అబద్దాల మధ్య
ఆరితేరిన మనకు
నిజాలు రుచించవు
నాలుగు గోడల మధ్య బందీ అయిన మనకు
స్వేచ్ఛ కు బొత్తిగా అర్ధం తెలియదు
కాంక్రీట్ జంగల్ లో
తప్పిపోయిన నిన్ను
ప్రకృతి పచ్చదనము గుర్తుపట్టలేవు
నీ రూపు రేఖలను నయా అవతారాన్ని
విధ్వంసక వికృత చేష్టలకు మనుషులు హర్షిస్తారు
మట్టి కాదు
ఇంటి దగ్గర మొదలై
ఆఫీస్ గెట్ ముందర ఆగి పోయిన
దారి
ఉరుకులు పరుగులే తప్పా
నిన్ను ఊపిరి తీసుకొనివ్వదు
సంపాదించడం కోసమే బతుకుతున్నావా
బతకడం కోసమే సంపాదిస్తున్నావా
అర్థం కాని అర్థం లేని ఆరాటంలో
పోరాటం శూన్యం
అంచలంచలుగా నీ ఆశలకు ఆనందాలకు
తూట్లు పడుతుంటే
రెండు కన్నీటి బొట్లతో వాటిని పరామర్శించడమే తప్పా
నిష్ప్రయోజనమైన చేతులతో
నిండు నూరేళ్లు బతకాలనే బలమైన వాంఛ తప్పా
మరొకటి లేని గుడ్డితనం
ఏ ఆలోచన మొలకెత్తని
మెదడులో గుడ్డితనం
ఏ ప్రశ్న చిగురించని
గుండెల్లో గుడ్డితనం
నిస్సారంగా బతుకుతూ
బతకాలనిపించినప్పుడల్లా గతాన్ని వెతుకుతూ
కోల్పోయింది ఏదీ
కోటి సార్లు దుఃఖించినా రాదు
మనం కాపాడుకోవాల్సింది ఆస్తులను ఆరోగ్యాన్నే కాదు
ఆలోచనలను ఆనందాన్ని కూడా..!!
No comments:
Post a Comment