Thursday, May 22, 2025

 *తులసీదాస సదా హరి చేరా...* 

*మే 22 గురువారం హనుమజ్జయంతి సందర్భంగా...* 

*పిశాచపీడలు, గాలిబాధలు, పీడకలలు, అజ్ఞాతభయాలను పోగోట్టే 'హనుమాన్ చాలీసా'ను రచించి పిన్నలకు పెద్దలకు ఆరాధ్యుడైన మహనీయుడు తులసీదాసు. వాల్మీకి రామాయణాన్ని 'రామచరిత మానస్'గా మరాఠీలోకి అను వదించిన మహాకవి. మానవాళికి ఆయన హనుమాన్ చాలీసాను అందించడం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే...* 

*ఒకనాడు ఒక మహిళ ఆయన దగ్గరకొచ్చి నమస్కరించింది. అప్పుడాయన ఆమెను 'దీర్ఘసుమంగళీ భవ' అని ఆశీర్వదించి పువ్వులు, కుంకుమ ఆమె చేతిలో పెట్టబోయారు. కానీ ఆమె తీసుకోవడానికి నిరాకరించింది. 'మహాత్మా! నిన్న రాత్రి నా పతిదేవుడు గతించారు. నేను మీ దర్శనం చేసుకుని వెళ్లి సహగమనం చేయబోతున్నాను' అని విలపించింది. అప్పుడు తులసీదాసు... 'అమ్మా' రాముని మాటకు తిరుగులేదు.* 

*అందుకే నా నోట ఆ మాట అనిపించాడు. నీవు సుమంగళివే' అని ఆమె వెంట వెళ్లి తన కమండలంలో నీళ్లు తీసి రామనామం చెబుతూ ఆమె భర్త మృతదేహంపై చల్లడంతో అతడు ఊపిరి తీసుకున్నాడు. అది చూసిన ప్రజలకు తులసీదాసుపై భక్తి విశ్వాసాలు పెరిగాయి. ఈ మాట ఆనోటా ఈనోటా పడి పాదుషా చెవికి చేరింది. వెంటనే ఆయన తులసీదాసును పిలిపించాడు. ఒక శవాన్ని తెప్పించి... దానికి ప్రాణం పోయాలని ఆదేశించాడు.* 

*దానికి తులసీదాసు అంగీకరించలేదు. చనిపోయినవాడిని బతికించడానికి రాముడు తనను ఒక పనిముట్టుగా మాత్రమే వాడుకున్నాడని చెప్పారు. తన మాట విననందుకు ఆగ్రహించిన పాదుషా... ఆయనను కొరడాలతో కొట్టాల్సిందిగా భటులను ఆదేశించారు. అప్పుడు తులసీదాసు కళ్లుమూసుకుని హనుమంతుడిని ప్రార్థించడం ప్రారంభించారు. భటులు ఆయన్ను కొట్టడానికి కొరడాలు ఎత్తగానే... ఎక్కడెక్కడి నుంచో కోతులు వచ్చి అంతః పురమంతా ఆక్రమించాయి. సైనికులను కదలకుండా నిలిపేశాయి. తులసీదాసు భక్తితత్పరత ఎంత గొప్పదో అర్థం చేసుకుని ఆయన పాదాలపై పడ్డాడు పాదుషా. ఆరోజు తులసీదాసు హనుమను గురించి చేసిన ప్రార్థనే 'హను మాన్ చాలీసా'. తులసీదాసు రామభక్తికి మెచ్చిన హనుమ... ఆయనకు రామదర్శనం చేయించాడు.* 

*అలనాడు రాముడి ఆనతి మేరకే ఆయన 'రామచరిత మానస్' గ్రంథాన్ని రచించారు. తులసీదాసు కాశీలో రాసిన ఆ రామాయణానికి విశ్వేశ్వరుని, హనుమంతుని ఆమోద ముద్ర పడిందని... కనుకనే ఆ గ్రంథానికి అంత ప్రాముఖ్యం లభించిందని పెద్దలు చెబుతారు. రామభక్తి ప్రచారానికి ఎన్నో మార్గాలను అన్వేషించి, అనుసరిస్తూ, ఆరాధిస్తూ, రాత్రింబవళ్లూ తన ఆశ్రమంలో రామకథా ప్రవచనాలు చేస్తూ ఉండేవారు తులసీదాసు. ఆయన ప్రభావంతో కాశీలో వీధివీధినా రామ భజన మఠాలు వెలిశాయి. రామ నామం మారుమోగింది.* 

*ఒకరినొకరు కలుసుకున్నప్పుడు 'రామా నామ్' అనడం అలవాటైపోయింది. ఇప్పటికీ ఆ అలవాటు అలాగే కొనసాగుతోంది. ఇక కాశీలో సుప్రసిద్ధమైన 'సంకటమోచన హనుమాన్' ఆలయాన్ని కట్టించింది కూడా తులసీదాసే. హనుమంతుడిని ఆయన తొలిసారి చూసిన చోటే ఆ ఆలయాన్ని నిర్మింపజేశారని స్థలపురాణం.*

*┈••━❀꧁శ్రీ ఆంజనేయం꧂❀━••┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁

No comments:

Post a Comment