Monday, February 10, 2025

 Vedantha panchadasi:
సాక్షాత్కృతాత్మధీః సమ్యగవిపర్యయ బాధితః ౹
కిమిచ్ఛన్ కస్యకామాయ శరీరమను సంజ్వరేత్ 
౹౹135౹౹
జగన్మిథ్యాత్వధీభావాదాక్షిప్తౌ కామ్యకాముకౌ ౹
తయోరభవే సంతాపః శామ్యేన్నిః స్నేహదీపవత్ ౹౹136౹౹

135.136.సాక్షాత్కారము నొందిన జ్ఞానిని విపరీత భావనలు బాధింపవు. మిథ్యాబోధ వలన కామ్య ,కామి రెండును మిథ్యే అయిన దుఃఖము నూనెలేని దీపమే అగును.

గంధర్వ పత్తనే కించిన్నైంద్రజాలిక నిర్మితే ౹
జానన్కామయతే కింతు జిహాసతి హసన్నిదమ్ 
౹౹137౹౹
పాతరమణీయేషు భోగేష్వేవం విచారవాన్ ౹
నానురజ్యతి కిన్త్వేతాన్దోషదృష్ట్యా జిహాసతి ౹౹138౹౹

137.138.భ్రమాజన్య గంధర్వనగరమును ఎవడును వాంఛింపడు.భోగముల యందు దోషములచే వానిని వదులును.

వ్యాఖ్య :-"ఆత్మానం చేద్విజానీయాదయమస్మీతి పూరషః" - అనే శ్రుతి వాక్యం యొక్క పూర్వార్థం పూర్తయినది.ఇక ఉత్తరార్థం.

చక్కగా ఆత్మ తత్త్వాన్ని సాక్షాత్కరింపజేసుకొన్న జ్ఞాని విపర్యయ వృత్తిచేత బంధితుడు కాడు.అంటే విపరీత భావనల చేత బాధింపబడడు.
అటువంటివాడు ఏ వస్తువును కోరతాడు ?

అతడు కోరదగిన వస్తువు ఏదీ లేదు.అతడిక దేనిని కోరి దేని కోరికను అనుసరించి శరీరతాపములతో కూడి పరితపించును ? అంటే -
ఏ కోరిక కోసం ఈ శరీరం వెంటబడి సంతృప్తుడౌతాడు. అతడికి ఏకోరికా ఉండదు. శరీరం మీద ఆసక్తీ ఉండదు అని భావం.

జ్ఞానికి జగన్మిధ్యాత్వ బుద్ధి కలిగినందువల్ల 
కామ్యకాముక భావం,
భోగ్య భోక్తృత్వభావం అనేవి నిరాకరింపబడినాయి.అంటే 
జగత్తు మిథ్యయనే బోధ కలిగినంతనే జగత్తునందలి కామ్య విషయము,వానిని కామించు పురుషుడు రెండూ మిథ్యయే అగును.

ఇక ఆ రెండూ లేవు కాబట్టి కోరికలవల్ల కలిగే సంతాపం నూనెలేని దీపంలాగా దానంతట అదే శమించి అంతరించును.

కామ్యం లేనప్పుడు కామన కూడా ఉండదని ఎట్లా చెప్పగలరు ? అంటే -

ఇంద్రజాలకుడు సృష్టించిన గంధర్వ పట్టణాన్ని చూచినప్పుడు ఇది ఇంద్రజాలమని తెలిసినందున దానిని పొందాలనే కోరిక ఉండదు.
ధనం, గంధర్వనగరము  ఇంద్రజాలకుడు సృష్టించిన దని తెలుసుకదా ఇక దానిని ఎవడునూ వాంఛింపడు కదా !అది మాయాధనం కదా ఇక దానిని ఎలా కోరుకుంటాడు.

ఈ భ్రమ ఎంత అద్భుతము అని దానిని జూచి నవ్వును.
ఇది మిథ్య అని తెలుసుకొని నవ్వుకుంటూ దానిని వదిలివేయాలనుకుంటాడు.

వివేకశీలుడైనవాడు ఆ పాత రమణీయమైన పదార్థాలయందలి అంటే,
కేవలం పైకి మాత్రమే
 అందంగా ఉండే పూలమాల,గంధం,ధనం,
కవిత్వం మొదలైనవాటి బాహ్య సౌందర్యాన్ని చక్కగా విమర్శించుకొని వాటియందు భోగాసక్తిని చూపడు.

అంతేగాక వాటియెడల దోషదృష్టితో వాటిని త్యజించాలని కోరతాడు.

పైచూపులకు మాత్రమే రమణీయములైన భోగములను గూర్చి ఈ విధముగా చింతించుచూ జ్ఞాని వాటియందు ప్రీతినొందడు. వానియందలి 
దుఃఖ యోనిత్వాది దోషములను గమనించి వానిని వదిలి పెట్టును.

ఈ ప్రకారము నామరూపములనబడు వికారములతో మిథ్యయై కన్పించు ఈ జగత్తు,
తన అధిష్టానమైయున్న బ్రహ్మమునకు దోషము కల్పింపలేదు.

ఎట్లనగా ఎంతకాలము జరిగినను ఎండమావులలోని నీరు భూమిని తడుపజాలనట్లు,
రజ్జుసర్పం ఎవరిని కరువలేనట్లు మిథ్యయైన ఈ జగత్తు తనకు ఆధారమైయున్న బ్రహ్మమును స్పృశింపనేలేదు.

అర్థానా మార్జనే క్లేశః తథైవ పరిపాలనే ౹
నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగరాన్ల్కే శకారిణః ౹౹139౹౹

139.దుఃఖములకు కారణమగు ఈ సంపదలకు ధిక్కారము.

మాంసపాఞ్చాలికాయాస్తు యన్త్రలోలేఙ్గపఞ్జరే ౹
స్నాయ్వస్థి గ్రన్థిశాలిన్యాః స్త్రీయాః కిమివ శోభనమ్ ౹౹140౹౹

140.మాంసపు యంత్రము వలె కదలు స్త్రీలయందు శోభనమైనది ఏమి కలదు.

ఏవమాదిషు శాస్త్రేషు దోషాః సమ్యక్ ప్రపఞ్చితాః ౹
విమృశన్ననిశం తాని కథం దుఃఖేషు మజ్జతి ౹౹141౹౹

141. శాస్త్రములయందు విషయభోగమునందలి దోషములు చక్కగా వివరించి వుండగా ఇక దుఃఖమునందు మునగడని భావము.

వ్యాఖ్య:- మనం ఇప్పుడు లోకాన్ని పరమార్థ దృష్టిలో పరిశీలన చేస్తున్నాం కనుక పరమార్థ సిద్ధికి అనుకూలమైనదే నిజమైన మంచి అలాకానిది నిజమైన చెడు.

వాల్మీకి మహర్షి యోగవాశిష్ఠం లోని మొట్టమొదటిదైన వైరాగ్య ప్రకరణమునందు ఐశ్వర్యాన్ని గురించి,అనగా సంపదల గురించి శ్రీరాముడు ఎలా విచీకరణ చేసాడో వర్ణించారు.

శ్రీరాముడు సంపద రాకడా పోకడా రెండూ కూడా దుఃఖాలకు హేతువే అని నిరూపించాడు.అంటే -

సంపదలను ఆర్జించుటయందు దుఃఖము దానిని రక్షించుట యందు దుఃఖము.అవి నశించినా దుఃఖమే, ఖర్చయినను దుఃఖమే.కనుక ఐశ్వర్యంలో వున్న దోషాలను సుమారుగా 20 కోణొల్లోంచి పరిశీలించి చివరిసారంగా -

"న శ్రీస్సుఖాయ భగవన్
దుఃఖాయైవ హి వర్ధతే"
వై.ప్ర.స. 13, శ్లో.10  --

అని తేల్చాడు.అంటే -
సంపద వల్ల కనీసం లౌకికసుఖంకూడా లేదు.కనుక దీని వల్ల నిరంతరం దుఃఖమే ఖాయం అని తేల్చాడు.
కాబట్టి అటువంటి ధనం తృణీకరింప దగ్గది.

తృష్ణ మనుషులలో సుగుణాలను మిగలనీయదు.వారికి మూర్ఖత్వాన్ని అంటగడుతుంది.
ఎంతో ఉన్నతుడుగా కనిపించిన వ్యక్తి అయినా సరే,
మేరునగధీరుడైనా సరే,
అన్నీచదివిన ప్రాజ్ఞుడైనా సరే,
అరవీరభయంకరుడైనా సరే,
తృష్ణ తలచుకుంటే వాడిని నిమిషంలో గడ్డిపరకను ఊదేసినట్లుగా ఊదేస్తుంది.
ఆడదాని కోసం పడే తృష్ణ కూడా ఇటువంటిదే.

స్నాయువులు(నరములు),
ఎముకలు,మాంసం,గ్రంథులు మొదలైన వాటితో కూడిన మాంసపు బొమ్మలవంటివారు స్త్రీలు.అంగముచే చలిస్తూ చంచలంగా ఉండే యంత్రంలాంటి శరీరమనే పంజరంలో ఏమి సౌందర్యం ఉంది ?

అట్లాగే - చర్మం ,మాంసం,రక్తం,
అశ్రువులు మొదలైన ప్రపంచములో కనిపించే వస్తువులయందలి దోషాలను  విశ్లేషించి విమర్శించి శాస్త్రాలు మనకు బాగానే చూపించాయి.

వాశిష్టరామాయణము నందును విషయభోగములనందలి దోషములను చక్కగా వివరింపబడినవి.నిరంతరము వానిని పర్యాలోచించుచుండగా దుఃఖములందెట్లు మునుగగలడు.

అంటే - ఈ దోషాలను ఎల్లప్పుడు విమర్శించుకొనే వ్యక్తి ఆ దుఃఖాలలో ఎందుకు మునిగి పోతాడు?ఆ దుఃఖాలలో పడి కొట్టుకొనిపోడు అని భావం.
విషయానుస్మరణే తృష్ణకు కారణం.దానియందు సంగత్వం 
పెరిగి కోరిక కలిగి అది ముదరడమే తృష్ణ.

మెరుపులు,శరత్కాలపు మేఘాలు,గంధర్వ నగరాలు మొదలయిన పదార్థాలు ఒకదానితో ఒకటి పోటీపడి నశించును.వాటిమీదకూడా పోటీచేసి గెలిచిన పదార్థం ఈ దేహం.కావున దేహాన్ని గడ్డిపోచకంటే తక్కువగా చూడమని శ్రీరామచంద్రుడు 62 శ్లోకంలో ప్రత్యేకంగా చర్చించాడు.
ఈ విధమైన విచారణ, దోషదృష్టివల్ల భోగేచ్ఛ నశిస్తుంది.        

No comments:

Post a Comment