Thursday, November 24, 2022

 అరుణాచల👏 

భక్త పోతన , యోగి వేమన , త్యాగయ్య  వంటి ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రజల ముందు మెరిసిన ఆణి ముత్యం  సినీ నటుడు " చిత్తూరు  వి నాగయ్య " గారు . తనకు లేకపోయినా ఇతరులకు పెట్టేవాడు .... అంతటి దాన కర్ణుడు కూడా ...

       * చిత్తూరు నాగయ్య గారి జీవిత మలుపు *  :

  1930 ........  నా భార్య చనిపోగానే నాకు ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది . భగవద్గీత పారాయణం పదే పదే చేస్తూ ఉండేవాడిని . నా భార్య గురించి ఏ చిన్న ఆలోచన వచ్చినా కృంగిపోయే వాడిని.

     ఇల్లు విడిచి దేశదిమ్మరి వలె అక్కడా , ఇక్కడా తిరిగి చివరికి రమాణాశ్రమం  చేరాను . భూలోక స్వర్గంలో అడుగు పెట్టినట్లు అనిపించింది . మహర్షి చుట్టూ , మొత్తం ఆశ్రమంలోనూ ఉన్న ఆ ప్రశాంతత నన్ను ముంచివేసింది . రాజఠీవి గల మహర్షి మౌనం నా శోకాన్ని అంతం చేసింది . మనఃశాంతి దొరికింది . నా పట్ల గల జాలిని కూడా అంతమొందించింది . పాల్ బ్రంటన్ నేనూ మంచి స్నేహితులము అయ్యాము . రోజులు హాయిగా , ఆనందంగా గడచిపోతున్నాయి .

   రమణాశ్రమానికి వచ్చే నా స్నేహితుడు ఒకరు నన్ను గుర్తుపట్టి , తాను తీస్తున్న సినిమాలో పాట పాడమని , నన్ను తీసుకుపోతానని  చెప్పాడు . భగవాన్ అనుమతి లేనిదే నేను ఇక్కడ నుండి కదిలేది లేదు అని అన్నాను . మహర్షి సన్నిధి నుండి వెళ్లడం అసంభవమనిపించింది . అయినా అప్పటికే నాలో కోరికల బీజం నాటుకు పోయి ఉన్నది . మహర్షి అనుమతిని అడగటానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను . చివరికి ఒకరోజు మహర్షి అనుమతిని కోరగా ............

    " వెళ్ళవచ్చు , నీవు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది ." అని మహర్షి సెలవిచ్చారు .

    మహర్షి మాటల అంతరార్థం ఏమిటో అప్పుడు నాకు తెలియదు . పాట రికార్డింగ్ పనివల్ల నేను సినిమా ప్రపంచంలో అడుగు పెట్టాను . అంతే ఇక వెనక్కి తిరిగి చూడలేదు .  చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను .

     భగవాన్ శ్రీ రమణుల అనుగ్రహమే లేకపోతే అనామకునిగా శుష్కించిపోయే వాణ్ణి . నాకు ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించారు . ప్రతి మనిషి అవసరాన్నీ గ్రహించే అద్భుత శక్తి మహర్షికి ఉండేది . ప్రతి వారికీ ,  వారికి తగినట్లు అనువైన దారి చూపేవారు .

No comments:

Post a Comment