Wednesday, February 12, 2025

 Vedantha panchadasi:
క్షుధయాపీడ్యమానో ఽ పి న విషం హ్యత్తుమిచ్ఛతి ౹
మిష్టాన్నధ్వస్తతృడ్ జానన్నామూఢస్తజ్జిఘత్సతి౹౹

 142.ఎంతటి ఆకలి మీద వున్నను విషం కలిసిన మృష్టాన్న భోజనాదులను కోరడు కదా !

ప్రారబ్ధకర్మప్రాబల్యాద్భోగేష్విచ్ఛా భవేద్యది ౹
క్లిశ్యన్నేవ తదాప్యేష భుఙ్త్కే విష్టిగృహీతవత్ ౹౹143౹౹

భుఞ్జానా వా అపి బుధాః శ్రద్ధావన్తః కుటుంబినః ౹
నాద్యాపి కర్మ నచ్ఛిన్నమితి క్లిశ్యన్తి సన్తతమ్ ౹౹144౹౹

143,144.ప్రారబ్ధవశమున భోగముయందు ఇచ్చ కలిగినచో విచారముతో కూలివానివలే గడుపును.

వ్యాఖ్య :- ఆకలిచేత ఎంత పీడింపబడుచున్నను తెలిసి తెలిసి విషమును తినాలని ఎవ్వరును అనుకోరు.
పంచభక్ష పరమాన్నాలు ముందుండినను అందు విషము కలిసినదని తెలిసిన తినుటకు ఎంతమాత్రమూ ఇచ్చగించడు.
"ఇది విషం" అని తెలిసిన మరుక్షణమున ఆకలి ఉన్నను లేకపోయినను తెలిసి దానిని ఎవ్వరును కోరరు.

అట్లే భోగవిషయములందలి దుఃఖ జనకత్వమును ఎరిగిన ప్రాజ్ఞుడు వానిని కోరడని భావము.ఒకవేళ జ్ఞానియైనవానికి అతని ప్రారబ్ధకర్మ ప్రాబల్యంవల్ల భోగాలు అనుభవించవలసి వచ్చిన,
అటువంటివాడు - జీతానికి పనిచేసే ఉద్యోగి 
ఎలాగైతే తన పని పూర్తిచేస్తాడో అలా పూర్తిచేస్తాడు.

విద్వాంసుడు ఆసక్తితో భోగాలు అనుభవించడు అని ఎలా అనుకోవాలి ? అంటే -
సద్గృహస్థుడు,శ్రద్థాళువు అయిన జ్ఞాని భోగాల్ని అనుభవిస్తూ కూడా " అయ్యో ఈ నాటివరకు ఇంకా పూర్వజన్మోపార్జితమైన మా కర్మబంధము క్షయంకాలేదుకదా !" అని లోలోపల సంతతము విచారింతురు.

మజ్జిగలో వుంటూనే కూడా వెన్న అందులో కలవక తేలుతున్న విధముగా, వ్యవహార దశలో తగొల్కొన్నట్లు అనగా , కర్తృత్వము ఉన్నట్లుగా తోస్తున్నదేగానీ జ్ఞాని దేనికీ అంటకవుంటాడు.

"ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శిత యాత్మాని
ఉభయత్రా వికారిత్వం జీవన్ముక్తస్య లక్షణమ్"
మహావాక్యదర్పణం  - 273

ఇంపైనట్టియు ఇంపుకానట్టియు పదార్థములను(విషయములను) సమముగా జూచువాడగుటచే రాగ ద్వేషములు లేకుండుటయే జీవన్ముక్తుని లక్షణము.

ఏది తనస్వరూపమో ,మార్పునొందదో నిర్ణయమైన జ్ఞానిపురుషుడికి పరమార్థ మందు ప్రారబ్ధము ద్వారా కర్మ జరుగుచున్నను సమచిత్తుడై వుండును కావున ఫలితము తనను ఎలా బంధించ గలదు ?

అగ్ని సర్వపదార్థములను భక్షించి వాటి గుణములను అంటుకోనటుల 
"అకర్తాత్మ" జ్ఞాన మహిమచే కర్మ ఫలములు స్పృశింపవు.

ఇదియే జీవన్ముక్తుని వైభవము.

నాయం క్లేశోఽ త్ర సంసారతాపః కింన్తు విరక్తతా ౹
భ్రాంతిజ్ఞాన నిదానో హి తాపః సంసారికస్సృతః ౹౹145౹౹

145. వైరాగ్యమే,జగత్తును గూర్చిన భ్రాంతి జ్ఞానము వలన  కలిగిన దుఃఖమే సంసారిక దుఃఖమనబడినది.

వివేకేన పరిక్లిశ్యన్నల్పభోగేన తృప్యతి ౹
అన్యథానన్తభోగేఽ పి నైవ తృప్యతి కర్హిచిత్      ౹౹146౹౹
న జాతు కామః కామానాముపభోగేన శ్యామ్యతి ౹
హవిషా కృష్టా వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే            ౹౹147౹౹

146.147.వివేకి అల్ప భోగముచేత తృప్తినొందును.
అవివేకి ఏనాటికీ సంతుష్టి నొందడు.కోరికలు తీర్చేకొలది విజృంభించును.

పరిజ్ఞాయోపభుక్తో హి భోగో భవతి తుష‌్టయే  l
విజ్ఞాన సేవితశ్చోరో మైత్రీమేతి న చోరతామ్    ll148ll

148.భోగమునందలి అనిత్యాది దోషములు తెలిసి అనుభవించినపుడు తృప్తినీయవచ్చు.చోరుని ఆదరించిన మిత్రునిగా ప్రవర్తించును.

వ్యాఖ్య:- జ్ఞానికి సంసారిక క్లేశం ఉండకూడదు గదా ! అంటే -

స్వస్వరూపమున సంసారబంధము లేనిదిగా నిర్ణయమయిన జ్ఞానికి విరోధములైనవేవీ వుండవు.
ఈ విధమైన క్లేశం(అనుతాపం) మామూలుగా కలిగే సంసారిక కష్టం కాదు. 

అది వైరాగ్యము. సంసారమందు ఆసక్తి లేకపోవుటమనే విరక్తిభావం అవుతుంది.ఎందుచేతనంటే సంసారికమైన సంతాపం అనేది భ్రాంతి జ్ఞానము వలన కలుగుతుందని చెప్పబడ్డది.
ఇక్కడ జ్ఞానికి కలిగే క్లేశమనేది వివేకజ్ఞానము వలన కలిగేది కాబట్టి ఇది సంసారిక క్లేశం కాదు.

ఈ క్లేశం వివేకము వలన కలిగిందా ? లేక 
అవివేకము వలన కలిగిందా ?
అనేది ఎట్లా తెలుస్తుంది,అంటే-

జ్ఞానియైనవాడు వివేకజ్ఞానం ద్వారా  అల్పమైన భోగంతోనే పరితృప్తుడౌతూ ఉంటాడు.
అదే వివేకమూలకం గనుక కాకపోతే అనేక రకాల భోగాలు అనుభవిస్తూ కూడా అజ్ఞానియైనవాడు తృప్తుడు కాడు.

వివేకికి,అవివేకికి కూడా భోగం వల్లనే తృప్తి కలుగుతుంది కదా !   ఇక వివేకంవలన ప్రయోజనమేమిటి? అని శంక.ఇందుకు సమాధానం .
అంటే - 
అవివేక మూలకమైనట్టి భోగాలను అనుభవించాలనే కామం , 
విషయాలను అనుభవించినందున శాంతించదు. పైగా , నేయిపోయగా అగ్నిజ్వాలలు ఇంకా ప్రజ్వలించినట్లుగా అనుభవించిన కొద్దీ ఆ కామం ఇంకా విజృంభించును. కోరిక ఇంకా పెరుగుతుంది ఏనాటికీ తీరవు.

వివేక మూలకమైన భోగం తృప్తికి కారణమౌతుంది.
మనుసంహిత - 2.94
ఈ యయాతి మహారాజు కథ భాగవత పురాణమునందు వచ్చును.
"ఆయం భోగ ఏతావాన్ , ఏవంప్రయాస సాధ్యం" ౼
నారద పరివ్రాజక. ఉప. 3-37

ఈ భోగములు ఇంతటి పరిణామం కలది,ఇంతటి ప్రయాస సాధ్యమైనది అని వాని అనిత్యాది స్వరూపాన్ని తెలుసుకొని అనుభవించిన తప్పకుండా తృప్తికి హేతువు అవుతుంది.

తృష్ణకు కారణమైన భోగం, వివేక సాహచర్యం కలిగినంత మాత్రంచేత తృప్తిని ఎట్లా ఇవ్వగలుగుతుంది ? అంటే -
దొంగ అని తెలిసినప్పటికీ వానిని ఆదరించిన ఆ దొంగయే మంచివానికి మిత్రుడవుతాడు చోరునివలే ప్రవర్తింపడు. కాని ,మంచివాడు దొంగగాడు. అతడని దృష్టిలో అతడు దొంగగా ఉండడు.

 అనగా పురుషుడు(ఆత్మ) స్వాభావికంగా అసంగుడు. అసంగ వస్తువనగా ఏదైతే దేనియందుగూడి యున్నప్పటికీ తన అసంగత్వమును వీడదో అది అసంగవస్తు వనబడుతుంది.

ఆత్మ , కల్పిత వస్తువులయిన అహంకారం మొదలుకొని స్థూలదేహ పర్యంతము కల్పిత అభిమానంతో "నేను నేను" అని ఉన్నప్పటికి తన అసంగత్వమును వీడదు.              

No comments:

Post a Comment