*వాక్కులే వరాలు* అది ఎలాగో తెలుసుకుందాం.
"మన మనసేమిటో వాక్కుల ద్వారా వెల్లడవుతుంది. ఆత్మీయత, ఆప్యాయతాను రాగాలు మాటల్లో అమృతాన్ని నింపుతాయి. ఆసూయ, ద్వేషం నిండిన వాక్కులు విషాన్ని వెదజల్లుతాయి. వాక్కులే మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి, వాక్కులతో, పాటు ముఖ కవళికలు, శరీర కదలికలూ ఎంతో ప్రాముఖ్యం వహిస్తాయి. రుష్య మూక పర్వతం మీదకు తరలివస్తున్న రామలక్ష్మణులను చూస్తూనే వాలి భయం ఆవహించిన సుగ్రీవుడు కంపించిపోతాడు. తనను అంతం చెయ్యడానికి ఆ ఇద్దరినీ వాలి పంపాడేమోనన్న శంక కలిగి, వివరాలు తెలుసుకురమ్మని ఆంజనేయుణ్ని పంపిస్తాడు. కామరూపుడైన మారుతి రూపం మార్చుకుని వెళ్ళి రామలక్ష్మణుల వివరాల్ని ఎంతో వినయంగా, సంస్కారయుతంగా అడిగి తెలుసుకుంటాడు. రాముడు ఆంజనేయుడి మృదు సంభాషణ గురించి లక్ష్మణుడికి ఎంతో గొప్పగా
ప్రశంసాపూర్వకంగా చెబుతాడు.ఉన్న విషయాన్ని సూటిగా,స్పష్టంగా అనవసర శరీర విన్యాసాలు, తల ఎగురవెయ్యడం లాంటి వికార చేష్టలు లేకుండా అంజనేయుడు మాట్లాడతాడు.
ఇక్కడ వాల్మీకి రాముడి పాత్రపరంగా హనుమ గురించి ప్రస్తావించిన అంశాలు. ఇప్పటి కాలంలో మనం చెప్పుకొనే వ్యక్తిత్వ వికాసా మూల సూత్రాలు, విద్యార్థులకు ఉద్యోగార్ధులకు అవి ఎంతో మార్గదర్శకాలు.
పురాణ, ఇతిహాసాల పట్ల చులకను నిర్లక్ష్యం చూపనివాళ్లకు ఇలాంటి అమూల్య రత్నాలనదగినవి ఎన్నో లభిస్తాయి. కాళిదాసు శివపార్వతుల ఆను బంధాన్ని వాక్కు, అర్ధం (వాగర్థాల) మధ్యగల అవినాభావ సంబంధంగా చెబుతాడు. నిజానికి ఇలాంటి అనుబంధం అందరు దంపతుల మధ్య ఉండాలి. పురు షాధిక్యంతో పరుషంగా మాట్లాడే భర్త చేజేతులా తన సంసారాన్ని కలతలపాలు చేసుకుంటాడు. గయ్యాళి భార్య అయినా అంతే. వాక్కులను పరిమళభరిత పుష్పా లుగా, మృదువుగా ఎదుటివారి మనసును తాకేలా మలచడానికి మనకు మనం తర్పీదు ఇచ్చుకోవాలి.
పరీక్షిత్తుకు శాపం ఇచ్చిన మునిబాలకుడు, బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామ (మంత్రాలనే వాక్కుల ద్వారా) ఉపసంహరించుకోలేని అసమర్థులు. కావడం వల్ల ఆనర్ధం వాటిల్లింది. శాపం అంటే తపస్సు ద్వారా ఆర్జించిన అమూల్య దివ్యశక్తిని దుర్వినియోగం చెయ్యడం వరం అంటే సద్వినియోగం చెయ్యడం.. తాపసులు రామసులు కాకూడదు. శివాంశ సంభూతుడైనా తామస లక్షణం వల్ల దుర్వాసుడికి చెడ్డ పేరు వచ్చింది.
అల్పాయుష్కుడైన మార్కండేయుడు నారద మహర్షి సహృదయ వాక్కులతో ఇచ్చిన ఆశీస్సులతో చిరంజీవి అయ్యాడు. ఆదిశంకరులు బీద ఇల్లాలు భక్తితో ఇచ్చిన ఆమలక ఫలం స్వీకరిస్తూనే, కరుణ ఉప్పొంగి ఆశువుగా కనకధారాస్తవం చెప్పగానే అమ్మవారు బంగారు ఉసిరికాయలు వర్షించినట్లు చెబుతారు. అలా ఉంటుంది. వాక్కుల శక్తి, బాధాతప్త హృదయానికి పన్నీటిజల్లు లాంటి ఓదార్చు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఆ చల్లని మాటలు అగ్నిలా దహిస్తున్న బాధను ఉపశమింపజేస్తాయి. శ్రీరామ విరహాగ్నిలో తపించిపోతున్న సీతమ్మ తల్లికి ఆంజనేయుడి రామసందేశ వాక్కులు సంజీవని చినుకుల్లా సంబరం కలిగిస్తాయి. ఆశల్ని పునరుజ్జీవింపజేస్తాయి.
ప్రతి మాటా బీజాక్షరాల సంపుటి అది అక్షర దేవతల అద్భుత శక్తితో నిండి ఉంటుంది. వాటిని పూలబాణాల్లా, శుభకామనలుగా ప్రయోగించినప్పుడు వాక్కులే వరాలవుతాయి. పరిపక్వమైన ఆధ్యాత్మికత కలవారి వాక్కులన్నీ వరాల మూటలే. * మిత్రులారా !మన మాటల్ని కూడా వరవీణా మృదురాగాలుగా మార్చుకొనే ప్రయత్నం చేద్దాం.?
- కాటూరు రవీంద్రత్రివిక్రమ్.
సేకరణ. మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment