Vedantha panchadasi:
బహుజన్మదృఢాభ్యాసాద్దేహాదిష్వాత్మధీః క్షణాత్ ౹
పునః పునరుదేత్యేవం జగత్సత్యత్వధీరపి. ౹౹103౹౹
103.అనేక జన్మలచే దేహమే ఆత్మయని,దృశ్యమాన జగత్తు సత్యమనే బోధ మరల మరల కలుగును.
విపరీతా భావనేయమైకాగ్ర్యాత్సా నివర్తతే ౹
తత్త్వోపదేశా త్ర్పాగేవ భవత్యేతదుపాసనాత్ ౹౹104౹౹
104. విపరీతపు ఆలోచనలు చిత్తైకాగ్ర్యము వలన నశించును.ఇది ఉపాసన,
ఈశ్వరారాధన వలన కలుగును.
ఉపాస్తయోఽ త ఏవాత్ర బ్రహ్మశాస్త్రేఽ పి చిన్తితాః ౹
ప్రాగనభ్యాసినః పశ్చాద్ర్బహ్మాభ్యాసేన తద్భవేత్ ౹౹ 105 ౹౹
105. అనేక విధములగు ఉపాసనలు వివరింపబడినవి. పిదపనైనా బ్రహ్మాభ్యాసమునే చిత్తైకాగ్ర్యమును సాధింపవలెను.
వ్యాఖ్య:-
విపరీత భావనయొక్క లక్షణము ఏమిటి ?
దానిని నివారించే ఉపాయం ఏమిటి?అంటే -
"నేను" అనబడు జీవుడు ఆనందరూప బ్రహ్మమే నా నిజ స్వరూపమనెడి జ్ఞానము లేమిచే(ఇదియే అజ్ఞానము) జీవత్వము ఆరోపించుకొని ఇంద్రియంబులకు వెలుపలతోచు శబ్ద స్పర్శాది విషయ సుఖంబులే శాశ్వతముగా భావించి తద్భోగానందము కొరకై ఆయా కర్మల ద్వారా ఆయా విషయములను మహాప్రయాసతో సేకరించి స్వల్ప సుఖంబును పొందుచూ,ఆ సుఖంబు నశింప దుఃఖము యధాప్రకారము ప్రాప్తించుచుండుటచే మహావ్యధను పొందుచూ, కర్మఫలము నందు ఆసక్తి లేక అనురాగ బుద్ధి దృఢమై యుండుటచే, ఇట్టి ఫలానురాగముచే(వాసనచే)
దానికనుగుణముగ కాలాంతరమందు
(మరణము తరువాత) మరియొక జన్మమును ధరించుచున్నాడు.ఇట్లు జననము నుండి మరణమునకు,
మరణము నుండి జననమునకు మరల మరలా తిరుగుచూవున్నాడు.
ఇలా అనేక జన్మలవల్ల కలిగే దేహమే ఆత్మ అనే బుద్ధివిషయకమైన అభ్యాసము - అలవాట్లు దృఢముగ అభ్యసింప బడుటచేత దేహమే ఆత్మయనే బుద్ధి క్షణములో కలుగును.
ఇలా శరీరాదులయందు ప్రతిక్షణమమూ ఆత్మబుద్ధి కలుగుతూ వుంటుంది.అట్లే ఈ దృశ్యమాన జగత్తు సత్యమనే భావం మరల మరల పుడుతూనే వుంటుంది.
ఈ విధంగా అనుక్షణమూ పుడుతూ ఉండే జగత్తు సత్యమనే భావననే
విపరీత భావనలు
(విపరీతపు ఆలోచనలు) అంటారు.
ఈ విపరీత భావం (దేహేంద్రియాదులందు ఆత్మ బుద్ధి) నివారింపబడాలంటే చిత్తైకాగ్రత అవసరం. ఇటువంటి చిత్తైకాగ్రత కలగాలంటే నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన ఉపదేశానికి ముందుగా,తత్త్వోపదేశమునకు పూర్వమే
సగుణబ్రహ్మోపాసన కూడా బాగా ఉపయోగిస్తుంది.ఇది ఉపాసన ,ఈశ్వరారాధన వలన కలుగును.
కనుకనే వేదాంత గ్రథములందు అనేక విధములగు ఉపాసనలు
కూడా వివరింపబడినవి. బ్రహ్మమున గూర్చిన ఉపదేశమునకు పూర్వము ఉపాసన అభ్యసింపని వారు పిదపనైనా బ్రహోభ్యాసమునే చిత్తైకాగ్రమును సాధింపవలెను.
ఆ కారణం చేతనే బ్రహ్మప్రతిపాదకాలైన ఉపనిషత్తుల్లో కూడా ఉపాసనను గూర్చిన వివేచన చేయబడ్డది.ముందుగా ఎన్నడూ సాధన చేయని సాధకునికి కూడా,తరువాత ఈ
బ్రహ్మాభ్యాసం వల్ల ఏకాగ్రత లభిస్తుంది.
చిత్తమునందు మూడు దోషములు వుంటాయి. మలము,విక్షేపము,ఆవరణము ఈ మూడు దోషములు ఉన్నంత వరకూ జన్మ దుఃఖము,మరణ దుఃఖము ఈ రెండింటి మధ్యలో ఉన్న సంసార దుఃఖము తప్పని సరియై ఉన్నది.
ఈ మూడుదోషములు కలిగినవారు కాలసర్పం ఉన్న ఇంటియందు నివశించుట వంటిది.
గురువు అను వైద్యుని ద్వారా ఇవ్వబడిన ఉపదేశమనెడి ఔషధమును గ్రోలి సాధకుడు సంసార దుఃఖము శమింప చేసుకొని పరమ పదమును బడయుచున్నాడు.
తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ర్పబోధనమ్ ౹
ఏతదేకపరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బధాః ౹౹106౹౹
106. నిరంతర చింతనము, సంభాషణ, నిష్ఠ కలిగి వుండటమే బ్రహ్మాభ్యాసం అని విద్వాంసులంటారు.
తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః ౹
నానుధ్యాయాన్బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తత్ ౹౹107౹౹
107. ధీరుడు తైలధార వంటి ప్రజ్ఞనుంచవలెను..మాటలను కల్పింపరాదు.
అనంన్యాశ్చింతయంతోమా యే జనాః పర్యుపాసతే ౹
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్
౹౹ 108 ౹౹
108. నన్ను మాత్రమే చింతించిన వారి యోగక్షేమాల భారము నాదే.
ఇతిశ్రుతిస్మృతీ నిత్యమాత్మన్యేకాగ్రతాం
ధియః ౹
విధత్తో విపరీతాయా భావనాయాః క్షయాయ హి ౹౹109౹౹
109. ఆత్మయందే చిత్తైకాగ్ర్యము విపరీతభావం నశించుట కొరకే.
వ్యాఖ్య:- బ్రహ్మాభ్యాసము వలన ఏకాగ్రత లభిస్తుంది అంటున్నారు సరే , మరి
"బ్రహ్మా భ్యాస" లక్షణం ఏమిటి ? అంటే -
నిరంతరం బ్రహ్మామును గూర్చిన చింతనము, మననము చేయుట బ్రహ్మమును గూర్చిన పరస్పర సంభాషణము (మాటలాడుట)
పరస్పర తర్కాదుల ద్వారా బ్రహ్మమును బోధపరచుకొనుట, ఇట్లు బ్రహ్మమునందే తత్పరులై తదేక నిష్ఠ కలిగి ఉండుట అనేవాటిని "బ్రహ్మా భ్యాసం"
అని విద్వాంసులంటారు.
వాసిష్ట రామాయణము ఉత్పత్తి ప్రకరణము 22.24.ఈ శ్లోకమే 13వ ప్రకరణమున 83గ మరల చెప్పబడినది.
ఈ విషయమైన శ్రుతిస్మృతుల్ని ఉదహరిస్తున్నారు.
ముముక్షువులు,
సాధన సంపన్నులు, ధీరపురుషులు అయిన బ్రాహ్మణులు ప్రత్యక్ రూపమైన
బ్రహ్మామును గూర్చి నిస్సంశయముగ తెలిసికొని వుండాలి.
అనాత్మ విషయకమైన శబ్దజాలాన్ని తలచను కూడా తలచకూడదు.
ఎందుచేతనంటే - ఇటువంటి అనాత్మ విషయకమైనవాటిని తలచటం వల్ల,ఉచ్చరించుట వలన శ్రవణము వలన వాక్కు అనవసరమైన శ్రమకు లోనవుతాయి కాబట్టి.
అనేకములగు మాటలు కల్పింపుట వలన నోటికి శ్రమయేగాని వేరు ఫలితము వుండదు.
బృ.ఉ.4.4.21;చూ.ముండక ఉప .3.1.4; 2.2.5.
ఏకాగ్రభావాన్ని పొంది, ఏవిధమైన సంశయమూ లేకుండా వుండి బ్రహ్మమునందే తైలధారవంటి
ప్రజ్ఞ నుంచవలెను.
అనన్యాశ్చింతయంతోమాం....
భగవద్గీతా శ్లోకం చిత్తైకాగ్రత పద్ధతిని వివరించటానికై చెప్పారు.
ఏ జ్ఞానులు,భక్తులు అనన్యభావంతో సచ్చిదానంద స్వరూపుడనై పరమాత్మనైన నన్ను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ,
వేరేమీ చింతించక నన్ను మాత్రమే ఉపాసింతురో అట్లు నిత్యమూ నాయందే సంలగ్నులైయుండు వారి యోగక్షేమముల (అప్రాప్త వస్తువులు లభించటం అనే యోగాన్ని , లభించిన వస్తువులను రక్షించటమనే క్షేమాన్ని) భారము నేనే స్వీకరింతును.
భగవద్గీత. 9.22.
ఎల్లరకూ
ఉత్సాహము- శక్తులను, జ్ఞానులకు ఆవస్యకములగు వానిని భగవంతుడిచ్చునని మధుసూదన సరస్వతి అనును.
ఈ శ్రుతి స్మృతుల సమన్వయం .
ఈ శ్రుతి స్మృతివచనాలు రెండూ కూడా నిరంతరము
ఆత్మయందే చిత్తైకాగ్రమును విధించుచున్నవి.
విపరీతభావనా నివృత్తి కోసం.
అన్ని వచనాలుకూడా చిదాత్మయందు ఎల్లప్పుడూ చిత్త్ ఏకాగ్రత ఉండాలని విధించటం కోసం చెప్పబడినాయి.
No comments:
Post a Comment