Monday, December 30, 2024

 Vedantha panchadasi:
ఆనందమయ ఈశోఽయం 
బహు స్యామిత్యవైక్షత  ౹
హిరణ్యగర్భరూపోభూత్సుప్తిః స్వప్నో యథా భవేత్ ౹౹198౹౹

198.  సుషుప్తి అవస్థ స్వప్నావస్థగా మారినట్లే ఆనందమయుడగు ఈశ్వరుడు,
ఒకడైన తాను అనేకులు కావలెనని సంకల్పించినపుడు,
హిరణ్యగర్భుడగును.దాని వలన సకల సూక్ష్మశరీరములతో సంబంధపడును.

క్రమేణ యుగపద్వైషా 
సృష్టిర్ జ్ఞేయా యథాశ్రుతి ౹
ద్వివిధశ్రుతి సద్భావాత్ 
ద్వివిధ స్వప్నదర్శనాత్ ౹౹199౹౹

199. శ్రుతిని అనుసరించి ఈ సృష్టిక్రమముగ జరిగినదనీ, హఠాత్తుగ , ఒక్కసారిగ జరిగినదనీ తెలియవలెను.
ఈ రెండు విధములుగను శ్రుతి వాక్యములు ఉన్నవి.
అనుభవమున కూడా స్వప్నములు సుషుప్తి నుండి క్రమముగను హఠాత్తుగను కూడా కలుగును.

తైత్తిరీయ ఉప.2.1.1, 2.6.1;
బృహదారణ్యక ఉప. 1.2.5.
వ్యాఖ్య:-  సర్వత్మ స్వరూపుడైన నారాయణుడు అనేక రూపాల్లో ఉంటాడు అనే సిద్ధాంతం శ్రుతి సమ్మతమైనదే.

సర్వాత్మ భావం ఈశావాస్యోపనిషత్తు నందు,
పరమేశ్వరుడు విశ్వరూపి స్వేచ్ఛగా సర్వప్రాణులలోను సంచరిస్తూ వుంటాడని
 -శాం.ప 353.5 నందు వర్ణింపబడినది.

శ్రుత్యాధారిత జ్ఞానసాధన సమ్యక్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనే విషయం నిర్వివాదాంశం.

శ్రుతిని అనుసరించి ఈ సృష్టిక్రమము జరిగినదనీ, హఠాత్తుగ - ఒక్కసారిగ జరిగినదనీ రెండు విధములుగను శ్రుతి వాక్యములు ఉన్నవి.

అనుభవమున కూడా స్వప్నములు సుషుప్తి నుండి క్రమముగను హఠాత్తుగను కూడా కలుగునని తైత్తిరీయ ఉప.2.1.1, 2.6.1
బృహదారణ్యక ఉప.1.2.5  
ఉపనిషత్ వాఖ్యలు.

సుషుప్తి అవస్థ స్వప్నావస్థగా మారినట్లే ఆనందమయుడగు ఈశ్వరుడు ఒకడైన తాను అనేకులు కావలెనని సంకల్పించినపుడు హిరణ్యగర్భుడగును.

దాని వలన సకల సూక్ష్మశరీరముతో సంబంధపడును.ఆ విధముగా అఖండ బ్రహ్మము తన అవిభక్త స్థితిలో సమస్తమునందు వ్యాపించును గనుక సమస్తము అవిభక్త స్థితిలో నున్నది.

అది తనంతటతాను ఘనీభవించినప్పుడు విశ్వమనస్సు  ఉదయించును.
విభిన్న భూతములు అత్యంతసూక్ష్మదశలో ఉన్నవను ఉద్దేశము ఆ మనస్సులో ఆవిర్భవించును.

వీని అన్నిటి సమిష్టియే తైజస విరాట్పురుషుడు.ఆయనను సృష్టికర్తయగు బ్రహ్మ అందురు. కావున,ఈ సృష్టికర్త విశ్వవ్యాప్త మనస్సుకంటె వేరేదియుగాడు.

విశ్వములో విభేదమును కల్పించు తత్త్వమగు ఈ అవిద్యలో ఉండవలెనని కోరుకొన్నవాడు ఈయననే.దీని వలన వ్యక్తి ఆత్మను అనాత్మగా భ్రమించును.

మరియు ఈ అవిద్యా ప్రభావమువలననే స్రష్ట ఈ విశ్వమును విభిన్న ప్రాణులతో గూడినదిగా అగుపించునట్లు చేసాడు.దీని వలననే సమస్తవిశ్వము అనంత చైతన్యము తప్ప వేరేదియు కాకపోయినను - అణులేశములవలనను పరమాణువుల వలనను జనించిన ప్రాణులుగానున్నట్లు అగుపించుచున్నవి.
అన్ని ప్రాణులు తన ఆత్మకంటే భిన్నములు కావనీ,తన ఆత్మయే అన్ని జీవులలో నున్న ఆత్మ యనీ దర్శించే జ్ఞాని ఆ దర్శన వివేకము చేత దేనినీ ద్వేషింపక దేవతాస్వరూప భావము నొందును.

సూత్రాత్మా సూక్ష్మదేహాఖ్యః సర్వజీవఘనాత్మకః ౹
సర్వహంమానధారిత్వా త్ర్కియాజ్ఞానాది శక్తిమాన్ ౹౹ 200 ౹౹

200. సూత్రాత్మ,సూక్ష్మశరీరి అనబడు హిరణ్యగర్భుడు సకల జీవుల సూక్ష్మశరీరముల సమిష్టి వస్త్రమునందు అంతటా అనుస్యుతమై ఉన్న తంతువు వలె అన్ని జీవులయందు ఉన్న 
"అహం" భావన అతడే.కనుకనే అతనికి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు గలవని చెప్పబడుచున్నదవి.
వ్యాఖ్య:- హిరణ్యగర్భ స్వరూపం ఏమిటి?  అంటే సమిష్టి లింగశరీరాభిమానియైనట్టి,
మాయను ఉపాధిగా కలిగినట్టి ఈశ్వరునే హిరణ్యగర్భుడంటారు.

తార్కికులు ఈశ్వరునియందు మూడు గుణాలు
జ్ఞానం,ప్రయత్నం,ఇచ్ఛ అనేవి సత్యమైనవని అంటారు. ఎందుచేతనంటే, కేవలం అసంగుడైనవానికి నియంతృత్వం వుండదు కాబట్టి!

జీవుడు కూడా సంగరహితుడే అయినందునను,చిద్రూపుడే అయినందునను క్లేశకర్మాదులు ఉండరాదు,ఉండవు.అయితే జీవుడు వివేకంతో ప్రకృతి పురుషుల భేదాన్ని తెలుసుకోలేక పోతున్నందువల్ల క్లేశ కర్మవిపాకాదులు సంభవిస్తున్నాయి

కాని నైయాయికులు,
అసంగుడు చిద్రూపుడు అయినవానిని నియంతగా అంగీకరించరు. అందుచేత జీవేశ్వర భేదాన్ని చూపటానికై 
జ్ఞానం ప్రయత్నం ఇచ్ఛ అనే మూడు గుణాలు ఈశ్వరునియందు నిత్యమైనవి అటువంటి ఈశ్వరుని అంగీకరిస్తారు అని చెపుతున్నారు.

అసంగుడు,చిద్రూపుడు అయిన ఈశ్వరుడు నియామకుడు ఎట్లా అవుతాడు?అని ఆక్షేపం.

ఈశ్వరుడు అసంగుడైనందున నియామకుడు కాజాలకపోయినప్పటికీ జీవులకంటే విలక్షణ స్వభావం కలవాడైనందున ఈశ్వరునికి నియమన 
కర్తృత్వం-నియమించే పని-ఉండవచ్చు.

చిద్రూపుడైన ఈశ్వరుని ప్రకృతి నియామకునిగాను,జీవుడిని నియమింపబడేవానిగానూ అంగీకరించకపోతే ఈ జీవజగత్తులో బంధమోక్ష వ్యవహారమంతా అస్తవ్యస్తమైపోతుంది.

అంటే ,ప్రకృతి అనేది ముక్తులైైనవారిని సైతం బంధిస్తుంది.కాబట్టి ఈశ్వరుని ప్రకృతి నియంత అని అంగీకరించాలి.
సకల జీవుల యందూ వస్త్రమునందు ఉన్న తంతువు వలె అన్ని జీవులయందు ఉన్న"అహం"అతడే.
కనుకనే అతనికి 
ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు గలవని చెప్పబడుచున్నవి.

No comments:

Post a Comment