జన్మ - కర్మ ఈ రెంటిలో ఏది ముందు?
"జ్ఞానమెట్లా కలుగుతుంది?" అని ఒకావిడ గురువుగారిని ప్రశ్నించారు...
జ్ఞానం కలుగుతుంది...
కానీ ఎట్లా కలుగుతుందనే విషయాన్ని
ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు...
అన్నారు గురువుగారు నవ్వుతూ...
అప్పుడు ఆవిడ ఏ భావుకతకు లోనైనారో...?
వారి కళ్ల వెంబటి నీరుకారటం చూశాం...
మనసులో బాధ ఉన్నప్పుడు కారే కన్నీరు వేడిగా ఉంటుంది...ఇది దుఃఖధార.
అసలు మనసే తొలగినప్పుడు కారే కన్నీరు చల్లగా ఉంటుంది....ఇది ఆత్మధార.
భగవన్నామం వినగానే ఎవని కంట కన్నీరు కారుతుందో....వారికి అదే చివరి జన్మ... అన్నారు రామకృష్ణులు.
"ఖం" అంటే ఆకాశం...
ఇతరుల కోసం, ఇతరం కోసం ఏడ్వడం
దుః"ఖం"(చెడ్డ ఆకాశం).
దేవుని కోసం మాత్రమే ఏడ్వడం
సు"ఖం"(మంచి ఆకాశం).
మంచి ఆకాశం అంటే "చిదాకాశం".
* * *
జన్మలు-కర్మలు గురించి...అడిగారొకరు...
నేనన్నాను-
జన్మ - కర్మ ఈ రెంటిలో ఏది ముందు?
జన్మ ముందు అయితే,
కర్మ లేకుండా జన్మ ఎలా కలుగుతుంది?
కర్మ ముందు అయితే జన్మ లేకుండా కర్మ ఎలా చేయగలవు? అన్నాను.
అవును...చెట్టు ముందా? విత్తు ముందా? లాంటి ప్రశ్నే ఇది...అన్నాడతను.
అవును...ఇది అనవస్థాదోషమని చెప్పబడింది వాశిష్ఠంలో...
"జన్మలకు, కర్మలకు కారణం భగవదిచ్ఛ" అనే సమాధానమే చిట్టచివరి సమాధానం. అని చెప్పాను.
పురుష ప్రయత్నము-ప్రారబ్ధము-భగవదిచ్ఛ గురించి ఒకరు అడిగారు...
మన వశంలో లేని ఓ శక్తికి
మనమంతా వశమై ఉన్నాం...
ఆ శక్తి యొక్క ప్రకటనారూపాలకు ఉన్న మూడు పేర్లే -
1.పురుషకారం
2.ప్రారబ్ధం
3.భగవదిచ్ఛ
అందులో నాకిష్టమైన పేరు - భగవదిచ్ఛ.
భగవదిచ్ఛయే పురుషకారంగా, ప్రారబ్ధంగా ఉన్నది అని అంటాను.
మీరు ఆ శక్తిని "ప్రారబ్ధం" అనే పేరుతో పిలుచుకుంటామంటే నాకేమీ అభ్యంతరం లేదు...
అప్పుడు ప్రారబ్ధమే పురుషకారంగా, భగవదిచ్ఛగా ఉంటుంది...అన్నాను.
కర్త వారి వారి ప్రారబ్ధకర్మానుసారంగా జీవులను ఆడిస్తున్నాడు...అని భగవాన్ కూడా ప్రారబ్ధం అనే పదాన్ని వాడారు...అన్నారు ఒకరు...
ఆ భగవాన్ తొలి ఉపదేశానికి వివరణ ఇలా ఇచ్చాను-
కర్త(భగవంతుడు)- కుమ్మరి.
మట్టితో ఏ పాత్రను తయారుచేయాలన్నది ఆయన యొక్క ఇచ్ఛ.
ఆ భగవదిచ్ఛకు మరో పేరే ప్రారబ్ధం.
అంతేగాని ప్రారబ్ధం అనేది 'గత-జన్మ-కర్మ' విశేషం కాదు.
ఆ ప్రారబ్ధమే పాత్రల యొక్క స్వరూప, స్వభావాలను నిర్ణయిస్తుంది.
కర్త జీవులను ఆడిస్తున్నాడు అంటే,
ఆయా పాత్రల స్వరూప స్వభావాలను అనుసరించి భగవంతుడు వాటిని వాడుకోవడమన్నమాట.
జీవుడు కర్త కాదు కనుక,
జరిగే సకలము భగవదిచ్ఛ మేరకే జరుగుతోంది కనుక
జీవుని అసలు పాత్ర మౌనంగా ఉండటమే.
* * *
No comments:
Post a Comment