☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
61. యస్యతే స్వాదు సఖ్యం స్వాప్య ప్రణీతిః
భగవానుని స్నేహం స్వాదువు. అనన్య భక్తి స్వాద్వీ(ఋగ్వేదం)
భక్తి యొక్క గొప్పతనాన్ని వేదం పలుచోట్ల ప్రస్తావించింది. భగవానుని పట్ల ప్రేమభావననే 'భక్తి' అని నిర్వచించిన నారదమతం వైదిక హృదయం.
పై ఋగ్వేద మంత్రం చాలా మధురభావనని ప్రసరిస్తోంది. భక్తి
ఆనందకరం-మధురం. భగవానుని నామ, రూప, గుణ, లీలా మాధుర్యాలను ఆస్వాదిస్తున్న కొద్దీ ఆ మాధుర్యం వృద్ధిచెంది, సమస్త బంధనాలను తొలగిస్తుంది.
అందుకే భక్తులంతా భగవన్నామ గానంతో ప్రపంచపు విషయాల రుచులనే కాదని ఆ ఆనందంలో లీనమవుతారు.
“మధురాధిపతేరఖిలం మధురం” అని కీర్తించిన భక్తులు, “జిహ్వే కీర్తయ కేశవం మురరిపోః చేతో భజ శ్రీధరం...” అని ఇంద్రియాలు భగవదర్పణమైనప్పుడు మరేమీ
అక్కరలేదని కోరుకున్నారు.
భక్తికి భక్తియే ఫలం. భగవత్ప్రేమమయమైన భక్తిలో కామనలేవీ ఉండవు. నిరంతర
భగవద్భావనా మాధుర్యంలో లీనమవడమే. అదే గొప్ప సంపద.
“భక్తి బిచ్చమీయవే రామయ్యా” అని త్యాగయ్య కీర్తించారు. ఈ
భగవత్ప్రేమానుభవాన్నే “సాత్వికభక్తి” అంటారు. “ఆనందాంబుధివర్ధనం, ప్రతిపదం
పూర్ణామృతాస్వాదనమ్... శ్రీకృష్ణసంకీర్తనమ్”అని చైతన్యమహాప్రభువు, కృష్ణకీర్తనమే
అత్యంత మధురమన్నాడు. ఈ భగవానునికి మనతో ఉన్న సఖ్యం, ఆయనపట్ల మనకున్న అనన్యభక్తి... ఈ రెండూ మాధుర్యాలే. మొదటి మాధుర్యాన్ని గ్రహించాలంటే, రెండవ మాధుర్యం ఉండాలి. అంటే - మధురమైన భగవంతుని
కృపను చవిచూడాలంటే, అనన్య భక్తి అనే మాధుర్యం మనలో ఉండాలి.
"భగవానుని సఖ్యం మధురం, ఆహ్లాదకరం, ఆనందకరం. ఆయన పట్ల అనన్యభక్తి సమస్త సంపాదనలను నివారించి, పరమానందాన్ని కలిగిస్తుంది" అని మంత్రభావం.
శక్తి ఆనందమయం. “స్వయం ఫలరూపత్వాత్” అని నారదుని భక్తిసూత్రం. భక్తి లభించడమే ఫలం. భక్తి వల్ల ఏదో లభించడం కాదు. పరమాత్మ తప్ప ఏదీ పట్టని అనన్యభక్తిని ఈ మంత్రం ప్రస్తావించింది. నవ విధ భక్తులలో సఖ్యభక్తి గొప్పది.
'సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి" - నేను అందరికీ సుహృత్తు(మిత్రుడు)నని తెలిసినవాడు శాంతిని పొందుతున్నాడని గీతాచార్యుని వచనం.
'సఖ్యం' గురించి చెప్తూ 'విశ్వాసః సఖ్య లక్షణం' అని శివపురాణ వచనం.
స్నేహంలో ముఖ్యలక్షణం విశ్వాసం. ఈ మాటను నిర్వచిస్తూ భగవత్ప్రేమలో (సఖ్యంలో) అన్నీ మంచే జరుగుతాయని అనడం కాకుండా, భగవత్ప్రేమికునికి ఏది
జరిగితే అది మంచి అని అర్థాన్ని గ్రహించాలి. భగవానుని ప్రసాదాలే మన అనుభవాలు అని భావించగలిగినప్పుడు అన్నీ ఆనందాలే.
"పాలముంచు మరి నీట ముంచు నీ పాలబడితి నిక జాలము సేయకు" అని రామదాసు కీర్తన. భక్తునికి ఏ అనుభవమైనా అది భగవత్కృతమే. మరియొక చింతన ఉండదు. అందుకే అతడు నిశ్చింతగా ఉంటాడు.
సుఖదుఃఖాదులలో దేనికీ చలించని ద్వంద్వాతీత స్థితిలో- “నా స్వామి అన్నీ మేలే చేస్తాడు" అనే తృప్తితో ప్రతి సంఘటననీ నిస్సంకోచంగా ఆహ్వానిస్తాడు.
నిరంతర భగవత్యాస ఇతర ఏ సుఖదుఃఖాదులకు అంటని స్థితిలో ఉంచుతుంది.ఆ ధ్యాస తప్ప మరేదీ కోరనివాడు నిత్యానంది. ఆ ఆనందం భక్తునికే తెలుస్తుంది. “మూకాస్వాదనవత్” - మూగవాడు మధురఫలాన్ని ఆస్వాదించగలడు, కానీ అభివర్ణించలేడు. అలాగే భక్తుని ఆనందం మాటకి అందదు.
“ఈలాగున వివరింపలేను చాలా స్వానుభవైకవేద్యమే" అని త్యాగరాజు ఈ భావాన్నే పాడారు.
ప్రణీతి, ప్రణయ, ప్రేమ, ప్రీతి, భక్తి- ఇవన్నీ ఒకే అర్థాన్ని చెప్పే శబ్దాలు. ఆ
ప్రేమ లేనప్పుడు జ్ఞానం రాదు. “అనురాగము లేని మనసున సుజ్ఞానము రాద”ని తేల్చి చెప్పారు త్యాగయ్య. భాగవతధర్మం ప్రేమమయమైనది కనుక స్వాదుతత్త్వంగా వేదం తీర్మానించింది.
No comments:
Post a Comment