*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*లయాత్మక జీవనం*
*చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. కొండచరియలనుంచి అరుణకాంతులతో కూడిన ఉషోదయపు వెలుగుతో నెమ్మదిగా ఆవిర్భవిస్తాడు. ఆ తరవాత భానుడు లయాత్మకంగా కొండ అంచును దాటుతాడు. నేలపై సూర్యకిరణాలు విరాజమానమవుతూ కనువిందు చేస్తాయి. బింబ కదలికలు కనిపించవు గానీ మధ్యాహ్న సమయానికి ఆకాశం మధ్యలో ప్రకాశిస్తాడు భానుడు. ఆ తరవాత మెలమెల్లగా కిందికి వాలుతూ పడమర దిక్కున దిగంతంలో కలిసిపోతాడు.*
*చందమామ గమనమూ అంతే. లయాత్మకమైనది. భూమిలో విత్తనాలు నాటుతాం. ఎండ, గాలి, చెమ్మ తగిలాక మూడో రోజుకు దళాలతో మొక్క ఊపిరి పోసుకుంటుంది. ఆకృతి దాల్చి మనోహరంగా కనిపిస్తుంది. అలా మొక్క లయాత్మకంగా ఎదుగుతూ పెద్దదవుతుంది. సుదూరం నుంచి అలలా సాగి గాలిలో వినిపించే ఓ పల్లెపదం వీనులవిందు చేస్తుంది. ఆ మనోహర గీతం వినబడే దిక్కుపై దృక్కులు సారిస్తాం. అలాగే నాట్యరవళి పరవశానికి గురిచేస్తుంది. సంగీత నాట్యకళలు లయ ప్రాధాన్యంగా సాగుతాయి. సాహిత్యంలోని ఛందస్సులో లయ ఉంటుంది.*
*ఓ ఆనకట్ట కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓ ఆకాశ హర్మ్యం నిర్మించాలన్నా అంతే. ఓ నిర్మాణాన్ని కూల్చడం గంటల్లో పని! విత్తనం, మొక్క, పువ్వు, పిందె, కాయ... ఇలా దశలు దాటు కుంటూ ఓ సమయానికి ఫలసాయం అందిస్తాయి వృక్షాలు. విధ్వంసక ఘటనలు ప్రకృతిలో మెరుపు వేగంతో జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, సుడిగాలులు, కార్చిచ్చులు... ఇలా మానవ వినాశానికి కారణమయ్యే ఉత్పాతాలు హెచ్చరిక లేకుండా విధ్వంసం సృష్టిస్తాయి.*
*లయాత్మకంగా మానవుడు జీవించాలని, ఆ దిశగా జీవనశైలి అలవరచుకోవాలని ప్రకృతి ఆకాంక్ష కాబోలు అనిపిస్తుంది. అటువంటి లయలో క్రమశిక్షణ దాగుంటుంది. లయ తప్పినప్పుడు ఊహకందని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గుండె నిర్ణీత వేగంలో లయాత్మకంగా నడుస్తుంది. ఆ వేగం హెచ్చినా, తగ్గినా ముప్పే. అందుకే మనిషి లయాత్మక జీవనం సాగించాలని ప్రకృతి చెబుతుంది. గురువులు బోధిస్తారు. అది జీవనశైలిని ఏర్పరచుకోడానికి తోడ్పడుతుంది. యోగా, ధ్యానం వంటి అభ్యాసాలు సైతం లయాత్మకంగా చేయవలసి ఉంటుంది. వేగంగా సాగే నడక మంచిదంటారు. వేగంగా నడిచే నడకలోనూ ఓ లయ ఉంటుంది. అలా హృదయ కండరాలు బలపడతాయి. కొందరు హడావుడిపడుతూ వేగంగా పనులు చేయాలని చూస్తారు. కచ్చితత్వంతో వేగంగా పనిచేయగల సామర్థ్యం యంత్రాలకే పరిమితం. మానవుడు యంత్రంలా జీవించకూడదు. లయాత్మక జీవితం గడిపేవారు ఒత్తిడికి దూరంగా ఆరోగ్యంగా జీవిస్తారంటారు ఆరోగ్య నిపుణులు.*
*శిశువు జన్మించేముందు తొమ్మిది మాసాలు గర్భవాసం చేస్తుంది. ఒక పువ్వును భయపెట్టి, తొందరగా వికసింపజేయలేం. హృదయం ఆనంద మాధుర్యాన్ని ఆస్వాదించిన వేళ కళాకారుడిలో సృజన జాగృతమవుతుంది. భయభ్రాంతులకు గురైన వేళ అతడు కళాఖండాలను సృజించలేడు. ప్రాణుల సహజ ఆవిర్భావం, అంతర్ధానం సైతం లయను సంతరించుకునే జరుగుతాయి. లయతో అనుసంధానమై జీవయాత్ర చేసినప్పుడు మనుషులు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారన్నది నిపుణుల మాట. మానవుల శారీరక, మానసిక వ్యవస్థలు లయాత్మక నడవడికి అనుగుణంగా నిర్మితమైనవే కాబట్టి అలా జీవిస్తే వారి జీవితాలు సార్థకమవుతాయి. ఆనందనందనాలవుతాయి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*సర్వేజనాః సుఖినో భవంతు*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
No comments:
Post a Comment