Tuesday, February 4, 2025

 Vedantha panchadasi:
శాఖాభేదా త్కామభేదాచ్ఛ్రుతం కర్మాన్యథాన్యథా ౹
ఏవమత్రాపి మా శంకీత్యతః శ్రవణమాచరేత్   ౹౹ 100 ౹౹

100. శాఖలు,కోరికలు అనేక విధములుగ చెప్పబడినను బ్రహ్మజ్ఞానమందు అట్టి భేదము లేదు.  శ్రవణమును అభ్యసింపవలెను.

వ్యాఖ్య:- మొదటి హేతువు - శ్రుతిగత వైవిధ్యం - నివృత్తమవటానికి శ్రవణాది సాధనాలు అవసరం అని చెపుతున్నారు.

శాఖాభేదాలవల్లను, ఇచ్చాభేదాలవల్లను శ్రుతులయందు కర్మలు వేరువేరుగా చెప్పబడి ఉంటాయి.

ముక్తికోపనిషత్తునందు వేదశాఖలు 1180 ఉండెనని చెప్పబడినది.
ప్రతిశాఖయందును ఒక్కొక్క ఉపనిషత్తుగ 1180 ఉపనిషత్తులును అందు 
840 - ఉపనిషత్తులు కర్మకాండను గూర్చియు,
232 - ఉపాసనాకాండను గూర్చియు,
108 - ఉపనిషత్తులు బ్రహ్మమును గూర్చియు అనగా జ్ఞానకాండను గూర్చియు చెప్పును.

శాఖాభేదాన్ని బట్టి కర్మభేదం :
ఋగ్వేదము చదివినవాడు హోతృకర్మను అంటే స్త్రోత్ర,మంత్ర సంబంధములైన శాస్త్ర ములు;
యజుర్వేద జ్ఞాత అధ్వర్యు కర్మను అంటే ప్రయోజనమును బట్టి యజ్ఞాము చేయవలసిన క్రమము,పూజావిధానము,
స్తోత్రములు పాడుట;
సామవేద జ్ఞాత ఉద్గీథమనే కర్మను అంటే ప్రాయశ్చిత్తము - దోషమిమోచనకై చేయువిధానము నిర్వర్తిస్తాడు.
ఇది శాఖాభేదాన్ని బట్టి కలిగే కర్మభేదం కాని, సంవిద్బేదం మాత్రఉండదు. - జ్ఞానమనేది ఏకరూపం కలదైనందున.

కామభేదాన్ని బట్టి (ఇచ్ఛాభేదాన్ని బట్టి)కర్మభేదం :
వర్షాన్ని కోరేవాడు కారిరిష్టయాగం చేస్తాడు.
ఆయుర్దాయాన్ని కోరేవాడు శతకృష్ణల యాగం చేస్తాడు.
ఇట్లా కర్మభేదం ఉంటుంది.

అనేకములగు శాఖలుండుట చేతను, కోరికలు కూడా అనేకములు ఉండుట చేతను కర్మ అనేక విధములుగ శ్రుతియందు చెప్పబడినది.కానీ ఉపనిషత్తులయందు బోధింపబడిన బ్రహ్మజ్ఞానమునందు అట్టి భేదము లేదు.

అట్లాగే ఉపనిషత్తుల్లో కూడా ప్రతిపాదితమైన బ్రహ్మ విషయంలో సైతం అనుమానాలు వస్తే వాటి నివారణకోసం శ్రవణాదుల పునరావృత్తి అవసరమవుతుంది.
కావున శ్రవణమును  అభ్యసింపవలెను.
జ్ఞానదార్ఢ్యార్థము.

వేదాంతానా మశేషాణా మాదిమధ్యవసానతః ౹
బ్రహ్మాత్మన్యేవ తాత్పర్యమితి ధీః శ్రవణం భవేత్ ౹౹ 101 ౹౹

101. వేదాంతము ప్రారంభ,మధ్య,అంతమందు బ్రహ్మాత్మల ఐక్యమునే బోధించుచున్నవి.
నిశ్చయమునకు వచ్చుటయే శ్రవణము.

సమన్వయాధ్యాయ ఏతత్సూక్తం ధీస్వాస్థ్యకారిభిః  ౹
తర్కైః సంభావనార్థస్య ద్వితీయాధ్యాయ ఈరితా ౹౹102౹౹

102. సమన్వయాధ్యాయమున వాక్యములన్నింటికి బ్రహ్మాత్మైక్యము నందే తాత్పర్యము.రెండవ అధ్యాయమున ఆ విషయము సంభవమే అని నిరూపించిరి.

వ్యాఖ్య:-"ఉపనిషత్తుల యొక్క ఆది,మధ్య,అంతములందు ఎచ్చట ఆలోచించి చూచినా "బ్రహ్మము ప్రత్యగాత్మ" ల ఐక్యమునే బోధించుచున్నవి. సమస్త వేదాంత శాస్త్ర తాత్పర్యం అంతా 
"బ్రహ్మమే ప్రత్యగాత్మ" అనే విషయాన్ని ప్రతిపాదించటమే!"
అనే నిశ్చయాత్మకమైన బుద్ధిని పొందటమే శ్రవణం అవుతుంది.

వేదవాక్య తాత్పర్య నిర్ణాయక లింగాలు 1)ఉపక్రమోపసంహారాలు,
2)అభ్యాసం,3)అపూర్వత,
4)ఫలం,5)అర్థవాదం,
6)ఉపపత్తి   అనేవి.
ఈ షడ్విధ లింగాలనుబట్టి వేదవాక్యాల తాత్పర్యం నిర్ణయించాలి.

వేదాంతముల ప్రతిపాదితమైన బ్రహ్మ వస్తువును షడ్లింగముల ద్వారా గ్రహించుట శ్రవణ మనబడును.
కాన సద్గురువు వేదాంత వాక్య తాత్పర్యముల యొక్క 
షడ్విధ లింగముల చేత అద్వైతబ్రహ్మాపదేశమును ప్రతిపాదింపవలయును.

శ్రవణమంటే ఇది అని ఎక్కడ నిరూపింపబడ్డది అంటే వేదవ్యాసులు  
శ్రీ శంకరభగవత్పాదులు
బ్రహ్మసూత్రముల యందు  వేదాంతదర్శనంలో మొదటిదగు సమన్వయాధ్యాయమున ఈ శ్రవణాన్ని గూర్చి చక్కగా వివరించారు.బుద్ధిని స్థిరంగా ఉంచే తర్కాలద్వారా అర్థాన్ని చక్కగా ఊహించటానికై అనుసంధాన రూపమైన మననాన్ని గూర్చి రెండవదగు అవిరోధాధ్యాయమున ఆ విషయము సంభవమే అనీ యుక్తియుక్తముగ చక్కగా వివరించి నిరూపించారు.

మహావాక్య శ్రవణమే శ్రవణమగును.ఇట్టి శ్రవణము లేనిచో యథార్ధజ్ఞానము సంభవింపదు.
వాక్యార్థ శ్రవణముతోనే సమక్ జ్ఞానము జనించును.ఇదియే స్వస్వరూప జ్ఞానమని తెలియవలెను.

"తత్త్వమసి" మహావాక్యబోధ సామవేదీయ ఛాంగోపనిషత్తు షష్ఠాధ్యాయమునందు  ఉద్దాలక మునిచే తన పుత్రుడగు శ్వేతకేతుకు బోధింపబడెను.   

No comments:

Post a Comment