Vedantha panchadasi:
అనుసందధ తైవాత్ర భోజనాదౌ ప్రవర్తితుమ్ ౹
శక్యతేఽ త్యంత విక్షేపాభావాదాశు పునః స్మృతేః ౹౹125౹౹
తత్త్వ విస్మృతి మాత్రాన్నానర్థః కింతు విపర్యయాత్ ౹
విపర్యేతుం న కాలోఽ స్తి ఝటితి స్మరతః క్వచిత్ ౹౹126౹౹
125.126.భుజించుట వంటి అల్ప విషయములకు జిజ్ఞాసువు విక్షేపము నొందడు.
స్వల్ప మరుపైనా క్షణములో స్మరణ వచ్చును.విపరీతభావన కవకాశము లేదు.
తత్త్వస్మృతేరవసరో నాస్త్య
న్యాభ్యాస శాలినః ౹
ప్రత్యుతాభ్యాస ఘతిత్వాద్బలా త్తత్త్వ ముపేక్ష్యతే ౹౹127౹౹
127. భిన్నమైనవారు తత్త్వచింతన ఉపేక్షించును. అభ్యాసభంగము మహా హానికరము.
వ్యాఖ్య :- ముముక్షులైనవారు తత్త్వవిషయకమైన అనుసంధానము చేస్తూనే భోజనాది క్రియలలో ప్రవృత్తులవుతారు.
అందువల్ల విక్షేపము కలుగదా ? అంటే -
తత్త్వమునందే మనస్సు ఉంచగోరే జిజ్ఞాసువు భుజించుట మొదలగు పనుల వలన విక్షేపము నొందడు. అథవా కలిగిననూ అల్పమే కనుక త్వరలో తత్త్వస్మృతిని కొనిరాగలడు.
ముముక్షువులైనవారు తత్త్వవిషయకమైన అనుసంధానము చేస్తూనే భోజనాదిక్రియలలో ప్రవృత్తులౌతారు.అందువల్ల విక్షేపం ఏమీ ఉండదు.
భోజనాదులవలన విస్మృతి ఉండవచ్చు ! పెద్దగా విక్షేపం ఏమీ ఉండదు. ఎందుచేతనంటే, భోజన,స్నానాదుల కాగానే మళ్ళీ వెంటనే సాధకునికి తత్త్వజ్ఞాన స్మరణ కలుగుతుంది.
తత్త్వజ్ఞాన విస్మృతికంటే కూడా విక్షేపము వలననే ఎక్కువగా అనర్థం కలుగుతుంది.
తత్త్వమును మరచుట వలన పెద్దగా అనర్థం ఏమీ ఉండదు.ఎందుకనగా -
తత్త్వజ్ఞానమును క్షణములో స్మరణకు తెచ్చుకొనగలము కనుక అందు విపరీత భావన దృఢపడుటకు అవకాశము లేదు.
కానీ విపరీత జ్ఞానమువలన గొప్ప అనర్థమే కలుగుతుంది. శ్రీఘ్రంగా స్మరణకు తెచ్చుకొనే వానికి విపర్యం కలగటానికి సమయము ఎన్నడు ఉండదు.
భోజన,స్నానాదుల సమయాలలో విపర్యం కలగటం అసంభవం ! ఆ పని పూర్తికాగానే మళ్ళీ తత్త్వం స్మరణకు వస్తుంది.
భోజనాదులు చేసేవానిలో లాగానే,తర్కం మొదలైనవి అభ్యాసం చేసేవానికి తత్త్వస్మరణ ఎందుకు కలుగదు ? అంటే -
నైయాయికులు మొదలైన తర్కశాస్త్రాభ్యాసం చేసేవారికి తత్త్వస్ఫురణానికి అవకాశం లభించదు.ఎందుకనగా వారికి ఆ అభ్యాసం తత్త్వాభ్యాసానికి విరోధి కాబట్టి , ఆ సమయమునందు జ్ఞప్తికి తెచ్చుకొన్న తత్త్వంకూడా మళ్ళీ అకస్మాత్తుగా ప్రబలంగా మరపుకు వస్తుంది.
వేదాంత భిన్నములగు విషయములను ఎక్కువగా అభ్యసించే వారికి తత్త్వచింతనకు సమయము మిగలదు.
కాబట్టి విషయములు తత్త్వచింతనను ఉపేక్షించునట్లు కూడా చేయిను.
అభ్యాసభంగము మహా హానికరము.
స్వస్వరూపమును సంసార బంధనము లేనిదిగా జ్ఞానం ద్వారా తెల్సుకోవలయును గాని ఉపాసన ద్వారా లభ్యంగాదు.ఎందుకనగా అవిద్యకు కర్మలు విరోధముగానేరవు.కర్మలతో అవిద్యకు నివృత్తి లేదు.కాన వైరాగ్య పరుడు జితేంద్రయుడు అయిన సాధకుడు జ్ఞానమునకు విరోధులైన కర్మోపాసనలు తప్పక త్యజించాలి.కనుక మోక్షం అనేది జ్ఞానముతో తప్ప వేరు మార్గం ఎందుననూ లేదు.
" తత్త్వాను సంధానికి వ్యతిరేకమైనవన్నీ వదిలేయతగినవే ".
తమేవైకం విజానీథ హ్యన్యా వాచో విముంచథ ౹
ఇతి శ్రుతం తథాన్యత్ర వాచో విగ్లాపనం త్వితి ౹౹128౹౹
ఆహారాది త్యజన్నైవ జీవేచ్ఛాస్త్రాన్తరం త్యజన్ ౹
కిం న జీవసి యేనైవం కరోష్యత్ర దురాగ్రహమ్ ౹౹129౹౹
128, 129. ఏకము మాత్రము తెలిసికొని ఇతర వాక్కు, పలుకులు,శాస్త్రములు పరిత్యజించుము.
వ్యాఖ్య:- తత్త్వనుసంధమునకు ఇవి వ్యతిరేకము కదా ! అని అనిపించినది ఏదైనాసరే తక్షణము వదిలేయవలెను.
అందుకు శ్రుతి ప్రమాణాలను కూడా చూద్ధాం -
"తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో విముంచథామృతస్యైష సేతుః"
ముం 2-2-5
ఆ ఆత్మ నొక్కదానినే తెలుసుకో !
ఆ ఆత్మ తత్త్వానికి భిన్నమైన వస్తువులను,ప్రతిపాదించే ఇతర వాక్కును త్యజించవలెను.
ఎంచేతనంటే - దాని ప్రతిఫలము అమృతత్త్వానికి సేతువు వంటిది.
అట్లాగే,
"నానుధ్యాయాద్బహున్ఛబ్దా న్వాచో విగ్లాపనం హి తత్" -
బృ. 4-4-21 శాట్యా 23.
అనాత్మక విషయకమైన అధ్యయనం కేవలం మనస్సుకు , వాక్కుకు శ్రమను మాత్రమే కలిగిస్తుంది;
అని బృహదారణ్యక, శాట్యాయనోపనిషత్తులు చెపుతున్నాయి.
ఈ జీవుని యొక్క దుఃఖమయ సంసారమును గూర్చి
"శ్రీమదాద్య శంకరాచార్యులవారు" తమ
"ఆత్మానాత్మ వివేకము" లో ఇట్లు చెప్పియున్నారు -
అనగా , అజ్ఞానం వల్ల అవివేకం కలుగుతుంది.
అవివేకం వల్ల రాగాదులు పుడుతున్నాయి.
రాగాదుల వలన కర్మలు పుడుతున్నాయి.
కర్మ వలన శరీర బంధనం కలుగుతుంది.
శరీర బంధనం వలన దుఃఖం కలుగుతుంది.
మాయ,త్రిగుణాత్మకము,
జ్ఞాన విరోధియైన భావాన్నే అజ్ఞానం అంటారు.
ఈ జ్ఞానవిరోధియైన ఈ
"నేను అజ్ఞానిని" భావాన్నే మాటల ద్వారా అనుభవంలో వ్యక్తం చేస్తారు.
"నేను నేను" అనే జీవునికి దుఃఖం సంప్రాప్తి క్రమక్రమముగా దేహధారణ జరుగుచున్నది.
దుఃఖము పూర్తిగా నశించుటకు బ్రహ్మజ్ఞాన మొక్కటే సాక్షాత్సాదనమని స్పష్టముగా తెలియుచున్నది.
ఇక స్వస్వరూపమైన బ్రహ్మవిచారమును గూర్చి వేదవ్యాస భగవానుడు బ్రహ్మ సూత్రములయందు ప్రధమమున
"అథాతో బ్రహ్మ జిజ్ఞాసా" అని తెలిపియున్నారు.
కర్మ ఫలితము అనిత్యము జ్ఞానఫలము నిత్యముగుట వలన బ్రహ్మవిచారము చేయవలయును అని ప్రతిపాదింపబడినది.
ఆ ఏకమును మాత్రము తెలుసుకొనవలయును ఇతరములైన వాక్కులు పరిత్యజింపలెను.
"అనేకములగు మాటలను పలుకుట వాక్కునకు పరిశ్రమ మాత్రమే" అనీ శ్రుతియందు చెప్పబడినది.
ఆహారాన్ని వదలలేనట్లే ఇతర శాస్త్రాభ్యాసాల్ని సైతం వదలలేము అనేవారు వున్నారు.
ఆహారాన్ని తినకపోతే మానవుడు బ్రతకలేడు.కాని,
ఏ ఇతర శాస్త్రాల విషయమై పట్టుబడవలసిన పనేముంది?
వాటిని అభ్యసించక పోయినా మానవుడు బ్రతకలేడా ?
తత్త్వవ్యతిరేకమైనవి,
జ్ఞాన విరుద్ధమైనవి అయిన వ్యర్థశాస్త్రములయందు అభినివేశము లేక పరిత్యజింపవలెను.
No comments:
Post a Comment