మాట్లాడిన రాఘవేంద్ర స్వామి…
1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి.
ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీన పరుచు కోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాధారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట. తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృదువుగా పలికినా శాసించే స్వరం, ధారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.
ఇంకొక సంఘటన…..
గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.
థామస్ మన్రో తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసిన వారు కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.
చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. ఒక ఆంగ్లేయునికి మన దేశంలో ఇన్నివిధాలుగా దేవుని నిదర్శనాలు కనిపించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది.
మనం కూడా చెప్పకపోతే ఈ తరానికి రాబోయే తరాలకు తెలిసేదెలా…...
No comments:
Post a Comment