"ఎంత భూమి కావాలి " (కథ)
రచన. టాల్ స్టాయ్ రచనాకాలం - 1886 సంక్షిప్తీకరణ. - చలం .జి ఎస్
*
పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఇద్దరు అక్కచెల్లెళ్ళు పెళ్లయ్యాక, పట్నంలో అక్క, పల్లె లో చెల్లెలు జీవిస్తూ ఉంటారు.
ఒకరోజు వాళ్ళిద్దరు పుట్టింట్లో కలుసుకుని ఇలా మాట్లాడుకుంటారు.
అక్క పట్నంలో సౌకర్యాల గురించి చెబుతూ పట్నవాసం గురించి గొప్పలు పోతుంది. అంతేకాదు పట్నం దగ్గర పల్లెటూరు ఎప్పుడూ దిగదుడుపే అని చిన్న పుచ్చుతుంది.
చెల్లెలు , ప్రశాంతమైన, స్వచ్ఛమైన పల్లెటూరి జీవితం గురించి, మాయా మర్మం లేని , ఏ అత్యాశలకు పోకుండా ఒకరికొకరు చేదోడువాదోడుగా కలిసిమెలిసి జీవించే ఊరి గొప్పతనం గురించి వివరిస్తుంది.
చెల్లెలి భర్త పోఖం వారి సంభాషణ వింటాడు. " కావలసినంత భూమి ఉంటేనా? తమకు సాటి ఎవరూ ఉండరు" అనుకుంటాడు. అది మొదలు అతనికి భూమి సంపాదించాలన్న కోరిక రోజురోజుకీ పెరిగిపోతోంది.
తమ గ్రామానికి సమీపంలో ఒక ధనికురాలు నివసిస్తూ ఉండేది రైతుల భూమి కి సరిహద్దుల్లోనే ఆమెకు చాలా ఎక్కువ భూమి ఉంది .ఆమె రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్లతో సఖ్యతగా మెలుగుతూ ఉండేది. కొంతకాలం అయ్యాక ఆమె భూమిని అమ్మేయాలని అనుకుంటుంది.
భూమి దళారులు ఎవరూ కొనకుండా తమకే అమ్మితే బాగుంటుందని రైతులు అనుకుంటారు. రైతులందరూ ఆమె దగ్గరికి వెళ్లి, భూమిని దళారుల కు అమ్మ వద్దని, తమకే అమ్మమని వేడుకుంటారు. ఆమె అందుకు అంగీకరిస్తుంది. రైతులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు.
పోఖం భార్యతో భూమి కొనడం గురించి ప్రస్తావించాడు. "మనము ఎంతో కొంత భూమిని కొనుక్కోవాలి, దానికి ఇదే సరైన సమయం ,కనీసం 30 ఎకరాలైనా కొనాలి. దళారుల చేతిలో పడితే వాళ్ల దగ్గర మనం కౌలుకు తీసుకుని బతకలేము, వాళ్లు మనల్ని బతకనివ్వరు కూడా" అన్నాడు. ఇద్దరూ ఆలోచన సాగించారు. అప్పుడప్పుడు పోగుచేసిన డబ్బంతా లెక్క పెట్టారు. చాలట్లేదు. గుర్రపు పిల్లని అమ్మేశారు . తేనె పెట్టెలు సగం బేరం పెట్టేశారు. కొడుకుని పనిలో పెట్టారు. ఎలాగైతేనేం కావాల్సిన డబ్బులు సగం వరకు జమ చేశారు. డబ్బు జమ చేసిన తర్వాత వెళ్లి పొలమంతా చూసి వచ్చాడు. 50 ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు . అదే విషయం ఆ ధనికరాలు దగ్గరికి వెళ్లి చెప్పాడు. కొంత డబ్బు చెల్లించి వచ్చాడు. ఆ మర్నాడు పట్టణానికి వెళ్లి దస్తావేజులు రాయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మిగతా సొమ్ము రెండేళ్ళలో ఇవ్వడానికి అంగీకారం కుదుర్చుకున్నాడు.
ఎలాగైతేనేం పోఖం చివరికి స్వంత భూమికి ఆసామీ అయ్యాడు . దాన్ని సాగుకి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు. బావమరిది దగ్గర విత్తనాలు తెచ్చాడు. కొత్త పొలం దున్ని విత్తనాలు చల్లాడు. పంట బాగా వచ్చింది. బావమరిదికి అప్పు తీర్చేసాడు ధనికురాలికి మిగతా సొమ్ము కూడా చెల్లించేసాడు. ఇప్పుడు ఏ అప్పులు లేవు. తను ఇప్పుడు భూస్వామి అయ్యాడు. కౌలుకు చేయడం వేరు. సొంత పొలంలో సేద్యం చేస్తే ఆ ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని ఇప్పుడు పోఖం అనుభవిస్తున్నాడు.
కాలం హాయిగా గడిచిపోతుంది .అతని జీవితం లో ఏ ఒడిదుడుకులు లేవు.
*
ఆ రోజుల్లోనే ఇంకో హడావిడి మొదలైంది. దూరంగా మరో ప్రాంతంలో కొత్త భూములు సాగు లోకి వస్తున్నాయని, చాలామంది అక్కడికి వలస పోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారు
పోఖం చెవిని ఈ వార్త పడే టప్పటికి అతనిలో మళ్లీ కొత్త ఆశలు రేకెత్తాయి..
ఆ విశేషాలు, ఆ వివరాలు , వింటున్న కొద్ది అతడిలో పేరాశ పెరిగిపోయింది .ఇక్కడి కంటే అక్కడే బాగుంటుందేమో అనుకున్నాడు.
అలా అనుకుంటున్న కొద్ది ప్రస్తుత పరిస్థితి తనకే నచ్చలేదు . ఇక్కడికంటే ఇంకా ఎక్కువ భూమి కొని అక్కడ పెద్ద భూస్వామిని కావచ్చు అనుకున్నాడు. ఆ వేసవి లోనే ప్రయాణమై కొత్త ప్రదేశానికి వెళ్లి చూసి వచ్చాడు.
తనకు కావలసిన వివరాలు తెలుసుకొని పోఖం తిరిగి ఇంటికి వచ్చేశాడు. అక్కడ చాలా బాగుందనిపించింది. చాలా ఎక్కువ భూమి చాలా చవకగా కొనుక్కోవచ్చు అనుకున్నాడు.
ఇంటికి వచ్చిన వెంటనే తన భూమిని అమ్మేశాడు. ధర బాగానే వచ్చింది . డబ్బు చేత పట్టుకొని కుటుంబంతో కొత్త ప్రదేశానికి బయలుదేరాడు.
*
పోఖం కొత్త ప్రదేశం చేరి అక్కడి పెద్ద గ్రామం లో తన పేరు నమోదు చేయించుకున్నాడు. విందు ఏర్పాటు చేశాడు . దస్తావేజులు పూర్తి చేయించుకుని గ్రామస్తుల లో ఒకడయ్యాడు. అతని కుటుంబం లోని ఐదుగురికి కలిపి 150 ఎకరాల భూమి వచ్చింది. ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఇదివరకటి కంటే మూడు రెట్లు ఎక్కువ భూమి లభించింది. బాగానే ఉందిప్పుడు. సాగు భూమి కావలసినంత ఉండగా, పశువుల మేత కు కావలసిన బీడు భూమి కూడా ఉంది.
అక్కడికి వెళ్ళిన కొత్త లో ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ, పాడి పశువులు మేపుకుంటూ బాగా పనిలో మునిగిపోవడంవల్ల అతడికి చాలా సందడిగా ఉండేది.
కొన్నాళ్ళు అయ్యాక , బాగా స్థిరపడిపోయిన తర్వాత , అతనికి ఎందుకో మొహం మొత్తింది. ఇక్కడ కూడా జీవితం ఇరుగ్గానే అనిపించింది. ఇప్పుడున్న భూమి కూడా చాలా తక్కువ గానే అనిపించింది.
గోధుమ బస్తాలు తోలుకొని ,పట్నం పోయినప్పుడు అక్కడ షావుకారు ల, పెద్ద రైతుల పెద్దపెద్ద భవంతులు చూసి అసూయ కలిగేది .
వాళ్లు రోజు రోజుకి ధనవంతులయిపోతున్నారు. ఉంటే అట్లాంటి భవంతుల్లో ఉండాలి. నాకు ఇంతకంటే ఎక్కువ భూమి ఉంటే నేను కూడా అలాంటి భవంతి లో ఉంటాను కదా ,అనుకున్నాడు. అప్పటినుండి మరికొంత భూమి కొందామని నిరంతరం ఆలోచిస్తూ వుండేవాడు.
ఇంకా ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందా అనే ధ్యాస తో నిద్రాహారాలు ఉండేవి కాదు. వాకబు చేయగా చేయగా చివరికి ఆచూకీ దొరికింది.
ఓ రైతు అవసరం కొద్దీ తన భూమిని అయిన కాడికి , అమ్ముకుంటున్నాడని తెలిసింది .
పోఖం అతనితో బేరమాడి పీడించి పీడించి మొత్తం మీద ఎక్కువ భూమినే కొనుగోలు చేశాడు. వెంటనే కొంత డబ్బుచెల్లించి ,మిగిలిన సగం తర్వాత చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటి కి ఒక కోరిక తీరింది.
*
ఇదిలా ఉండగా ఓ రోజు ఊళ్లోకి ఒక వర్తకుడు వచ్చాడు. అతనిని భోజనానికి ఆహ్వానించాడు పోఖం.
భోజనాలయ్యాక మాటల సందర్భంలో ఆ వర్తకుడు తాను సరాసరి ఒకానొక దేశం నుంచి వస్తున్నానని, అక్కడ ఐదు వేల ఎకరాల భూమిని కారుచౌకగా కొన్నానని చెప్పాడు. అంతే పోఖమ్ మనసు మనసులో లేదు. అతని బుర్రలో మళ్లీ పురుగు దొలవడం ప్రారంభించింది.
ఆ వర్తకుడి ని ఊపిరి సలపనివ్వకుండా ప్రశ్నలు వేశాడు . ఆ దేశంలో ప్రజలు అమాయకులని అక్కడ కావలసినంత భూమి ఉందని వాళ్ళని సంతోషపెట్టి, కానుకలిచ్చి చిన్న విందు ఏర్పాటు చేస్తే చాలని, మనకు చాలా భూమి ఇచ్చేస్తారని చెప్తాడు. తను కొన్న క్రయ దస్తావేజుల పత్రాలు కూడా తీసి చూపిస్తాడు.
పోఖమ్ మనసు లో ఆశల తుఫాను విజృంభించింది. "ఇక్కడ ఎక్కువ ధర ఇచ్చి భూమి కొనడం, పైగా అప్పు చేసి కొనడం ఎందుకు? అక్కడకు పోయి ఇదే డబ్బుతో ఇంత కంటే చాలా ఎక్కువ భూమి కొనచ్చు కదా" అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా అక్కడ సమాచారం అంతా ఆ వర్తకు ని దగ్గర్నుంచి తెలుసుకున్నాడు.
మరుసటి రోజు నుంచే పోఖం ప్రయాణ సన్నాహాలు ప్రారంభించాడు.
డబ్బూ దస్కం మూటగట్టుకుని, ఇంటి పనంతా భార్యకు అప్పజెప్పి బయలుదేరాడు.
*
చాలా కష్టపడి ఆ పరాయి దేశం చేరుకుంటాడు పోఖం. అక్కడంతా ఆ వర్తకుడు చెప్పినట్టే ఉంది. ప్రజలంతా నాలుగు ,మూడు చక్రాల బళ్ళ లోనే నివసిస్తారు. నదీ తీరంలోనే పచ్చిక మైదానాల లో జీవనం సాగిస్తారు.
ఆ బండ్ల మీద తారు గుడ్డలు కప్పి, వాటికి గుర్రాల్ని పూన్చు తారు. మందల్ని తోలుకుంటూ, నదీ తీరాల్లో మకాములు చేస్తూ, ఎప్పుడూ సంచారం చేస్తుంటారు .భూమిని దున్నడం, విత్తడం వాళ్ళకు తెలియదు. గోధుమ రొట్టెలు అంటే ఏమిటో వాళ్లకు తెలీదు.
*
పోఖమ్ వెళ్లిన వెంటనే వాళ్లంతా అతని చుట్టూ చేరిపోతారు. దుబాసి ద్వారా అతను ఎందుకు వచ్చిందీ తెలుసుకుంటారు .తెలుసుకొని వారు చాలా సంతోషిస్తారు అతన్ని ఆహ్వానించి , విశాలమైన బండిలో కూర్చోబెడతారు. అతిధి మర్యాదలు చేస్తారు.
"మీ భూమి లో కొంత భాగం నాకిస్తే చాలా సంతోషిస్తాను" అన్నాడు పోఖమ్ .
దుబాసి ఈ మాటలన్నీ వాళ్ళకి అనువదించి చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషించి నట్లు గ్రహించాడు పోఖం.
ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి అక్కడ కూర్చున్నాడు. అతను రాగానే వాళ్ళందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు . అతను వాళ్ళందరికీ పెద్దమనిషి. అతనికి ఈ విషయం చెప్పారు. సంతోషించాడు "మీకు కావలసినంత తీసుకోవచ్చు ఇక్కడ భూమికి ఏమీ కొదవ లేదు. మీ ఇష్టం ఎంత కావాలంటే అంత" అన్నాడతను.
పోఖమ్ ఆలోచించాడు.
"భూమిని నేను తీసుకోవడం ఎలాగా? భూమి నాది అనే నిర్ధారణ ఏమిటి? దస్తావేజులు ఏమీ అక్కర్లేదా? ఈ వేళ భూమి నాదే అని వీళ్ళు చెప్పొచ్చు, ఏదో ఒక రోజు నాది కాదు పొమ్మని వీళ్ళ పిల్లలు అనొచ్చు దీనికి ఆధారం?"
అనుమానం ఎందుకని పెద్దాయనతో ఇలా అన్నాడు " అయ్యా మీ దయ కు చాలా సంతోషం. మీకు కావలసినంత భూమి ఉంది సరే. నాకు కావాల్సింది కొంచెమే , అయితే ఇంత సువిశాలమైన
ఈ భూమిలో నా భూమి హద్దులు ఏమిటో తెలుసుకోవాలని ఉంది అంతే. నాకు ఇచ్చిన భూమిని కొలిచి హద్దులు ఏర్పరిచి, దస్తావేజులు రాయించి ఇప్పించాలని నా కోరిక. మీరు ఎంతో ప్రేమతో మీ భూమి ఇస్తున్నారు కానీ ముందు ముందు మీ బిడ్డలు ఈ భూమిని నా నుంచి ల్లాక్కోరని నమ్మకం ఏముంది?"
పోఖమ్ అనుమానాన్ని అర్థం చేసుకున్నాడు పెద్దాయన.
" మీరన్నది బానే ఉంది, దస్తావేజులు రాసి ఇవ్వచ్చు అన్నాడు"
" అయితే ధర ఎంతో చెప్పండి మరి"
"ధరకేముంది మాది ఒకటే ధర, రోజుకి వెయ్యి రూపాయలు. అన్నాడు.
పోఖం కి అర్థం కాలేదు.
" రోజు కొలమానం ఏమిటి"అని అడిగాడు.
మాకు కొలతలు ఏమీ తెలియవు .భూమిని రోజుల లెక్కనే అమ్ముతాం. ఒక రోజులో ఎంత ప్రదేశం చుట్టి వస్తారో అదంతా మీదే అవుతుంది. కేవలం వెయ్యి రూపాయలకే "అన్నాడుపెద్దాయన.
పోఖం ఆశ్చర్యపడ్డాడు .
."అయితే ఒక షరతు ఉంది" అన్నాడు పెద్దాయన. "బయలుదేరిన రోజు సూర్యాస్తమయం కాక పూర్వమే మీరు బయలుదేరిన చోటికి రా లేకపోతే భూమి మీకు దక్కదు. మీ సొమ్ము మాకు చెందుతుంది " అని చెప్పేసి ఎటు వాళ్ళు అటు వెళ్లిపోయారు.
*
పోఖం ఆనందానికి అవధులు లేవు. ఆ రాత్రి పోఖం కి నిద్ర పట్టలేదు. అత ని బుర్రంతా భూమి గురించిన ఆలోచనల తో నిండిపోయింది. వీలైనంత ఎక్కువ భూమిని చుట్టి రావాలి. చుట్టి వచ్చిన భూమినంతా ఏమి చేయాలా అని ఒకటే ఆలోచన.
తెల్లవారి చిన్న కునుకు పట్టింది. కన్నుమూసాడో లేదో ఒక పీడకల వచ్చింది. పెద్దాయన పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నాడు. అంతలోనే ఆ కల రకరకాలుగా మారిపోయింది .
తేరిపారి చూడబోతే అతడు పెద్దాయన కాదు , అతడు వ్యాపారి, అంతలోనే ఒక రైతు లాగా చెరువు లాగా పెద్ద భూతం లాగా మారిపోయాడు .
ఇంకా చూడ బోతే ఒక పెద్ద పిశాచం లాగా మారిపోయాడు. ఆ పిశాచం కాళ్ళ ముందు ఎవరిదో శవం పడి ఉంది. చూస్తే అది ఎవరి శవమో కాదు తనదే .
పోఖమ్ తుళ్ళి పడి లేచి భయభ్రాంతు డయ్యాడు. "కలలన్నీ ఇలాగే తలాతోకా లేకుండా ఉంటాయి " అనుకున్నాడు.
చుక్క పొడిచింది. తెల్లవారిపోతుంది అనుకొని బయల్దేరడానికి సిద్ధమయ్యాడు.
*
ఉదయాన్నే అందరూ బయలుదేరి మైదానానికి చేరుకున్నారు.
"ఇదే గుర్తు ఇక్కడ నుంచే బయలుదేరండి. మళ్లీ ఇక్కడికే రండి. మీరు చుట్టివచ్చిన భూమి అంతా మీదే "అన్నాడు పెద్దాయన.
డబ్బు మూట పైకి తీసి టోపీ మీద ఉంచాడు పోఖమ్ .చిన్న సంచిలో రొట్టెలు వేసి భుజాన ఉంచాడు. బెల్ట్ బిగించి కట్టుకుని దానికి మంచినీళ్ళ తాబేటి కాయ కట్టాడు .
లాంగ్ బూట్లు తొడుక్కుని పార భుజాన వేసుకుని బయలుదేరాడు. సూర్యుడు పైకి రావడం చూసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని, చల్లగా ఉన్నప్పుడు అయితే నడవడం చాలా సులువు అనుకుని తొందరగా నడక ప్రారంభించాడు . అరమైలు వెళ్ళాక అక్కడ మట్టి తవ్వి ఆనవాలు పెట్టాడు .
తర్వాత మళ్లీ నడక సాగించాడు. నడక సాగిస్తూ ప్రతిచోట ఆనవాలు పెట్టి పోతున్నాడు.
" ఈ ప్రదేశమంతా చాలా సారవంతంగా కనిపిస్తుంది భూమి అంతా బంగారమే. ఇది వదలడానికి వీలు లేదు." అనుకుంటూ నడక సాగించాడు.
కొంతదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వాళ్లంతా చీమల్లాగ కనిపిస్తున్నారు. నడక వల్ల శరీరం వేడెక్కింది. ఎండ కూడా ఎక్కువ అయింది .చొక్కా విప్పి భుజం మీద వేసుకొని నడక సాగించాడు.
చద్ది తినే వేళయింది అనుకొని కూర్చున్నాడు . సంచి విప్పి రొట్టి తీసి తిన్నాడు . ప్రాణం కుదుటపడింది. కాసేపు కునుకు తీస్తే బాగుండేది అనిపించింది కానీ, ఎక్కడ నిద్ర పట్టేస్తుందో అని భయపడి ఊరుకున్నాడు. కాసేపయ్యాక బయల్దేరాడు. రొట్టె తినడం వల్ల కొంచెం శక్తి వచ్చింది. నడక బాగానే సాగుతోంది . అయితే ఎండ నిప్పులు చెరుగుతోంది. అలసట, మైకం కమ్ముకు వొస్తున్నాయి.
అయినా పోఖమ్ ఆగకుండా నడుస్తునే ఉన్నాడు.
ఆ దిశలోనే చాలా దూరం పోయాడు. ఇక మలుపు తిరుగుదాం అనుకుంటుండగానే అక్కడ భూమి తేమగా ,పల్లంగా కనిపించింది . ఇది చాలా సారవంతమైన భూమి. దీనిని వదలడం ఏమిటి? తెలివితక్కువతనం కాకపోతే ఇక్కడ ఏ పంటయినా బాగా పడుతుంది" అనుకొని
ఆ భూమిని కూడా ప్రదక్షిణ చేసి, అక్కడ చిన్న ఆనవాలు పెట్టి మళ్ళీ ఎడమ వైపు తిరిగాడు. వడగాలి కొడుతోంది . కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వెనక చూస్తే ఎవరు కనబడటంలేదు. "చాలా దూరం వచ్చేశాను." అనుకుంటూ తొందరగా నడక సాగించాడు. సూర్యుడు అప్పుడే వాలిపోయాడు.
" ఇక ఎంతో దూరం నడవలేను సరాసరి వెనక్కి వెళ్ళిపోతాను. ఉన్నది చాలు . అట్టే సమయం లేదు " అని ఆ ప్రాంతంలో మట్టి తీసి ఆనవాలు పెట్టి తిరుగు ప్రయాణం అయ్యాడు.
*
పోఖం కి నడక చాలా కష్టంగా ఉంది.
భారంగా నడుస్తున్నాడు. ఈసారి అడుగులు తొందర తొందరగా వేస్తున్నాడు. చివరికి పరుగు లోకి దిగాడు . చిరిగిపోయిన చొక్కాను విప్పి పారేశాడు. బూట్లు విప్పేసాడు .తల మీద టోపీ తీసి అవతల పారేశాడు.
"అయ్యో భూమంతా ఆపోసన పట్టాలని చూశానే ఇప్పుడు అంతా పోయేలా ఉంది. దురాశ దుఃఖానికి చేటు. సూర్యుడు అస్తమించే లోగా బయలుదేరిన చోటికి చేరుకోలేనేమో ! నా పని అయిపోయింది" అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా అతన్ని భయం ఆవరించింది. భయం వల్ల ఊపిరి తీయడం కష్టంగా ఉంది. పరిగెడుతున్నాడు. నోరు పిడచ కొట్టుకు పోతోంది. బనియను, లాగు తడిచిపోయి శరీరానికి అతుక్కు పోయాయి. దమ్ము కి ఊపిరితిత్తులు బద్దలై పోతాయా అనిపిస్తుంది. గుండెలు గుభేల్ గుభేల్ సమ్మెటతో కొడుతున్నట్టు ఉన్నాయి .కాళ్ళు లొడ లొడ పోతున్నాయి .
భయం, అలసటతో 'చని పోతానేమో' అనే భయం పిశాచం లా ఆవహించింది. అయినా ఆగడానికి మనసొప్పడం లేదు.
ఇంత దూరం పరిగెత్తి , ఆగిపోతే నన్ను అంతా చచ్చు దద్దమ్మ అనరూ ?
అప్పటికే కొంచెం దగ్గరికి వచ్చాడేమో అక్కడ వాళ్ళ అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. వాళ్ల కేకలకి అతని గుండె మరింత వేగంగా కొట్టుకోవడం ఆరంభించింది.
*
పోఖమ్ ఆలోచనలో పడ్డాడు
సూర్యుడు పడమట కుంకడానికి తొందర పడుతున్నాడు.
ఆకాశ మంతా కాషాయ రంగు పూసు కొంటోంది.
సూర్యుడు రక్తపు ముద్ద లా ఉన్నాడు.
ఇక సూర్యుడు ఏ క్షణంలోనైనా అస్తమించి వచ్చు.
"నాకు చాలా భూమే ఉంది. కానీ దాన్ని అనుభవించటానికి బతికి ఉంటానా? అయ్యో నాశనం అయిపోనే, గడువు లోపల హద్దుకు చేరుకోలేను" అనుకుంటూ సూర్యుని వైపు చూశాడు. సమీపానికి వచ్చేసినట్టే , చివరి ప్రయత్నం చేయడానికి శక్తిని కూడదీసుకుని, ముందుకి ఒక ఉరుకు ఉరికాడు. ఆ వేగానికి అతని కాళ్ళు తట్టుకోలేక పోయాయి.
తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. భూమ్యాకాశాలు చీకట్లు కమ్మినట్టయింది. అతని గొంతు లోంచి బాధగా, దీనంగా, నీరసంగా ఓ మూలుగు వినిపించింది .
"అంతా అయిపోయింది" అనుకొన్నాడు. ఇంకా ఆగి పోదామని అనుకుంటుంటే ఎదురుగా ఉన్న వాళ్ళ కేకలు అరుపులు వినిపించాయి. అవి అతనికి స్ఫూర్తిని కలిగించాయి. ఆయాసపడుతూ కిందా మీదా పడుతూ నడవడం సాగించాడు. ఎదురుగా చూస్తే పెద్దాయన పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నాడు. పోఖం కి ఎందుకో రాత్రి కల గుర్తుకు వచ్చింది. వెళ్లి టోపీని ముట్టుకో బోయి పెద్దాయన కాళ్ళ ముందు పడిపోయాడు.
"భేష్! నెగ్గావు...
నీకు మహా మంచి భూఖండం దక్కింది "అన్నాడు పెద్దాయన. సాష్టాంగ పడిపోయిన పోఖంని లేవనెత్తడానికి అతని సేవకుడు ముందుకు పరుగెత్తాడు కానీ అప్పటికే సమయం మించిపోయింది. పోఖం నోటి నుండి రక్తం కక్కుకుంటున్నాడు. అక్కడ వాళ్ళందరూ సంతాపంగా తలలు దించారు.
సేవకుడు పార తీసుకుని సమాధి చేయడానికి గొయ్యి తీస్తున్నాడు.
చివరికి పోఖం కి ఎక్కువ స్థలం అక్కర లేక పోయింది .కేవలం ఆరు అడుగుల నేల !!!
ఎంత దేవు ళ్లాడినా చివరికి ఆరడుగుల నేలనే అతను ఆక్రమించు కోగలిగాడు.... పాపం!!!!???
* * *
No comments:
Post a Comment