Vedantha panchadasi:
సత్యం జ్ఞాన మనంతం చేత్యుపక్రమ్యోప సంహృతమ్౹
యతో వాచో నివర్తన్త ఇత్యసఙ్గత్వ నిర్ణయః ౹౹196౹౹
196. ఆదియందూ, అంతమునందూ బ్రహ్మము సత్యము జ్ఞానము అనంత మనీ,వాక్కు తదితర ఇంద్రియములకు అది అగ్రాహ్యమనీ శ్రుతి చెప్పును.
దీని వలన బ్రహ్మము సంగరహితమని నిర్ణయింపబడుచున్నది.
తైత్తిరీయ ఉప.2.1.1, 2.4.1;
కేన ఉప.1.5,8;
బృహదారణ్యక ఉప.4.3.15,
4.4.22.
వ్యాఖ్య:- వస్తువు శాశ్వతమైనప్పుడే దాని నుండి శాశ్వతానందము లభ్యము కాగలదు.వస్తువు శాశ్వతముగా ఉండవలెనన్న అట్టి వస్తువు దేశ కాలాదులచేత పరిచ్ఛిన్నమై ఉండకూడదు.
ఇట్టి శాశ్వత వస్తువేదో దాని వలననే నిత్యానందము చేకూరును.మరి అట్టి శాశ్వతమై ఆనందరూపమై యుండు వస్తువేది?
దీనిని గూర్చి తైత్తరీయోపనిషత్తు
"సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ"
సత్యమై జ్ఞాన స్వరూపమై అనంతమై యుండు వస్తువేదో అది బ్రహ్మ.
ఇట్టి బ్రహ్మము అనంతమై యుండుటచే ఇదే శృతి.
"ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్".
బ్రహ్మము ఆనందరూపమని నిర్దేశించినది.
మానవుడు పరిమితమైన ఆనందముతో సుఖించలేక,పరిమితము లేని ఆనందాన్ని పదే పదే వాంఛిస్తున్నాడు.తాను పదే పదే వాంఛించే అపరిమిత ఆనందము సాక్షాత్ బ్రహ్మమేనని వేదాంత శాస్త్రము దృఢపరిచినది.
ఇట్టి ఆనంద రూపము బ్రహ్మమేనని తెలియక దానిని ప్రపంచ సంబంధ వస్తువుల యందు వెదుకుచున్నాడు.
బ్రహ్మమునందు ఆనందము లేదు. బ్రహ్మము ఆనందరూపమే.అయితే ఆనందరూపమయిన బ్రహ్మమును గ్రహించి ఆనందపడవచ్చుననిన అట్లు వీలుకాదు.
ఏలనగా పరిమితమైన మనోబుద్ధులతో అపరిమితమైన ఆనందమును గ్రహించుటకు వీలులేదు.జీవ బ్రహ్మలకు సంబంధించిన జ్ఞాన మంతయూ వేదములయందు,ఉపనిషత్తులయందు,భగవద్గీతాది స్మృతుల యందు ప్రతిపాదింప బడినది.
బ్రహ్మము సంగరహితమని నిర్ణయింపబడుచున్నది.
పరబ్రహ్మమును నేత్రములతో,వాక్కుతో,మనస్సుతో చింతించుటకు వీలుకాదు.అట్టి ఆత్మను భోధించుట ఎట్లు?
తెలియు వాటికి,తెలియబడని వాటికి అతీతముగా నున్నది.ఏ ఆత్మ వాగీంద్రియము చేత గ్రహింపబడదో,దేని శక్తి చేత పని చేయుచున్నదో ఆ ఆత్మయే పరమాత్మయని తెలిసికొనుము. దీనికి అన్యమైనది బ్రహ్మము కాదు.
ఈ ప్రకారము దేహత్రయము,పంచకోశములు,
అవస్థాత్రయము మొదలగునవి నాకు దృశ్యములై యుండుటచే అసజ్జడ దుఃఖాత్మకములనియు,నా స్వరూపము వీటికి విలక్షణము అసంగమునైన సాక్షిరూపమేననియు నిశ్చయించుకొన వలయును.
ఇట్లు దృగ్దృశ్య వివేకమును ఆశ్రయించి
"దేహత్రయ విలక్షణమును",
"పంచకోశ వ్యతిరిక్తమును",
"అవస్థాత్రయ సాక్షియునై"యుండు
"సచ్చిదానంద రూపాత్మయే"
తన స్వత రూపమని శృత్యుక్త్యాను భవముల ద్వారా నిశ్చయించుకోవాలి.
మాయీ సృజతి విశ్వం సన్నిరుద్ధస్తత్ర మాయయా ౹
అన్య ఇత్యపరా బ్రూతే శ్రుతిస్తే నేశ్వరః సృజేత్ ౹౹197౹౹
197. మరొక శ్రుతి మాయకు ప్రభువగు ఈశ్వరుడు జగత్తును సృష్టించుననీ జీవుడు మాయకు వశుడనీ చెప్పును.కనుక మాయతో కూడిన ఈశ్వరుడు సృష్టికర్త.
శ్వేతాశ్వర ఉప 4-9.
వ్యాఖ్య:-ఈ ప్రపంచమునకు కారణము బ్రహ్మమా?లేక కాలమా?లేక బ్రహ్మము ఈ సృష్టికి ఉపాదాన కారణమా?
మనము దేని వలన జన్మించితిమి?సృష్టింపబడిన మనము దేనిచేత జీవించుచున్నాము?
ప్రళయ సమయములో మనమెచ్చట నున్నాము?
మన మనుభవించుచున్న సుఖదుఃఖములు ఎవరి అధికారముతో అనుభవించుచున్నాము?
జగత్తునకు కారణము కాలమే అని కాలవేత్తలు చెప్పుచున్నారు. స్వభావము కారణమని లోకాయతికులు చెప్పుచున్నారు. కర్మ కారణమని మీమాంసకులు భావించుచున్నారు.
యదృచ్ఛచేతనే ప్రపంచము సృష్టింపబడుచున్నదని నిరీశ్వరవాదులు పలుకుచున్నారు. పంచభూతములే సృష్టికి కారణమని జగన్నిత్యత్వవాదులు చెప్పుచున్నారు.ప్రకృతియే కారణమని శాక్తేయులు చెప్పుచున్నారు.
జీవుడు లేక హిరణ్యగర్భుడు కారణమని యోగులు తలంచుచున్నారు.సంయోగము కారణమని కొందరు భావించుచున్నారు.
ఆత్మభావన కలదగుట వలన పైన చెప్పిన 7 వస్తువుల సమూహము కూడ జగత్కారణము కాలేదు. జీవుడు కూడా సుఖదుఃఖభూతమగు జగత్తునకు కారణము కాలేడు.
(కాలస్వభావో...అను మంత్రము నుండి 10 మంత్రములు నారద పరివ్రాజకోపనిషత్ 9.ఉ.లో గూడ కలవు.)
మాయకు ప్రభువగు ఈశ్వరుడు జగత్తును సృష్టించుననీ జీవుడు మాయకు వశుడనీ,మాయతో కూడిన ఈశ్వరుడు సృష్టికర్త యనీ శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పుచున్నది.
వికారసహిత క్షర జగత్తు, వికారరహితాక్షర బ్రహ్మము - ఈ రెంటిలో ఒకటి నశించునదిగాను, మరొకటి నాశరహితముగాను నున్నది.
ఈ క్షరాక్షరములు రెండును కలిసియున్న జగత్తును స్వతంత్రుడగు ఈశ్వరుడును, అస్వతంత్రుడగు జీవుడును ఇద్దరును భరించుచున్నారు.
వ్యక్తా వ్యక్తములను క్షరము అక్షరముగా చెప్పెదరు.ఈశ్వరుడు పరస్పరము కూడుకొని యున్న విశ్వమును భరించుచున్నాడు.
జన్మయే లేని మాయ,భోక్తృ భోగ్య వస్తువులతో కూడియున్నది.
జీవేశ్వరులను కల్పించుచున్న మాయ అనిర్వచనీయమై ఈశ్వర సన్నిధానమునందున్నది.
జన్మరహితులగు జీవేశ్వరు లిరువురును క్రమముగా అనంతుడగు ఈశ్వరుడుగాను అసమర్థుడగు జీవుడుగాను అగుచున్నారు.
ఈ జీవేవేశ్వరు లిద్దరును అజులు,జన్మాదివికారములు లేనివారలే.
కర్తృత్వ భోక్తృత్వ భావము వలన జీవుడు బంధింపబడుచున్నాడు. అయినను ఆ జీవుడే తాను నిరుపాధిక పరమాత్మయని గ్రహించినప్పుడు విముక్తుడగుచున్నాడు.
ఈశ్వర-జీవ-మాయ=ఈ మూడడింటిని
బ్రహ్మ స్వరూపముగా తెలిసికొన్నప్పుడు జీవుడు గూడా విశ్వరూపుడుగా నగుచున్నాడు.
మాయ క్షరము.అవిద్యాదులను నశింపజేయు పరమేశ్వరుడు అక్షరుడు,అద్వితీయుడు,స్వయం ప్రకాశుడు,పరమాత్మ.
క్షరమైన(నశించునది)
మాయను,అవిద్యను హరించువాడు కావున పరమేశ్వరుడు.
బ్రహ్మమే మాయవలన జీవేశ్వర రూపములతో గోచరించుచున్నది.అట్టి పరమాత్మ ధ్యానము వలనను, జీవపరమాతల సంయోజనము వలనను,నిరంతర తత్త్వచింతనము వలనను విశ్వమాయా నివృత్తి కలుగుచున్నది.
No comments:
Post a Comment