Monday, December 30, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


59. కృణ్వన్తో విశ్వమార్యమ్

 విశ్వమును ఆర్యముగా చేయుదముగాక (ఋగ్వేదం)

'ఆర్య' అనే శబ్దానికి 'పూజ్యత' అని అర్థం. అంటే - గౌరవించబడే ఉత్తమస్థాయి...అని భావం. అంతేగానీ 'ఆర్యులు' అనే ఒక 'తెగ' ఎక్కడా లేదు. 'ఆర్య-ద్రావిడ' విభజన ఒక అజ్ఞాన జనిత కల్పన. దానిని చరిత్రగా చూపించడంతో మనం నమ్ముతూ వస్తున్నాం. 'ద్రవిడ' అనేది అంగ, వంగ, కళింగ.... అనే దేశాల వలె ప్రాంత విభజన వాచకం. అది తెగనీ, జాతినీ సూచించేది కాదు.

భారతీయమైన వేద సంస్కృతి 'ఆర్యత్వాన్ని' ఆదర్శంగా చూపించింది. 'ఆర్య' భావన మతానికి సంబంధించినది కాదు. వేద మతస్థులు 'ఆర్యు'లనీ, అవైదికులు 'ద్రావిడు'లనీ, వీరిని వారు జయించేవారనే కల్పనలు మనల్ని విభజించడానికి విదేశీ ఎత్తుగడలలో భాగాలు. ఈ విషయం అనేక మంది చారిత్రక పరిశోధకులు (వారిలో ఇప్పుడు విదేశీమేధావులు కూడా) ఇప్పుడు అంగీకరిస్తున్నారు. కానీ మన చరిత్ర పాఠాలు వాటిని గమనించడం లేదు.

ప్రపంచమంతా 'ఆర్య' కావాలి. ఆర్యులతో నిండాలి... అనే మాట “నా మతమే విశ్వమంతా పాటించాలి" అనే ఆక్రమణల మనస్తత్వం గల దుర్మతాల సూక్తులు వంటిది కాదు.

ప్రపంచంలో అందరూ పూజ్యస్థానాన్ని, గౌరవనీయులైన స్థాయిని సాధించాలి అనే శుభాకాంక్ష ఇది.

గౌరవం దేనివల్ల లభిస్తుంది? సత్యం, జ్ఞానం, ధర్మాచరణ, విద్య, త్యాగశీలత, పరోపకార స్వభావం మొదలైన ఉత్తమ సంపదల వల్ల లభిస్తాయి. ఇలా అందరిచేత గౌరవించబడే భౌతిక సంపదతో, సద్గుణ సంపత్తితో ప్రపంచమంతా నిండిపోవాలి. ఒకరినొకరు గౌరవించుకొనే స్థితిని అందరూ పొందాలి అనే అద్భుతమైన విశాల భావన ఇందులో ఉంది.

సర్వే భద్రాణి పశ్యన్తు - అందరూ శుభాలనే అనుభవించాలని ఆకాంక్షించే విశాల వైదిక తత్త్వం ఈ శుభాకాంక్షలలోనూ పల్లవించింది. కేవలం భౌతికాభివృద్ధి 
ఆర్యత్వాన్నివ్వదు. తపస్సు, ఇంద్రియనిగ్రహం, శౌచం, మైత్రీభావం, సడలని ధర్మనిష్ఠ- ఇవి ఆర్యజీవన లక్షణాలు.

ఈ లక్షణాలే ప్రపంచమంతా నిండితే భువియే స్వర్గమౌతుంది కదా! ఇంతకంటే విశ్వకళ్యాణ కాంక్ష ఉంటుందా! వసుధైవ కుటుంబమనే గొప్ప భావనని యుగాలనాడే ఆవిష్కరించిన ఋషిపీఠం - ఈ భారతదేశం ఆ భావనని విశ్వవ్యాప్తం చేసే ఆకాంక్షలలో ఈ ఆర్యభావన ఒకటి.

భూమిని మాత్రమే కాక, అంతరిక్షమూ, గ్రహనక్షత్రాలు అన్నీ శాంతంగా ఉండాలని శాంతి మాత్రమే హృదయనాదంగా కలిగిన భారతీయాత్మ విశ్వానికి ఆదర్శప్రాయం. 

ఆర్యత్వాన్ని సాధించడానికి ఆచరణాత్మకమైన విధానాలనీ, వ్యవస్థను కూడా ఏనాడో సుస్థిరంగా ఏర్పరచుకున్న గొప్ప నాగరికత మనకుంది. మన అత్యంత ప్రాచీన గ్రంథాలైన రామాయణ, భారతాలు పరిశీలిస్తే అద్భుతమైన నాగరికత విరాట్ స్వరూపంతో సాక్షాత్కరిస్తుంది.

మాటలో సంస్కారం, ఆహారంలో నియమపాలన, సాటి వ్యక్తిని మన్నన చేయడంలో ఆతిథేయ సత్కారాలు, కుటుంబ సంబంధాలలో మర్యాదల పద్ధతులు, కట్టు బొట్టులో ఒద్దికా అణకువా, ప్రకృతి పరిసరాలను సైతం నొప్పించని సున్నితమైన అనుబంధాలు, విజ్ఞానవంతమైన ఆచార వ్యవహారాలు - మన ప్రాచీన గ్రంథాలలో కాళిదాసాది కవులు కావ్యాలలో కనిపిస్తాయి.

ఈ ప్రాచీన వ్యవస్థనీ, ఈ విద్యలనీ నిశితంగా అధ్యయనం చేసి తిరిగి ఆత్మగౌరవాన్ని పుంజుకుని 'పూజ్యత్వాన్ని' పొందగలిగే విధంగా మన భారతభూమిని తీర్చిదిద్దే కృషిని చేద్దాం. ఈ ఆర్యధర్మాన్ని ప్రపంచానికి నేర్పుదాం. ఆచరించి ఆచరింపచేద్దాం. 

ఆర్యధర్మమే ఆర్ష (ఋషి) ధర్మం.
ఆ ధర్మానికి పీఠం ఈ భారతదేశం.

ముందు ఈ వేదభూమిలో ఆర్యత్వాన్ని సుప్రతిష్ఠితం చేసి, క్రమంగా విశ్వవ్యాప్తం చేయాలి. మరొకమారు దృఢంగా గ్రహించుదాం. 'ఆర్యధర్మం' ఒక మతం కాదు. ఒక ఉత్తమ మానవధర్మం.      

No comments:

Post a Comment