయ శిల్పులు.జగత్తుకు మూల కారణమైన శివుడు విశ్వం మనుగడ సాగించడానికి ఐదు బాధ్యతలు నిర్వర్తిస్తాడని అంటారు.
నటరాజు అంటే నృత్యం చేసేవాళ్లలో రాజు లాంటివాడు అని అర్థం. తనను ఆశ్రయిస్తే మన అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే పరమశివుణ్ని విశ్వ సృష్టి, స్థితి, లయ కారకుడిగా ప్రభామండలంలో నటరాజ మూర్తిగా కొలువుదీర్చారు భారతీయ శిల్పులు.జగత్తుకు మూల కారణమైన శివుడు విశ్వం మనుగడ సాగించడానికి ఐదు బాధ్యతలు నిర్వర్తిస్తాడని అంటారు. అందుకే కొన్నిచోట్ల శివుడికి ఐదు ముఖాలు ఉన్నట్టు చూపిస్తారు. కానీ, నటరాజ భంగిమలో మాత్రం శివుడి నాట్యంలోనే ఈ పంచ కృత్యాలను ప్రముఖంగా ప్రదర్శించారు. శివుడు మొదట ఈ నృత్యాన్ని తాండు మహర్షికి బోధించడం వల్ల, దీనికి తాండవం అనే పేరు వచ్చింది అంటారు. శివుడి రూపాల్లో ఒకటైన నటరాజ మూర్తిలో మనకు తెలియని మర్మాలు ఎన్నో!
భారతదేశంలోని పురాతన శివాలయాల్లో శిలా రూపంలో, రాగి, ఇత్తడి, పంచలోహ విగ్రహం రూపంలో దర్శనమిచ్చే శివుడి మూర్తి నటరాజస్వామి. నృత్యం చేస్తున్న భంగిమలో ఉండే ఈ విగ్రహం శివుడి విశ్వనృత్యానికి ప్రతీక. ఇందులో శివుణ్ని నాలుగు చేతులతో, ఎగురుతున్న జటలతో చూపుతారు. పాదాల కింద మనిషిలోని అజ్ఞానానికి సంకేతంగా ఉండే అపస్మార అనే కుబ్జుడి మీద శివుడు నర్తిస్తున్నట్టుగా ఈ విగ్రహం మలచి ఉంటుంది. అంటే శివుణ్ని ఆశ్రయిస్తే మనలో గూడు కట్టుకుపోయిన అజ్ఞానాన్ని నిర్మూలించి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని అర్థం. నటరాజు కుడిచేతుల్లో పైదానిలో డమరుకం ఉండగా, మరో చేయి అభయముద్రలో ఉంటుంది. ఎడమ చేతుల్లో పై భాగంలో ఉండేది ఒక పాత్రలో అగ్నితో, మరొకటి ఛాతీకి అడ్డంగా గజహస్త ముద్రలో ఉంటాయి. గజహస్త ముద్రలో ఉన్న చేయి మణికట్టు కొద్దిగా వంపు తిరిగి పైకెత్తి ఎడమకాలి వైపు వేళ్లను చూపుతూ ఉంటుంది. తనను ఆశ్రయిస్తే మనిషికి మోక్షం సిద్ధిస్తుందనే దానికి ఇది సంకేతం.
శివుడి జటల్లో పూలు, కపాలం, చంద్రరేఖ, గంగ ఉంటాయి. ఆయనను ఆవరించి ఒక అగ్నివలయం ఉంటుంది. దీనిని ప్రభామండలం అంటారు. ఈ వలయం కాలాన్ని సూచిస్తుంది. కాలానికి ఆది అంత్యాలు ఉండవనీ, కానీ యుగాలు మళ్లీమళ్లీ వస్తాయని ఈ వలయం ప్రతీకగా చెప్తుంది. నటరాజు తల మీదున్న కపాలం శివుడు మరణాన్ని జయించిన దానికి ప్రతీకగా పేర్కొంటారు. మూడో కన్ను సర్వజ్ఞత్వానికి, లోచూపునకు, జ్ఞానోదయానికి సంకేతం. ముఖం ప్రసన్నంగా ఉంటుంది. విశ్వం ఆవిర్భవిస్తుంది. లయం అవుతుంది. అయినా భగవంతుడు వీటన్నిటికీ అతీతుడని ఇది స్పష్టం చేస్తుంది. ఇక, కుడి చెవికి ఉండే మకర కుండలం విశ్వంలోని పురుషత్వానికి, ఎడమ చెవికి ఉండే కమ్మ స్త్రీత్వానికి చిహ్నాలు. మొత్తం విగ్రహం పద్మపీఠంపై ఉంటుంది. ఇది విశ్వంలోని సృజనాత్మక శక్తులకు గుర్తు. చేతిలోని డమరుకం నిరంతరాయంగా విశ్వాన్ని సృష్టిస్తున్న దానికి సంకేతం.
కాగా, శివుడు సృష్టి ప్రారంభానికి ముందు తమిళనాడులోని చిదంబరంలో నృత్యం చేస్తాడని అంటారు. చిదంబరాన్ని విశ్వానికి కేంద్రంగా పరిగణిస్తారు. ఈ విగ్రహంలో శివుడిని ప్రభామండలం మధ్య ఉంచడం బ్రహ్మాండంలో శక్తికంతటికీ ఆయనే మూలకారణంగా చూపడం ప్రధాన అంశంగా కనిపిస్తుంది. ఇక పరమశివుడి ప్రళయ తాండవాన్ని ఆయన చుట్టూ ఉన్న అగ్ని ద్వారా చూపించారు. ఇది యుగాంతం సమయంలో సృష్టి భగవంతుడిలో లయం కావడానికి ప్రతీక. ఆయన నడుముకు పాము చుట్టుకుని ఉంటుంది. సంస్కృత నాట్య శాస్త్ర గ్రంథాల ప్రకారం ఈ ముద్రను భుజంగ త్రాస (పాము బుసకొట్టడం) అంటారు. అంతేకాదు, పాము కుండలినీ శక్తికి ప్రతీక. ఇది మనుషులలో దాగి ఉన్న విశ్వశక్తిని మేల్కొల్పాలని సందేశం ఇస్తుంది. ఇక చేతులు, కాళ్లు, తల నుంచి వెలికి వస్తున్న పాములు మనలోని అహంకారానికి చిహ్నం. ప్రళయ సమయంలో శివుడు తన దేవేరి పార్వతితో కలిసి స్మశానంలో చేసే నృత్యాన్ని తాండవం అని పిలుస్తారు. కైలాసంలో అమ్మవారితో కలిసి సాయం సంధ్యలో చేసే నృత్యాన్ని లాస్యం అంటారు. ఇందులో దేవ గణాలు, ప్రమథ గణాలు వివిధ వాయిద్యాలతో సహకారం అందిస్తారని కథ.
పంచకృత్యాలు
తాండవంలో శివుడి శరీర భంగిమలు ఆయన పంచకృత్య పరాయణత్వానికి ప్రతీకలుగా మలచారు.
(పరమేశ్వర కృత్యములు ) 1. సృష్టి, 2. స్థితి, 3. లయము, 4. అనుగ్రహము, 5. తిరోధానము.
ఎక్కడా కనిపించదు:
ప్రపంచంలో ‘ఏ కళ అయినా, ఏ మతమైనా భగవంతుడి కర్తవ్యాన్ని… గతిశీలంగా, శక్తిమంతంగా శివుడు నాట్యం చేస్తున్న భంగిమలో స్పష్టంగా చూపించినట్టుగా మరెక్కడా కనిపించదు’ అంటాడు శ్రీలంకకు చెందిన కళా శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు ఆనంద కుమారస్వామి. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న ఐరోపా ఖండపు అణుపరిశోధన కేంద్రం (సీఈఆర్‌ఎన్) ముందు భారత ప్రభుత్వం బహూకరించిన నటరాజు విగ్రహం కొలువుదీరడం భారతీయ కళా రహస్యాలను ప్రపంచానికి వెల్లడించే ప్రయత్నమే.
No comments:
Post a Comment