మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతౌ శ్రుతమ్ ౹
మేఘాకాశ జలాకాశావివ తౌ సువ్యవస్థితౌ ౹౹155౹౹
155. జీవుడు ఈశ్వరుడు మాయయందు ప్రతిఫలించిన ఆత్మయని శ్రుతి చెప్పుచున్నది. మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశము జలమునందు ప్రతిఫలించిన ఆకాశముల వలెనే.
(మొదటిది ఈశ్వరుడు,రెండవది జీవుడు అని పోలికగా చెప్పవచ్చు)
తాపినీయ ఉప.9.
మేఘవద్వర్తతే మాయా మేఘస్థితతుషారవత్ ౹
ధీ వాసనాశ్చిదాభాస స్తుషారస్థఖవత్ త్థ్సితః ౹౹156౹౹
156. మాయను మేఘముతో పోల్చవచ్చు.బుద్ధి యందలి వాసనలు మేఘముగనున్న నీటి కణములతో పోల్చి చెప్పబడినవి. మాయయందు ప్రతిబింబింతమైన కూటస్థ చైతన్యము ఈ జలబిందువులందు ప్రతి ఫలించు ఆకాశము వంటిదని చెప్పబడినది.
వ్యాఖ్య:- ఈశ్వరతత్త్వమును వర్ణించు ఈ శ్లోకము అద్వైతసిద్ధాంతములో ఒక దుమారమును లేపి ఒక సమస్యను కూడా పరిష్కరించినది.
చైతన్య ప్రతిఫలనము మాయయందైన ఈశ్వరుడనీ అవిద్యయందైన జీవుడనీ మునుపు
(ప్ర.1.16,17) చెప్పబడినది.
ఈ శ్లోకమున మాయను మేఘముతో పోల్చి,బుద్ధి అందలి వాసనలలో ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడని సూచింపబడుచున్నది.అనగా ఈశ్వర సత్తను,మేఘములోని నీటిబిందువులందు ప్రతిఫలించె ఆకాశమును వలె ఊహింపవలసిందే గాని అహంత వలె స్పష్టము కాదని ఉద్దేశము.
అంతేగాక ఈశ్వరుని ఉపాధి కేవలము మాయమాత్రమే గాక అందలి బుద్ధి వాసనలు కూడా అని ఏర్పడుచున్నది.
ఇది అనవసరము కదా. మాయయందు సృష్టి అంతా ఉన్నది కనుక మాయను స్వీకరించుట చేతనే ఈశ్వరుడు సర్వజ్ఞుడు అగుచున్నాడు.
1. వాసనలనేకము లగుటచే వాని యందు ప్రతిఫలించుచు ఈశ్వరులు కూడా అనేకులగుదురు.
2. వ్యష్టి వాసనలని ఉద్దేశమైనచో ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాక అల్పజ్ఞుడు మాత్రమే అగును.
3. సమిష్టి వాసనలనినచో ప్రళయంలో తప్ప ఈ సమిష్టి ఏర్పడదు కనుక సృష్టి స్థితి కాలములందు ఈశ్వరుడు లేకపోవలసి వచ్చును.
కాని మాయను మాత్రమే స్వీకరించిన చాలదు.
ఈశ్వరోపాధియగు మాయ సాత్వికమగుటచే అందు వైవిధ్యముండజాలదు.
కాని ఈశ్వరుడు సర్వజుడు అనేటప్పుడు ఆమూలాగ్రముగ జగత్తు నందలి వైవిధ్యమంతా ఈశ్వరునకు తెలియుననియే భావింతుము.
ఈ వైవిధ్యమునిచ్చునది బుద్ధియందలి వాసనలే.అవి సృష్టి స్థితి ప్రళయ కాలములందుంటూ స్థూలసూక్ష్మకారణా వస్థలయందు మరల మరల మారుచుండును. కనుక ఈశ్వరునికి మాయ ఉపాధి ద్వారా ఐక్యతయు బుద్ధి వాసనలనెడి ఉపాధి ద్వారా వైవిధ్యమును సాధింపబడినవి.
అవాజ్మానసగోచరమైన తత్త్వమును మాటల ద్వారా ఆలోచనల ద్వారా తర్కబద్ధమైన సిద్ధాంతమునందు బంధింపజూచు వారికి ఇట్టి అగచాట్లు తప్పవు.
No comments:
Post a Comment