*దేవుని దయ*
అమ్మ లక్ష్మీ దేవి స్వామి వక్షస్థలంపై ఎందుకు ఉంటుంది. మాములుగా దయ, జాలి అనేది మనిషికి ఎక్కడ ఉంటుంది అంటే అది హృదయంలో అని చెప్పొచ్చు. అయితే దయను ఒక రూపు కడితే అది మన అమ్మ లక్ష్మీదేవి. అందుకే అమ్మ స్థానం స్వామి యొక్క హృదయం వద్ద. అక్కడ ఆమె నిరంతరం ఉంటుంది.
అందుకే అమ్మకు పేరు 'విష్ణువక్షస్థల స్థిత' అని. అందువల్లే మనం రక్షణ అనేది పొందగల్గుతున్నాం. దయ అనేది భగవంతునితో ఏమి చేయిస్తుంది అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు.
స్వస్తి శ్రీర్దిశతాదశేషజగతాం సర్గోపసర్గ స్థితీః స్వర్గం దుర్గతీం అపవర్గికపదం సర్వం చ కుర్వన్ హరిః |
యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం క్రీడేయుం ఖలు నాన్యథాస్య రసదా సాదైకరస్యాత్తయా ||
'అశేషజగతాం' సఖల ప్రాణికోటికి 'శ్రీః' లక్ష్మీ దేవి 'స్వస్తి దిశతాత్' శుభాన్ని కలిగించుగాక. 'హరిః' కర్మ భారాలను, దోశములని హరింపజేసి జీవులని తరింపజేసే హరి అని పిలవబడే సర్వేశ్వరుడు. ఏంచేస్తాడు ఆయన...
'సర్గ' రూపులేని జీవుల్లకి రూపకల్పన చేస్తాడు, 'ఉపసర్గ' ఆ వచ్చిన రూపాలతో ఎందరికో మరిన్ని రూపాలని కలిపిస్తాడు, తిరిగి వెనకను తీసుకుంటూ ఉంటాడు. 'స్థితీః' ఉన్న వాటిని రక్షిస్తుంటాడు. అంతే కాదు మన కర్మను బట్టి 'స్వర్గం దుర్గతీం' స్వర్గ నరకాలని ఇస్తాడు. లేదా కర్మ తొలగిపోతే 'అపవర్గికపదం' మోక్షాన్ని ఇస్తాడు.
'సర్వం చ కుర్వన్' ఇవన్నీ చేసేప్పుడు 'యస్యా వీక్ష్య ముఖం' అమ్మ ముఖం చూస్తూ ఉంటాడు. 'తదింగిత పరాధీనః' ఆమె ఇంగితానికి పరాధీనుడై ఉంటాడు. అంటే 'విధత్తేఖిలం' ఏది చేసినా అమ్మ ముఖం చూస్తూనే చేస్తాడు. ఆమె ముఖం ఆనందగా ఉంటే ఆయన చేసే సృష్టీ, స్థితీ, లయాలు ఆనందంగా సాగుతాయి.
మనిషి పుట్టడం, పెరగడం మరియూ మరణించడం అన్నీ ఆనంద దాయకంగా సాగాలనే కదా ఎవరైనా కోరుకొనేది. ఆమె ముఖంలో కొంచం ఉదాసీనంకానీ, కోపం కానీ కనిపిస్తే ఆయన చేసే కార్యాలన్ని భాదను కలిగించేలా ఉంటాయి. అంటే దయ అనేది ఎదుటివారికి ఆనందం కలిగించేలా ఉంటుంది. ఆయన చేసే ఇన్ని కార్యాలన్నీ ఆయనకు పెద్ద భారం కాదు, అవలీలగా చేస్తాడు 'క్రీడేయుం ఖలు' ఒక పిల్లవాడి ఆట మాదిరిగా ఇంత శ్రమచేస్తున్నాను అని అనుకోడు. ఎందుకు ఇలా చేస్తాడు...
'సాదైకరస్యాత్తయా' అమ్మతో ఏకరసత కావాలని అని అనుకుంటాడు. ఆమె ముఖంలో ఆనందమే తనకు ఆనందం. ఆవిడ ముఖంలో దుఖమే ఆయనకూ దుఖం. 'అన్యథాస్య రసదా నా' వారిరువురులో ఏకరసతే తప్ప మరొకటి ఉండనే ఉండదు. అట్లాంటి స్వరూపం వారిరువురిది. మన రక్షణ కోరుకునే వారు ఒక్కరున్నా చాలు కానీ ఇరువురు ఉన్నారంటే మనలో ఎంతో విశ్వాసం జనిస్తుంది. వేదం మనకు ఇదే విషయాన్ని తెలుపుతుంది.
సామాన్యంగా దేవునికి దయలేదు అని నిందించేవారికి ఇది ఎంతో స్పూర్తినిస్తుంది. దయ కలిగిన అట్లాంటి భగవంతునికి చెందినవాడిని అని ఒక్క సారి జ్ఞాపకం చేసుకుంటే మనం భగవంతుడిని నిందించే అవసరం ఏర్పడదు.
No comments:
Post a Comment