Saturday, May 24, 2025

 'పద!... వెళ్దాం!......'
***************

ఆ బస్సు స్టాప్ లో ఒక ముసలాయన, ఒక ముఫై ఏళ్ల నిండు గర్భిణీ నిలబడి బస్సు కోసం నిరీక్షిస్తున్నారు.
ఆ ముసలాయన కొంతసేపు ఆమె పొట్టవంక తదేకంగా చూసి, తర్వాత మెల్లగా అనునయ స్వరంతో అడిగాడు ,"ఎన్నో నెల అమ్మా?" అంటూ. 
ఆ అమ్మాయి ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తోంది. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. కొంతసేపు ఆమె సమాధానం చెప్పలేదు. తర్వాత గొణుగుతున్నట్లుగా "తొమ్మిది నిండాయి!" అంది.
"మొదటి కాన్పా?"మళ్లీ అడిగాడు ముసలాయన. 
అవునన్నట్టు తల ఊపింది ఆమె. 
"ఆందోళన పడకు! అంతా చక్కగా జరుగుతుంది."అన్నాడు ఆయన. 
ఆమె తన పొట్ట మీద సుతారంగా చేతులు పెట్టి రాసుకుంటూ, 
కను కొలకుల్లోంచి ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకుంది. తర్వాత మెల్లగా"ఏమో.... అంతా ఆ భగవంతుని దయ!"అంది.
"మనం ఒక్కోసారి ఏమీ లేని దానికి కూడా ఎక్కువగా భయాందోళనలు చెందుతాం! అలాంటి ఏవీ పెట్టుకోకు!"అన్నాడు. 
"ఏమో! చూడాలి!"అందామె గొణుగుతున్నట్లు.
"నిన్ను చూస్తూ ఉంటే ఏదో కష్టాల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు?"మళ్లీ అడిగాడు ఆ ముసలాయన. 
"నాలుగు నెలల క్రితం అతను నన్ను వదిలి వెళ్ళిపోయాడు!"అంది.
"మరి... నీకు, మీ వాళ్ళు ఎవరూ లేరా?"
"మా నాన్న ఉన్నారు!"అంది ఎటో చూస్తూ. 
"ఆయన నీ చిన్నప్పట్లో నిన్ను చూసుకున్నట్లే ఇప్పుడు కూడా ప్రేమగా చూసుకుంటాడా?"
"ఆయనకి ఒంట్లో ఏమీ బాగాలేదు."ఆ మాటలు అంటూ ఉంటే రెండు కన్నీటి బిందువులు ఆమె చెక్కిళ్ళ మీద నుండి  కిందకు జారిపోయాయి. 
"ఏమైంది ఆయనకు?"ఆత్రుతగా అడిగాడు ముసలాయన. 
"ఏదో మాయ రోగం! నన్ను, తన కూతుర్ని అనే సంగతి కూడా ఆయన మర్చిపోయాడు!"అంది విచారంగా ముఖం పెట్టి. 

అంతలోనే బస్సు వచ్చి ఆగింది. 
"పద! వెళ్దాం!... బస్సు ఎక్కుదాం నాన్నా!" అంటూ ఆమె ఆ ముసలాయన  చెయ్యి జాగ్రత్తగా పట్టుకుని బస్సు వంక నడిపించింది.
**********
(చహోవ్ గారి కథకు స్వేఛ్ఛానుసరణ-ద్విభాష్యం రాజేశ్వరరావు.)

No comments:

Post a Comment