*రుద్రస్వరూపుడు హనుమంతుడు*
*ఈ రోజు మే 22 గురువారం హనుమజ్జయంతి సందర్భంగా...*
*`శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా...*
*సూర్యుని కుమారుడైన సుగ్రీవునికి హనుమ మంత్రి మాత్రమే కాదు, అత్యంత ప్రియస్నేహితుడు కూడా. అగ్రజుడైన వాలికి భయపడి దేశాలు పట్టి తిరుగుతున్న సుగ్రీవునికి ధైర్యం చెప్పి, రామునితో స్నేహం చేయించి, వానర రాజ్యానికి అధిపతిని చేసింది కూడా హనుమంతుడే. వీటన్నిటికన్నా సమున్నతమైన అంశం - హనుమ, రామచంద్రమూర్తికి దాసానుదాసుడు. రాముడు సూర్యవంశంలో పుట్టినవాడు. రామాంజనేయుల మైత్రిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.*
*ఈవిధంగా తనకు విద్యాదాత అయిన సూర్యుని వంశంలో జన్మించిన రామచంద్రునికి సేవ చేసిన ఘనత కూడా హనుమకు దక్కుతుంది. మొత్తంగా సూర్యునితో, సూర్యవంశంతో ఉత్తమ మైత్రి కలిగిన హనుమను*
*'సూర్యాంజనేయుడి'గానూ భక్తులు కొలుచుకుంటారు. హనుమలో మరొక విశిష్ట లక్షణం అతడు ప్రాణప్రదాత. శ్రీరామ వియోగదు:ఖం భరించలేక, ఆత్మాహుతికి సిద్ధపడ్డ సీతమ్మకు రామయ్య క్షేమం తెలిపి, ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమింపజేసి, ఆమెకు ప్రాణాన్ని అందిస్తాడు హనుమ. ఇంద్రజిత్తు చేసిన అస్త్ర ప్రయోగానికి, నిశ్చేష్టులైన పడి ఉన్న వానరులందరికీ ఓషధీపర్వతాన్ని తీసుకురావటం ద్వారా ప్రాణప్రదానం చేసింది కూడా హనుమంతుడే, సంజీవని తీసుకురావటం ద్వారా లక్ష్మణ ప్రాణప్రదాతగా రాముని అభినందనలు అందుకున్నదీ హనుమే.*
*అందుకే, జాంబవంతుడు ఇలా అంటాడు -*
*అస్మిన్ జీవతి వీరేతు హతమవ్యహతం బలం ।*
*హనూమత్యుజ్ఞిత ప్రాణే జీవన్తోపి మృతావయం॥*
*ఎంతమంది వీరులు జీవించి ఉన్నా, హనుమంతుడు లేకపోతే వారందరూ జీవించి ఉన్నట్లు లెక్క కాదు. ఒక్క హనుమంతుడు జీవించి ఉంటే, సకల వానర వీరులూ బ్రతికి ఉన్నట్లే.*
*ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది ।*
*వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్ ॥*
*వాయుదేవునితో సమానంగా, ప్రాణులందరికీ జీవవాయువును అందించే శక్తి కలిగినవాడు ఆంజనేయుడు. అగ్ని సమానమైన తేజస్సు కలిగిన ఇతని వల్ల జీవించాలనే ఆశ కలుగుతుంది. ఈ మాటలు చాలు హనుమంతుని ధైర్యపరాక్రమాలు, శక్తిసామర్థ్యాలు ఎంతటి సమున్నతమైనవో అర్థం చేసుకోవటానికి. ఇంతటి శక్తిశాలి కనుకనే రామచంద్రమూర్తి హనుమను తన 'బహి: ప్రాణం'గా ప్రకటించాడు.*
*రామరావణ సంగ్రామంలో కూడా అనేకచోట్ల హనుమలోని రుద్రతేజాన్ని వాల్మీకిమహర్షి వివరిస్తారు.*
*ప్రళయకాల రుద్రుని వలే హనుమ భాసించారనే పోలిక కూడా రామాయణంలో అనేక చోట్ల కనిపిస్తుంది. 'రుద్రవీర్య సముద్భవాయ నమ:' అని, హనుమదష్టోత్తరం కూడా హనుమను రుద్రావతారమూర్తిగా నమస్కరిస్తుంది. వీటన్నిటి ద్వారా హనుమను పరిపూర్ణ రుద్రావతారంగా గ్రహించాలి.*
*హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం... వీటన్నింటి సమ్మేళనం. ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్ళను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల్ని దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడలతో ఉన్న లంకా నగరాన్ని తన తోకకు అంటించిన నిప్పుతో భస్మీపటనం చేయటం ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.*
*హనుమత్సందేశం*
*హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో 'నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇది. ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.*
*త్రేతాయుగంలో రావణాదుల్ని వధించి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరాముడు అవతరించాడు. ఆ ధర్మ కార్యం హనుమంతుడి సహకారంతోనే జరిగింది. రాముని సేవకుడైతే రాముడు పుట్టినప్పటినుండీ అతనిసేవలో హనుమంతుడు ఉండాలి. కానీ రాముడు ధర్మకార్యం ఆరంభించినప్పటినుండి మాత్రమే హనుమంతుడు రాముడితో ఉన్నాడు. అందుకే రాముడికీ, హనుమంతుడికీ పరిచయం కిష్కింధకాండ దాకా జరగలేదు. అలాగే ధర్మ కార్యం ముగియగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్టుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు తప్ప రామునితో పాటు అయోధ్యలో ఉండి రాజభోగాలు అనుభవించలేదు. ధర్మకార్యంలో తన అవసరం ఉన్నప్పుడల్లా రాముడికి తోడుగా నిలిచాడు. త్రేతాయుగంలో ధర్మస్థాపనలో కీలకపాత్రే వహించినవాడు హనుమంతుడు. రామరావణ యుద్ధం అనే ధర్మయుద్ధంలో హనుమంతుడు విజయకారకుడుగా నిలిచాడు.*
*┈━❀꧁శ్రీ ఆంజనేయం꧂❀━┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁
No comments:
Post a Comment