Thursday, October 1, 2020

సహనం

'సహనం'
""""""""""""

'సహనం’ ఒక అమూల్య సుగుణం.

సహనం లేనివారికి సవాలక్ష సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

విశ్వాసానికి ఉండవలసిన లక్షణాల్లో సహనం అత్యంత ప్రధానమైనది.

మనిషి తన భావోద్రేకాలను, ఆవేశకావేశాలను, మనోవాంఛలను అదుపులో పెట్టుకోవడం,

ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం పాటించడం, భయప్రలోభాలు ఎదురైనప్పుడు స్థిరత్వాన్ని, నిలకడను ప్రదర్శించడం, కష్టాల పర్వతాలు విరుచుకుపడినా తొణకకుండా ఉండడం,

ఆవేశం కట్టలు తెంచుకున్నప్పుడు ఉద్రేకం తారస్థాయికి చేరినప్పుడు విచక్షణ కోల్పోకుండా,

తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా విజ్ఞతను ప్రదర్శించడం,

ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలన్నప్పుడు ఉత్సాహంతో తొందరపడకుండా,

నిదానించి నిర్ణయం తీసుకోవడం… ఇవన్నీ సహనం పరిధిలోకే వస్తాయి.

ఈనాడు మానవ సమాజంలో ఎటుచూసినా అసహనం తాండవిస్తోంది.

శాంతి, సహనం, ప్రశాంతత, స్థిరచిత్తం, అచంచలత దాదాపు కానరావడం లేదు.

సహనలేమి కారణంగా, చిన్నచిన్న విషయాలకే చిరాకు, విసురుకోవడాలు, కసురుకోవడాలు ఎక్కువైపోతున్నాయి. అనవసర ఆగ్రహావేశాలకు కూడా ఇదే కారణమవుతోంది.

సహనం అనే సుగుణం దూరం కావడం మూలాన మానసిక ప్రశాంతత కొరవడి జీవితాలు దుర్లభమైపోతున్నాయి.

కుటుంబ కలహాలకు కూడా ఇదే కారణమవుతోందంటే అతిశయోక్తి కాదు.

కార్ఖానాలు, కార్యాలయాలు తదితర అన్నిచోట్లా సహోద్యోగుల మధ్య సత్సంబంధాలు,

సభ్యత లోపించడానికి కూడా ఇదే ప్రధాన కారణం.

అందుకని ప్రతి ఒక్కరూ సహనగుణాన్ని అనివార్యంగా అలవాటు చేసుకోవాలి.

కేవలం అసహనం కారణంగా జీవితంలో ఎంత కోల్పోతున్నామో గుర్తించాలి.

ఒక్క సహనగుణాన్ని అలవాటు చేసుకుంటే, మిగతా సుగుణాలన్నీ తప్పకుండా వాటంతట అవే అలవడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

కనుక ప్రతీకార చర్యలను విడనాడి సాధ్యమైనంత వరకు, శక్తి మేర సహనం వహించడం విశ్వాసుల లక్షణం.

దైవం అందరికీ ఈ సుగుణాన్ని ప్రసాదించుగాక!




Source - Whatsapp Message

No comments:

Post a Comment