Vedantha panchadasi:
మనసో నిగృహీతస్య లీలాభోగోఽ ల్పకోఽ పి యః ౹
తమేవాలబ్ధ విస్తారం క్లిష్టత్వాద్బహు మన్యతే
౹౹149౹౹
బద్ధముక్తో మహీపాలో గ్రామమాత్రేణ తుష్యతి ౹
పరేనసద్ధా నాక్రాన్తో న రాష్ట్రం బహుమన్యతే
౹౹150౹౹
149.150. మనోజయమునొందినవారు భోగముల అనిత్యం తెలిసి లభించినదే ఎక్కువని భావించును.అట్లు జయింపని వారు దేశపు ప్రభుత్వము లభించినను కూడా అతడు గొప్పగా భావింపడు గదా !
వ్యాఖ్య:- కోరికల్ని అనుభవించే మనస్సు అల్పభోగాలతో ఎట్లా తృప్తి పొందుతుంది ? అంటే -
వివేకముద్వారా నిగ్రహింపబడిన మనస్సుకు - యోగం ద్వారా వశం చేసుకోబడిన మనస్సుకు - అల్పాంశంలోనైన లీలానుభవం,క్రీడానుభవం లభిస్తే ఆ సాధకుడు ఆ అల్పభోగాన్నే క్లేశమయమైనదనే అనుభవం కారణంగా , ఆ అల్ప భోగాన్నే ఎక్కువదిగా భావిస్తాడు.
అంటే,సాధకుడు యమ నియమాల ద్వారా మనస్సును పూర్తిగా వశపరచుకొన్నందున ఆ మనస్సుమీద కామాది విక్షేపాలు చాలా అల్పంగా ఉంటాయి.అందుచేతనే జ్ఞానియొక్క మనస్సు అల్పభోగంతోనే తృప్తిపొందుతుంది.
మనోజయమునునొందిన పురుషుడు భోగములు అనిత్యములు దుఃఖజనకములు అని తెలుసుకొనుటచే లభించినదే ఎక్కువయని భావించును. దేహరక్షణకు,పరోపకారనిమిత్తమే ఆ అల్పసుఖములు కూడా స్వీకరించును.
ఇందుకు దృష్టాంతం -
యుద్దములో ఇతరులచే బంధింపబడి పిమ్మట విముక్తుడైన రాజు కేవలం ఒక గ్రామం లభించినా తృప్తిపడతాడు.
కాని, ఎన్నడూ బంధింపబడని రాజు ఏ శత్రువు యొక్క దండయాత్రనూ అనుభవించని రాజు తన శత్రురాజు ఎన్ని రాష్ట్రాలు ఆధిపత్యము ఇచ్చినా లేక దేశపు ప్రభుత్వాన్నే ఇచ్చినా గొప్పగా భావింపడు తృప్తిపడడు.ఇంకా అల్పంగానే భావిస్తాడు.
సుఖ దుఖఃములందు సముడైన ధీరపురుషుని ఇంద్రియ విషయ సంయోగములు పీడింపలేవు. నాదబిందు కళలు తెలియబడినను క్షణభంగురములుగా చూచును. అట్టివాడు మోక్షమునకు అర్హుడు.
కాన ఈ జగత్తునందు ఈ దేహముచే ఏ సుఖములు అనుభవించ బడుచున్నవో అట్టి సుఖములు క్షణభంగురములు,
అశాశ్వితములు అని తలంచి శాశ్వత వస్తువుకై ప్రయత్నించాలి.
జ్ఞానులైనవారు స్వయంగా అవతార పురుషుడైనా అన్ని ధర్మాలని అనుసరించాడు.
ఏకర్తవ్యమూ లేకున్నా లోకాన్ని మంచిమార్గములో పెట్టడానికి లోకధర్మాలన్నీ అనుసరిస్తాడు. అలాచేయకుంటే లోకులు కూడా మానేస్తారు.అందుకని లోకానికి ఆదర్శంగా ఉండటంకోసం కొన్ని ధర్మాలని పాటించాలి.
యోగులు అహంకారము లేక చిత్తసుద్ధి కొరకు మాత్రమే కర్మలు చేస్తారు.ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు.
ఆత్మనిష్ఠుడు కర్మ సంకల్పం చేయక ఇతరులతో చేయింపక నవద్వారాలు గల శరీరంలో సుఖంగా ఉంటాడు.
ఎవరైతే ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మత్వం, బ్రహ్మానందం లభిస్తుంది.
వివేకే జాగ్రతి సతి దోషదర్శన లక్షణే ౹
కథమాబ్థ కర్మాపి భోగేచ్ఛాం జనయిష్యతి
౹౹ 151 ౹౹
నైష దోషో యతోఽ నేకవిధం ప్రారబ్ధమీక్ష్యతే ౹
ఇచ్ఛాఽ నిచ్ఛా పరేచ్ఛా చ ప్రారబ్ధం త్రివిధం స్మృతమ్ ౹౹152౹౹
వివేకము జాగృతమై ఉండగా ప్రారబ్ధకర్మయైన భోగేచ్ఛ ఎట్లు కలిగించును?
ఇచ్ఛచే,ఇచ్ఛలేక,ఇతరుల ఇచ్ఛచే.
అపథ్య సేవినశ్చోరా రాజదారరతా అపి ౹
జానన్త ఏవ స్వానర్థ మిచ్ఛన్త్యారబ్ధకర్మతః ౹౹153౹౹
న చాత్రైతద్వొరయితుమీశ్వరేణాపి శక్యతే౹
యత ఈశ్వర ఏవాహ గీతాయామర్జునం ప్రతి ౹౹154౹౹
రోగి అపథ్యాన్ని,రాణిని రమించుగోరువారూ, దొంగ వీరు వచ్చుఅనర్థమును స్పష్టముగనే ఎరుగుదురు.
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ జ్ఞానవానపి ౹
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి
౹౹155౹౹
అవశ్యంభావిభావానాం ప్రతీకారో భవేద్యది ౹
తదా దుఃఖైర్న లిప్యేరన్నల రామ యుధిష్టిరాః
౹౹156౹౹
న చేశ్వరత్వమీశస్య హీయతే తావతా యతః ౹
అవశ్యం భావితాప్యేషా మీశ్వరేణైవ నిర్మితా
౹౹157౹౹
జ్ఞానులైనవారుకూడా ప్రారబ్ధానుగుణంగా ప్రవర్తింతురు. నలుడు, శ్రీరాముడు,యుధిష్టరుడు కష్టాలు ఇవే.ఇట్టి ప్రారబ్ధము కలిగించినది కూడా ఈశ్వరుడే.
వ్యాఖ్య:-
" భోగవిషయములందలి దోషములను జూచు వివేకము నిరంతరము జాగృతమై ఉండగా ప్రారబ్ధకర్మయైన భోగేచ్చ ఎట్లు కలిగించును ? అని సంశయము.
వివేకజ్ఞానము,ఇచ్ఛ అనే ఈ రెండూ పరస్పరము విరోధులుగదా !" అని శంకించవచ్చు.
ఇందుకు సమాధానం -
ప్రారబ్ధమనేది అనేక రకాలుగా వుంటుంది.కాబట్టి పై శంక యుక్తంకాదు.
ఇచ్ఛ,అనిచ్ఛ,పరేచ్ఛ అని ప్రారబ్ధం మూడు విధములుగా ఉంటుంది.
తన ఇచ్ఛచే
(ఇచ్ఛననుసరించి)
భోగాల్ని కలిగించే ప్రారబ్ధం;
తన అనిచ్ఛ
(ఇచ్ఛ లేకపోవుటచే) వలన భోగాల్ని కలిగించేవి;
పరేచ్ఛ - ఇతరుల ఇచ్ఛననుసరించి భోగాల్ని కలిగించే ప్రారబ్ధం ఇలా అనేక రకాలుగా వుంటుంది.
తన ఇచ్ఛను బట్టి భోగాన్ని యిచ్చే ప్రారబ్ధాన్ని గురించి...
అనారోగ్యంతో వున్నవానికి వైద్యుడు పథ్యం ఉండమంటారు కానీ వాడు తినకూడని పదార్థాన్ని అపథ్యాన్ని సేవించిన ఏమవుతుంది ? అలాగే -
రాజుగారి భార్య అయిన రాణిపై మనసుపడి రమించగోరు ఆసక్తి కలిగినవానికీ తెలుసు కలగబోయే అనర్థం.
మరియు చోరుడు(దొంగ) కును తెలుసు పట్టుబడిన తరువాత జరుగునది.
ఇలా వీళ్ళందరును తమకు కలుగబోయే అనర్థములైన రోగంవస్తుందనీ,
శిక్షపడుతుందనీ,
చావు వస్తుందని స్పష్టముగనే ఎరుగుదురు.ఐనాకానీ అలాగే చేస్తారు ఎందుకని ?
అంటే - ప్రారబ్ధకర్మకు వశుడై ఆయా అనర్థాలు కలిగించే వాటియందు కోరిక కలిగి ఉంటాడు.
అపథ్యసేవనాదులు మొదలైనవి ప్రారబ్థ ఫల స్వరూపాలు ఎట్లా అవుతాయి ? అంటే -
ఈ లోకంలో అపథ్యసేవనాదుల్ని ఈశ్వరుడు కూడా వారించలేడు.ఈ విషయములో ఈశ్వరుడు కూడా అసమర్థడే!
ఎందుచేతనంటే, వివేకవంతులైనవారు సైతం తమ ప్రకృతి వెంబడి పోకతప్పదు.
సకలజీవరాసులూ ప్రకృతినే అనుసరించును.
నిగ్రహమేమి చేయగలదు. ప్రారబ్ధాన్ని అనుసరించి పోకతప్పదు; అని గీతయందు ఈశ్వరుడే అర్జునునితో ఇట్లనెను. గీత : 3.33
గీతావచనం -
ప్రాణులు తమ స్వభావానికి లోనై కర్మలు చేేస్తూ ఉంటాయి. జ్ఞాని సైతం తన ప్రకృతి ననుసరించి కర్మలు చేస్తూ ఉంటాడు.
జ్ఞానికైనప్పటికీ పూర్వజన్మలో చేసి సంపాదించుకొన్న శుభాశుభ సంస్కారాలు ఈ జన్మలో అభివ్యక్తమౌతూ ఉంటాయి.
ఇక పామరుల విషయం చెప్పేదేముంది ? అందుచేత ప్రవృత్తిని గాని నివృత్తిని గాని ఆపాలని ఎంత ప్రయత్నించినా వ్యర్థమే.
అవశ్యం భావియైనట్టి - తప్పకుండా జరగాల్సి ఉన్నట్టి -
దుఃఖాన్ని తప్పించటం ఎవరికీ శక్యంకాదు.
అట్లా శక్యమైయుంటే
నలుని వంటి ధీరుడు, రామునివంటి జ్ఞాని,
యుధిష్ఠిరునిలాంటి సత్యవ్రతుడు దుఃఖాలను అనుభవించేవారే కారు.
జరుగక తప్పనిదగు ప్రారబ్ధమునకు ప్రతీకారముండినచో నలుడు,శ్రీరాముడు,
యుధిష్టరుడు కష్టాలుపాలు గాకుండెడి వారు.
ప్రారబ్ధానికి ప్రతీకారం చేయలేకపోయినంత మాత్రంచేత ఈశ్వరుని ఈశ్వరత్వానికి లోటురాదు.
ఎందుచేతనంటే ఇది ప్రారబ్ధము - దుఃఖాదుల్ని అపరిహార్యాలుగా - తప్పించుకోవటానికి వీలులేని వానినిగా నిర్మించింది కూడా ఈశ్వరుడే కదా !
ఇదంతయూ ఇచ్ఛాపూర్వక ప్రారబ్ధమే.
No comments:
Post a Comment