Vedantha panchadasi:
దగ్ధబీజమరోహే ఽ పి భక్షణాయోపయుజ్యతే ౹
విద్వదిచ్ఛాప్యల్పభోగం కుర్యాన్న వ్యసనం బహు ౹౹165౹౹
వేపిన గింజలు కూడా ఉపయోగపడును, జ్ఞాని వలే.
భోగేన చరితార్థత్వాత్ర్పరబ్ధం కర్మహీయతే ౹
భోక్తవ్యసత్యతా భ్రాంత్యా వ్యసనం తత్ర జాయతే
౹౹ 166 ౹౹
మా వినశ్యత్వయం భోగో వర్థతా ముత్తరోత్తరమ్ ౹
మా విఘ్నాః ప్రతిబధ్నన్తు ధన్యోఽ స్మ్యస్మాదితి భ్రమః
౹౹167౹౹
అనుభవమే ఉద్దేశమగుటచే, భ్రాంతి వలన వానిచే దుఃఖము కలుగును.భోగములు వర్ధిల్లుగాక.నేను ధన్యుడనగుదును ఇట్టిదే భ్రమ.
వ్యాఖ్య :- విద్వాంసుని ఇచ్ఛకు భోగరూపం ఉండదా? అంటే -
విషయములు మిథ్య అన్న జ్ఞానముండుటచే,
వేయించబడిన బీజం(గింజలు) అంకురించే శక్తిని కోల్పోయినను - అంకురోత్పాదనకు పనికి రాకపోయినను తినటానికి పనికివస్తుంది.
అట్లాగే,విద్వాంసుని ఇచ్ఛ అల్పభోగము నిచ్చును.
గొప్ప దుఃఖమును అవి కల్పింపలేవు.
అనేకమైన వ్యసనాదుల్ని పుట్టించలేదు.
విపత్తుల్ని,కష్టాలని కలిగించలేదు.
కర్మయే వ్యసనాన్ని కూడా పుట్టిస్తుంది గదా ! అంటే -
అనుభవములు సత్యములను భ్రాంతి వలన వానిచే దుఃఖము కలుగును.అనుభవమే ఉద్దేశమైతే,ప్రారబ్ధము అనుభవింపబడిన తీరిపోవును.
ప్రారబ్ధమనేది భోగాన్ని (అనుభవాన్ని)యిచ్చి చరితార్థమైనందున వినష్టమైపోతుంది.అది వ్యసనాన్ని కలిగించలేదు. కాని,భోక్తవ్య పదార్థాలు సత్యము అనే భ్రమయే వ్యసనం పుట్టటానికి కారణమౌతోంది.అంతే తప్ప వ్యసనాదులకు కర్మ కారణం కావటం లేదు.
వ్యసనానికి హేతువైన భ్రమ తెలుసుకుందాం -
భ్రమ వలననే దుఃఖము,లోలుపత,దర్పము మొదలగునవి కలిగి ఇతరులకు దుఃఖము కలిగించును.
"ఈ భోగాలు ఎన్నడూ నష్టం కాకూడదు - ఈ భోగము నశింపకుండుగాక ",
"ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉండాలి - ఇక మీద కూడా అది వర్ధిల్లుగాక",
"దానికి విఘ్నములు లేకుండు గాక - ఈ భోగాలకు విఘ్నాలవల్ల ఏ విధమైన అడ్డంకి కలుగ కూడదు",
"దీనిచే నేను
దన్యుడనగుదును - ఈ భోగాలవల్లనే నేను కృతార్ధుణ్ణి అవుతాను"
అని ఈ విధమైన భ్రమ కలుగుతుంది.ఈ భ్రమయే వ్యసనాలకు కారణమౌతుంది.
జ్ఞానికి ఇవన్నీ మిథ్య అనే భావం సంస్కార రూపంలో దృఢమై యుండును. సద్వస్తువు "అద్వైతమే" రెండదంటూ ఉండదనే "నిర్ణయాత్మకముగా" వున్న అద్వైత బుద్ధి ఎన్నడూ నశించదు.
లోక వ్యవహారం మామూలుగానే జరిగిపోతూ ఉంటుంది, వివేకమనేది వ్యవహారాన్ని అడ్డగించదు కాబట్టి ! అర్థక్రియ అట్లా సాగిపోతూనే ఉంటుంది.
జరుగు కర్మలు
వివేకజ్ఞానం వలన ఆత్మయొక్క అమరత్వము,సచ్చిదానంద రూపత్వ ప్రేరణతో కూడిన దృష్టితో జరుగుతాయి.
యదభావి న తద్భావి భావి చేన్న తదన్యథా ౹
ఇతి చిన్తావిషఘ్నో ఽ యం బౌధో భ్రమ నివర్తకః
౹౹ 168 ౹౹
సమే ఽ పి భోగే వ్యసనం భ్రాన్తో గచ్ఛేన్న బుద్ధవాన్ ౹
అశక్యార్థస్య సంకల్పా ద్ర్భాంతస్య వ్యసనం బహు
౹౹169౹౹
సాధ్యముకాని విషయములను సంకల్పించుట చేత భ్రాంతికి వ్యసనము మెండు.కానిది కానేకాదు.కానున్నది ఆగదు.
మాయామయత్వం భోగస్య బుద్ధ్వాఽ ఽ స్థాముపసంహరన్౹
భుంఞ్జానో ఽ పి న సంకల్పం కురుతే వ్యసనం కుతః
౹౹170౹౹
సంకల్పమనేది లేనపుడు వ్యసనమనేది ఎట్లా కలుగుతుంది ?
వ్యాఖ్య :- భ్రమలకు పరిహారమేంటట ?
యదార్థముగా జీవాత్మ నిజస్వరూపము
"అద్వైత బ్రహ్మమే".
ఇదే అతని
"అభయ స్వరూపము".
కానీ , నీళ్ళల్లో బట్టలుతికే చాకలి దాహానికి చచ్చాడట.
అట్లే , నాకు శుభం ఎన్నడు జరుగుతుంది ?
నా అనిష్టాలన్నీ ఎప్పుడు నివృత్తమౌతాయి ? అనేటటువంటి చింతయే అట్లా ఆలోచించే వానిని విషంలాగా
మింగేస్తుంది.ఈ భ్రమను జ్ఞానం మాత్రమే పోగొట్ట గలుగుతుంది.
శరీరము నేను అన్నదే అతి పెద్ద భ్రమ అందులో జీవిస్తున్నంతకాలమూ సౌక్యమునకు ఆటంకము వచ్చిన దుఃఖము కలుగును. శరీరము వదిలి పెట్టడమనేదే అతిపెద్ద బాధ.
శరీరము ఒకప్పుడు లేదు, కొంతకాలము ఉంటుంది, తరువాత లేకుండా పోతుంది.
దానివలన ఈ అనంతసృష్టిలో ఏ మార్పు వచ్చింది?
కుండను తయారుచేసి అవసరమైనంతకూ ఉపయోగించాము,తరువాత
పగిలిపోయింది.పడేసిన తరువాత ఆ తయారైన మట్టిలోనే కలిసిపోయింది. అంతేకదా?
జరగవలసినది జరగకుండా ఎన్నడూ ఆగదు,జరగరానిది ఎన్నడూ జరగదు అనే ఈ విధమైన జ్ఞానం వలన మాత్రమే చింతారూపమైన విషం వినష్టమౌతుంది.
ప్రారబ్దానుసారం జ్ఞానికి,అజ్ఞానికి
కర్మఫల భోగము,అనుభవము సమానమే అయినప్పటికీ, భ్రాంతుడు అశక్యమైన - సాధ్యముకాని పదార్థాల్ని పొందాలనే కోరికవల్ల -విషయములను సంకల్పించుట వలనను ,
వ్యసనం(కష్టాలు,ఆపదలు)లో
చిక్కుకుంటాడు.జ్ఞానవంతుడు అట్టి వ్యసనాన్ని పొందడు.
వివేకవంతముడైన జ్ఞానికి విషయభోగములు మిథ్యయని తెలియును.
మాయతో కూడిన భోగాలయొక్క స్వరూపాన్ని తెలుసుకొని భోగాలు మాయ అని గుర్తించి - వాటి యెడల ఆసక్తి తలెత్తనీయడు.
భోగాలను అనుభవించుచున్నను
అవి కావలెనని,చిరకాలము కొనసాగవలెనని సంకల్పింపక,
త్యాగభావంతో వాటిని అనుభవించును.
ఆ భోగాల యెడల అతనికి సంకల్పం ఉండదు. మనస్సునందు తలచుట ఉండదు.
సంకల్పమనేదే లేనపుడు వ్యసనమనేది
(కష్టాలు,ఆపదలు) ఎట్లా కలుగుతుంది ?
ఇక అతనికి దుఃఖ మెక్కడిది ?
లేదని భావము.
No comments:
Post a Comment