Sunday, February 12, 2023

*సహదేవుడి వేణువు* గురించి తెలుసుకుందాం.

 *సహదేవుడి వేణువు* గురించి తెలుసుకుందాం.
                                       
అంతఃపుర స్త్రీలందరూ గుమిగూడారు. రా ణివాసం తలుపులు తెరుచుకున్నాయి.
'నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మేము కూడా వేణు గానం చేయాలి. ఆ విద్య నువ్వే మాకు నేర్పాలి' అని పట్టుబట్టారు. బృహన్నల బేల చూపులు చూసింది. వేణువు ఊదడం తనెప్పుడూ నేర్చుకోలేదు.
రాజగృహ మాలినీమణుల కోరిక తీరేది ఎట్లానో...
'వేణుగానం నాకు రాదు. నన్ను శిక్షణ ఇమ్మని బలవంతం పెట్ట వద్దని' అమాయకంగా ము ఖం పెట్టి ప్రాధేయపడింది. కానీ వాళ్ళు వినేట ట్టు లేరు.

ఇప్పటికిప్పుడు వేణువు పైకి వీళ్లకు మనసు ఎందుకు పోయిందో అంతుబట్టడం లేదు.

' మన దగ్గర, ఈ గదిలో వేణువు కూడా లేదు కదా. మీకు నేర్పించడానికి...' అని తప్పించు కోవాలని చూసింది.

' అదెంతసేపట్లో పని, ఇప్పుడే కబురంపి చిటికెలో తెప్పిస్తాం ' అని అన్నారు వాళ్ళు ఉత్సాహంగా. ఎవరక్కడ? అనగానే వచ్చిన ప రిచారికతో వేగంగా వెళ్లి ఒక వేణువును తీసుకొని రమ్మని పురమాయించారు కూడా!

'దేవుడా ...వీళ్లు వదిలేలా లేరు' అని తల పట్టుకుని కూర్చుంది బృహన్నల.
ఏదో ఆలోచన మదికి తట్టింది. వెంటనే 'మన రాజ్యంలో బాగా వేణుగానం చేయగలిగిన క ళాకారుడిని పిలిపించి అతని ద్వారా ఆ విద్య అందరం నేర్చుకుందాం.' అని తనకు తోచిన ఆలోచనను అందరికీ చెప్పింది.
'చాల్లే ఆపు నీ మాటలు' అన్నట్లు చూశారు.
'అంతఃపుర రాణివాసం లోకి పురుషుడు అ డుగు పెట్టే అవకాశం లేనేలేదని' తేల్చి చెప్పా రు.

బృహన్నల గుండెల్లో బండ పడినట్లయ్యింది. అటూ ఇటూ చూసి మెల్లిగా అక్కడి నుంచి బ యటపడింది.
                         
అజ్ఞాతవాస కాలం. మత్స్య రాజు పరిపాలించే రాజ్యం.

పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం ము గించుకున్నారు. విరాట నగరం చేరుకున్నారు. విరాట రాజు కొలువులో  'కంకుడు ' పేరుతో ధర్మరాజు, 'బల్లవ ' గా భీముడు, ' బృహన్నల' గా అర్జునుడు, 'గ్రంధిక'గా నకులుడు, ' తంతి పాలుడు' గా సహదేవుడు, 'సైరంధ్రి 'గా ద్రౌపది... మారుపేర్లతో కొలువులు చేస్తున్నారు. 
కాలం గడుస్తూ ఉంది.
ఇదిగో ఇప్పుడు ఇలా ఊహించని రీతిలో తనకు వచ్చిపడిన 'వేణుగాన' సంకటాన్ని గురించి అర్జునుడు సతమతమవుతూ ఉన్నా డు.
రాజమహల్ వద్ద తారసపడిన ధర్మరాజుతో తో ఇదే విషయాన్ని చెప్పాడు.

' అర్జునా... ఎందుకైనా మంచిది. నువ్వు ఒక సారి సహదేవుడిని కలిసి మాట్లాడు. సమస్య ఒక కొలిక్కి వస్తుంది. శ్రీకృష్ణుడు, సహదేవుడు ఇద్దరూ కలిసి వేణుగానం విద్య పై , అందులోని మెళకువల పై లీనమై మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, నేను చాలాసార్లు చూసాను. నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కించగలిగినవాడు  సహదేవుడే' అని చెప్పి ధర్మరాజు వెళ్ళి పోయాడు.

అర్జునుడు సహదేవుడిని వెతుక్కుంటూ గోశాల వైపుకు కదిలాడు.
                           
గోశాల నిశ్శబ్దంగా ఉంది. సహదేవుడు అక్కడ లేడు. ఆవుల మందలను తోలుకొని ఉదయాన్నే కొండకు వెళ్లాడని సాయంత్రం తిరిగీ వస్తా డని అక్కడున్న పనివాళ్ళు చెప్పారు. అర్జునుడికి ఎందుకో ఒక సందేహం వచ్చింది.

'సహదేవునికి వేణువు వాయించడం వస్తుందా?' అక్కడున్న వారిని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యంగా ఎగాదిగా చూశారు.

'సహదేవుడి వేణుగానానికి గోవులు పరవశించి పోతాయని' చెప్పారు. అతడి వేణుగానం తో ప్రాతఃకాలంలోనే నిద్రలేచి గోవులు తమం తకుతాముగా పాలిస్తాయని' వాళ్లు చెప్పారు. అతడట్లా వేణువు వాయించుకుంటూ ముందు వెళ్తుంటే వెనుక వేలాది ఆవులు తన్మయ త్వంతో లయబద్ధంగా అడుగులు వేసుకుంటూ, మెడలోని గంటల శబ్దంతో కొండకు కదులుతాయని, చూడ్డానికి అదొక వేడుకలా ఉంటుందని' వాళ్ళు చెప్తున్నారు.
అర్జునుడికి నమ్మశక్యంగా లేదు. 
కొండలోని రాతి బండ పైన కూర్చొని సహదేవుడు వేణుగానం చేస్తున్నప్పుడు మేఘాల నీడలు పడతాయని, ఆవులకు దాహం వేసిన పుడు వానలు కురిపిస్తాయని, చెరువులు, కుంటలన్నీ నిండుతాయని, పచ్చని ప్రకృతి పరవశించి పశుపక్ష్యాదులకు ఆహ్లాదాన్ని ఇస్తుందని' వాళ్ళు అట్లా చెబుతూనే ఉన్నారు.

'వీళ్ళు చెబుతున్నది సహదేవుని గురించేనా?' అనే సందేహంలోనే అర్జునుడు ఉన్నాడు.

'సహదేవుడి వేణుగానం వింటూ ఒకవైపు గోవులు, మరోవైపు పులులు ఆ ప్రాంతంలో పక్కపక్కనే సంచరిస్తూ ఉండటం కూడా మేము చూశామని' ఇంకొందరు చెబుతున్నారు.
అంతా గందరగోళంగా అనిపిస్తోంది.
'సరే... సహదేవుడు వచ్చిన తర్వాతనే కలుస్తాను' అని చెప్పి గోశాల నుంచి వెనక్కి వచ్చేశాడు అర్జునుడు.
                                
పైన ఆకాశం నిర్మలంగా ఉంది. సాయం సమయం. కోవెల కోనేరు మెట్ల పైన ఒకవైపు అర్జునుడు కూర్చుని ఉన్నాడు. మరోవైపు సహదేవుడు ఉన్నాడు.

' నీకు వేణువు వాయించడం వచ్చునా...' సందేహంగా అడిగాడు అర్జునుడు.

తన చేతిలోని వేణువు తీసి , చేత్తో తుడిచి, పెదవి అంచుకు చేర్చి సుతారంగా గాలి ఊదాడు. సమ్మోహన అమృత సంగీత తరంగాలు.

చూస్తుండగానే కొలనులోని పూలన్నీ విచ్చుకున్నాయి. ఎక్కడి నుంచో రెండు రాజహంసలు ఎగురుతూ వచ్చి కోనేరులోకి చేరాయి. పురి విప్పిన మయూరాలు పచ్చటి పచ్చిక పైన ఆ డుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది.

' సహదేవ...! నాకు వేణువు వాయించడం నేర్పించాలి. ఆ విద్య నాకు ఇప్పుడు అవసరం వచ్చింది. అంతఃపుర రాణివాసపు స్త్రీలు త మకు నేర్పించమని పట్టుబడుతున్నారు.' అని అన్నాడు అర్జునుడు.
సహదేవుడు సరేనన్నట్టు తలాడించాడు.
'నేనేం చేయమంటావు' అడిగాడు అర్జునుడు ఆసక్తిగా.
'సాధన ' అని జవాబిచ్చాడు సహదేవుడు.
'ఇది నా ప్రతిభాపాటవాలు సంబంధించిన విషయంగా మారింది. సరిగ్గా చెప్పు తీక్షణంగా చూస్తూ అన్నాడు.
'సాధన' అని ప్రశాంతంగా సమాధానమిచ్చాడు సహదేవుడు.

'సరే , ఇదిగో నేను తెచ్చుకున్న వేణువును ఒక సారి వాయిస్తాను. చూడు.' అని అర్జునుడు వేణువును పెదవుల వద్దకు చేర్చి గాలి ఊదాడు. అందులో నుంచి ఏదో విచిత్రమైన శబ్దం వచ్చింది. మరోసారి వాయించాడు. అది పల కలేదు. గాలి తుస్సుమని శబ్దం చేసింది. సహదేవుడి వైపు ముఖం చిట్లించుకొని చూసాడు అర్జునుడు.
'సాధన చేస్తూ ఉంటే వస్తుంది ' అని సావధా నంగా అన్నాడు సహదేవుడు.
'వెదురులో ఏదో లోపం ఉన్నట్టుంది ' అని సమర్థించుకున్నాడు అర్జునుడు. సహదేవుడు చిన్నగా నవ్వాడు.

సహదేవుడి వేణుగాన విద్య అంతా అతడిలో ఉందా ? అతడి వేణువులో ఉందా ?
అర్జునుడికి ఏదో అర్థమైంది. స్పష్టత వచ్చిన ట్లైయింది. దులుపుకొని పైకి లేచాడు. సహదేవుడి వైపు సంతృప్తిగా చూసాడు.

'చివరిగా చెప్పు ...ఏమి చేయమంటావు?' అ ని అడిగాడు తన చేతిలోని వేణువును కోనేరులోకి విసిరేస్తూ.
'ఏ వేణువు అయినా ఒక కొయ్య ముక్కనే. అందులోకి నువ్వే ఊపిరి ఊది సంగీతాన్ని          పుట్టించాలి. దాని కోసమే కావాలి సాధన ' అంటూ స్థితప్రజ్ఞతతో చెప్పాడు. 
బయలుదేరడానికి పైకి లేచాడు సహదేవుడు.

ఆకాశం లోకి రాత్రిని మోసుకొంటూ చంద్రుడు వస్తున్నాడు. ఎవరి పాటికి వాళ్ళు వెళ్లిపోయారు.                       
ఎప్పటిలాగానే ప్రాతఃకాలంలోనే నిద్ర లేచాడు సహదేవుడు. కాలకృత్యాలు ముగించుకున్న తరువాత వేణుగాన సాధన చేయడానికి పూనుకున్నాడు.
తలుపుకు అటువైపు ఉన్న గదిలో రోజూ వేణువు పెట్టె చోట చూశాడు. అది అక్కడ లేదు. కిందా, పైనా వెతికాడు. కనిపించలేదు.
వేణువు ఎక్కడుందో, దానిని ఎవరు తీశారో అర్ధమయ్యింది. తనలో తానే నవ్వుకున్నాడు.
కొత్త వేణువు తయారు చేసుకోవడానికి వెదురు పొదల దారి వైపుకి ముందుకు కదిలాడు.                                                              - డాక్టర్ వేంపల్లి గంగాధర్

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment