06102. 1-6. 280123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*అసలైన సౌభాగ్యం*
➖➖➖✍️
*సమాజంలో అందరిదీ ఒకే రీతి జీవిత గమనం కాదు. కొందరు భాగ్యవంతులు, మరికొందరివి దైన్యమైన జీవన పరిస్థితులు.*
*ఎందరో వారివారిలోని సామర్థ్యాన్ని, సహజ ప్రతిభలను వృద్ధి చేసుకునే అవకాశమూ ఆలోచనా లేనివారు. వీళ్లంతా సంతోషంగా బతుకుతున్నారా అంటే, కచ్చితంగా ఔనని చెప్పలేం.*
*ఆనందం మనసుకు సంబంధించింది. అదేమీ ఎండమావి కాదు. ఆనంద స్థితిని అందుకోవడం కష్టతరం కాదు. ఎందుకంటే సంపదలకు, లేమికి అతీతమైంది ఆనందం. కొన్నిసార్లు బండి లాగేవాడిలో కనపడే ఆనందం సొంత కారు నడిపేవాడిలో కనిపించకపోవచ్చు.*
*సంతోషం లేని సంపదలు విషతుల్యమైన రసభరిత ఫలాల్లాంటివని కౌటిల్యుడు రాజనీతి శాస్త్రంలో చెబుతాడు. మనలో చైతన్యం ఉంటే సంతోషం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.*
*కష్టసుఖాల మధ్య తేడా గమనించని వ్యక్తి మనసు సదా నిర్మలంగా ఉంటుంది. నిర్మల హృదయం గలవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందం వేరెక్కడో దొరికే వస్తువు కాదు. మనలోని చైతన్యమే ఆనందం!*
*ఏది ఉన్నా లేకున్నా, అసంతృప్తితో జీవించేవాడికి ఆనందం అందని ద్రాక్ష లాంటిదే. జీవన మార్గంలో ఎంత వేగిరపడినా అందరికీ అన్నీ అందవు. దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. ఈ హద్దులను గుర్తించలేకపోతే నిరాశ, నిస్పృహ తప్పవు. మనిషికి దుఃఖం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆశించడంలో తప్పులేదు. ఆశించినదాన్ని అందుకోవడం కోసం శ్రమ పడాలి. ఆశ లాలస కాకూడదు. శక్తికి మించిన ఆశ దురాశే అవుతుంది. గాఢమైన కోరికలతో సతమతం కావడం మంచి లక్షణం కాదు. అది దుఃఖానికి కారణమవుతుంది.*
*ఎక్కడైతే కోపం, దురాశ, ఈర్ష్య ఉండవో ఆ శూన్యంలో చైతన్యం వికసిస్తుంది. ఆ చైతన్యమే ఆనందానికి హేతువు అవుతుంది.*
*వక్తగా వేదికనెక్కి ప్రసంగి స్తుంటే... సభలో నిశ్శబ్దం ఆవహించి అందరూ ఆ ప్రసంగాన్ని విని చివర్లో ఆ ప్రాంగణం కరతాళ ధ్వనులతో నిండిపోతే ఆ వక్త లోపలినుంచి ఉబికి ఉబికి పొంగిపొరలి వచ్చేదే ఆనందం. ఆ ఆనందం ఎలాంటిదంటే గతంలో తనను విమర్శించినవారిని సైతం హృదయపూర్వకంగా క్షమించేటంతటిది!*
*తోటలో గుంత తవ్వి ఒక మొక్క నాటడంలో మనం పూర్తిగా నిమగ్నమై ఆ పరిసరాలనే మరచిపోతే... అదిగో అక్కడ ఉంటుంది ఆనందం!*
*ధనం, ప్రతిష్ఠ, అధికారం కోసం వెంపర్లాడతాం. వాటిలోనే ఆనందం ఉందని అనుకొంటాం. ద్వేషం, అసూయ, కోపం మనల్ని వెన్నంటి ఉంటాయి. అయినా వాటిని గమనించం.*
*సూర్యోదయానికి ముందే చల్లని వాతావరణంలో కిలకిలా రావాలు చేస్తూ ఆకాశంలో ఎగిరే పక్షులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్రాతఃకాలంలో చల్లని గాలులకు ఊగుతున్న చెట్లు, మంచు కురిసిన పచ్చిక, ఇంటిముందు ఉదయాన్నే రంగవల్లులు దిద్దుతున్న గృహిణుల కళాభిరుచి... పరిశీలిస్తే ఎంతగానో ఆకట్టుకుంటాయి. మనసును కట్టిపడేస్తాయి. ఆ ఆనందం ముందు ధనం, ప్రతిష్ఠ, అధికారం ఏ పాటివి? అటువంటి అభిరుచి మొలకెత్తితే- మనుషుల్లో ఆనందం మొక్కగా మారి మ్రానవుతుంది. మనలోని చైతన్యం వికసిస్తే ఆనందం మనసును ఆవహించి ఉంటుంది.*
*యోగి ఎందుకు ఆనందంగా ఉంటాడు? ఆయన వద్ద డబ్బు లేదు. అధికారం అంతకన్నా లేదు. ఆ యోగిలోని చైతన్యం కారణంగా ఎప్పుడూ చిరునగవుతో అంతర్లీనంగా ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. దైవం పట్ల అప్రమత్తతతో, ఎరుకతో ఉంటాడు. ఆనందంగా జీవించగలిగితే పవిత్రత మనల్ని అనుసరించి ఉంటుంది. సంతోషంగా ఉండేందుకు మనిషి మనసుతో సంబంధం పెట్టుకొని భౌతిక విషయాలపట్ల నిర్లిప్తంగా ఉండాలి. సుఖం, దుఃఖం మనకు సంబంధించిన వ్యక్తులపై ఆధారపడి ఉంటాయి. ఆనందం అలా కాదు. అది మన మనసు లోలోపలి నుంచి ఉబికే ఊట!*✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment