Sunday, August 11, 2024

****మన దృష్టి కోణమే మన జీవితం -

 మన దృష్టి కోణమే మన జీవితం - 

నీవు 

దేహ దృష్టి, 
మనో దృష్టి, 
ఆత్మ దృష్టిలలో 
దేనిని కలిగి ఉన్నావు?

ఒక్కో మనిషి దృష్టి కోణం, వ్యక్త పరచిన భావాల వల్ల ఆవ్యక్తి ఏ స్థాయిలో ఉన్న వాడనేది పెద్దలు పసిగడుతుంటారు.

ముఖ్యంగా గురువులు/ఆచార్యులు తమ శిష్యులను తమ దగ్గర ఉంచుకొని విద్య బోధించేటప్పుడు ఈ విషయాన్ని వారి శిష్యులకి తెలీకుండా పరీక్ష చేసి తగు విధంగా వారికి శిక్షణని ఇచ్చేవారు.

ఇది దేహ దృష్టి, మనో దృష్టి, ఆత్మ దృష్టి అని మూడు రకాలు. ఇందులో ముందు నుంచీ చూసినప్పుడు ఆత్మ దృష్టి అత్యుత్తమమైనదీ, దేహ దృష్టి అథమము / కనిష్టమైనది.

ఒక వ్యక్తి అలా మన ముందు నుంచి వెళ్తుంటే అబ్బా భలే ఉన్నాడురా ఒడ్డూ, పొడుగూ, ఆ వంటి రంగూ, వేసుకున్న చక్కని బట్టలూ అని ఆనందించే వారుంటారు. వారికి ఆ దృష్టి ద్వారా, కట్టు బొట్టు, జుట్టు, బట్ట, కులం, రంగు, సౌందర్యం, ఇవి మాత్రమే వారి దృష్టికి అందుతాయి. 

ఉదాహరణకి 
ప్రవచనాలు వినడానికి వచ్చి ప్రవచనకర్త భౌతికాకారాన్ని చూసి పొగిడేవారు కొందరు. ఆయన ఏం చెప్పారు అన్నదాంతో సంబంధం ఉండదు. ఏం విన్నారో ప్రవచనం అయ్యాక గుర్తు ఉంటుందా అంటే అక్కడక్కడా వేంకటేశ్వర స్వామి పంచె లాగా అన్న మాట. వీరిది స్థూల/భౌతిక/దేహ దృష్టి. వీరి దృష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూనే ఏది లేదా అని వెతుకుతూ ఉంటారు.

ఇంకొకరు ఒక వ్యక్తిని చూస్తూనే ఈయన పండితుడిలాగా ఉన్నాడు అని తలచి ఆ వేపున కాస్త పరిశీలించి అబ్బా గొప్ప పండితుడు అని సర్టిఫికేట్లిస్తారు. చూసావా ఆ పంచె కట్టు ఆ వీబూధి బొట్టు, ఆ గడ్డం అదీనూ బహుశా ఈయన కవేమో, లేదా ఉపాసకుడేమో అని వారికి వారే పరి పరివిధాలా పరిశీలించుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక పాండిత్యానికి అంటగడతారు.

ఇలా చెప్పే వారు బోలెడు మంది. అబ్బా ఏం గుర్తు పెట్టుకుంటారండీ అనో, భలే చెప్తారండీ అనో, అబ్బా పద్యాలు ఏం చెప్పారండీ అనో, అన్ని పురాణేతిహాసాలు అన్నీ ఆయనకి కంఠతా అనో, అలా ఏదో ఒక సర్టిఫికేట్లిచ్చేవారుంటారు. వారు రెండవ కోవకి చెందినవారు. అలానే వీరూ అంతే అన్నీ బాగున్నాయంటూనే అదిగో చూసారా అక్కడ సరిగ్గా చెప్పలేదు అదీ ఇదీ అని లెక్కలు కడతారు.

ఇక అతి కొద్ది మంది ఉంటారు, ఆపక్కనుంచో ఆ వ్యక్తికి దగ్గరనుంచి అలా వెళుతుంటేనే అవతల వ్యక్తిలోని పరబ్రహ్మాన్ని చూసి నమస్కరిస్తారు. ఆ వ్యక్తిని చూడగానే అసంకల్పితంగా వారి రెండు చేతులూ ముకుళించుకుంటాయి. ముందు ఏదో ప్రణాళిక వేసుకుని వారిని కలిసి ఇలా నమస్కారం చేయాలి అవీ ఇవీ అని ప్రణాళిక చేయకపోయినా, వారిని చూడగానే వారిని తలచుకోగానే అప్రయత్నంగా రెండు చేతులూ ముకుళించుకుపోతాయి. మరో మాట ఉండదు, ప్రశ్నా ఉండదు, అక్కడ ఉండేది ఆనందం ఆత్మానందం. ఆ ఆత్మ దృష్టి అలవడాలనే ప్రతి ఒక్కరూ సాధన చేసేది.

No comments:

Post a Comment