ॐ:
*కృష్ణమాయ*
కృష్ణస్తు భగవాన్ స్వయమ్’... కృష్ణుడే పరమతత్త్వం... చరమ లక్ష్యం... ఆయన గురించి చదవడం, చెప్పడం, పాడడం, వినడం... అన్నీ అపురూపమైన అనుభవాలే. ‘నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏం ఉంటాయి?’ అని అక్రూరుడన్నా... ‘అటువైపు కృష్ణుడున్నాడు... ఇటువైపు ఎవరున్నారు’ అని సంజయుడు హెచ్చరించినా... అవన్నీ పరమాత్మ విరాట్‌రూపాన్ని విశదీకరించే ఉదాహరణలే... క్రియ, బోధ కలగలిసిన అద్భుత తత్త్వం ఆయనది... యుగావసరాలకు అన్వయించుకోదగ్గ మహాగాథ శ్రీకృష్ణుడిది.
భక్తుల కోర్కెలు తీర్చే క్రమంలో భగవంతుడు రెండు రకాల విధానాలను అనుసరిస్తాడు. సర్వం తానే స్వయంగా నిర్వహించి, తనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడం మొదటి పద్ధతి. మన ప్రయత్నంలో రహస్యంగా సహకరించి, మనపై మనకు నమ్మకాన్ని పెంచి విజేతలుగా తీర్చిదిద్దడం రెండో పద్ధతి. ఇందులో మొదటి దాన్ని దైవికం అని, రెండోదాన్ని పౌరుషం అని శాస్త్రం నిర్వచించింది. పరమాత్మ ప్రతి అవతారంలో ఏదో ఒకమార్గాన్నే ఎంచుకున్నాడు. కానీ కృష్ణావతారంలో మాత్రం రెండు విధాలుగానూ మనకు ఆయన దర్శనమిస్తాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణల్లో భాగవతంలోని కృష్ణుడు ఎవరి సహాయాన్నీ కోరలేదు. స్వయంగా తానే అవతార లక్ష్యం దిశగా సాగిపోయాడు. భారతంలోని కృష్ణుడు మాత్రం రెండో పద్ధతి అనుసరించాడు. చేసిందంతా తానే అయినా ఘనతను మాత్రం పూర్తిగా పాండవుల పరం చేశాడు. వారిని విజేతలుగా నిలబెట్టాడు. భాగవత కృష్ణుడు విశేష రసజ్ఞ మనోజ్ఞ మూర్తి. భారత కృష్ణుడు అసాధారణ అలౌకిక ప్రజ్ఞానిధి. కృష్ణ కథలో ఈ రెండూ విభిన్న కోణాలు. ఈ రెండు రకాల పాత్రల స్వభావాలు విభిన్నమైనవి, అదే సయమంలో సర్వసమగ్రమైనవి.
అదే కృష్ణమాయ!
భాగవత కృష్ణుడి బాల్యచేష్టలు ముగ్ధమోహనాలు. అదే సమయంలో లోకకల్యాణాలు. పసిబాలుడు భయంకర రాక్షస మూకలను మట్టుబెట్టినప్పుడు జనం నివ్వెరపోవడం సహజం. అవతార పురుషుడిగా అనుమానించడం సాధారణం. అలాంటి వారిని చిలిపి చేష్టల ముసుగులో ముంచేసేవాడు. ఇది లోకం దృష్టికి సమ్మోహనకరంగా, అదే సమయంలో లోచూపునకు సంక్లిష్టభరితంగా కనిపించేది. గోపబాలురకు చెలికాడిగా, గోపికలకు వెన్నెల వేలుపుగా ఆటపాటలతో అలరించిన అపూర్వ ఘట్టాలను అనుశీలించేటప్పుడు మనం కూడా వారిలా మారిపోవడాన్నే కృష్ణమాయ అంటారు. రమణీయ రసానుభూతులు పంచడంతో పాటు రాక్షస సంహారం కూడా ఆయన చేశాడు. ఒక పురాణ పురుషుడి సర్వసమగ్ర వ్యక్తిత్వానికి ఇది గొప్ప ఉదాహరణ.
సుస్థిర పాలన కోసం...
భారత కృష్ణుడు ధీరోదాత్తుడు, రాజనీతిజ్ఞుడు, వ్యూహనిర్మాణ చతురుడు, స్ఫూర్తిప్రదాత, మహానేత. ఆయన అవతరించే సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కంస, జరాసంధ, కాలయవన, నరక, శిశుపాల, దుర్యోధనాది స్వార్థ పరుల చేతుల్లో అధికారం, సంపద ఖైదీలయ్యాయి. ఇవన్నీ దుష్టుల చేతుల్లో ఉన్నప్పుడు సామాజిక పరిస్థితులు కూడా దయనీయంగా ఉంటాయి. ధర్మంలేని చోట భద్రత, నీతిలేని చోట మనశ్శాంతి ఉండవు. అలాంటి రాజుల చేతుల్లోనుంచి ప్రజలను రక్షించాలి. సువ్యవస్థను స్థాపించాలి. రాజ్యం చిన్నచిన్న ముక్కలుగా చీలిపోయి ఉంది. అరాచకం, అనైక్యత పెరిగిపోయాయి. ఆ దుస్థితిని, క్లిష్టతను పారదోలేందుకు కేంద్ర రాజ్య వ్యవస్థను ఊహించిన, నిర్దేశించిన అద్భుత రాజనీతిజ్ఞుడు శ్రీ కృష్ణుడు.ధర్మం తప్పిన రాజులందరినీ స్వయంగానో, పాండవుల చేతనో తుదముట్టించాడు. తాను రాజ్యాధికారం కోరుకోకుండా ధార్మిక చింతనాశీలురను పాలకులుగా ఎంచి, రూపొందించి సుపరిపాలనా కేంద్ర వ్యవస్థను నిర్మించాడు. ధర్మజుని నాయకునిగా తీర్చిదిద్దిన నాయక నిర్ణేత శ్రీకృష్ణుడు.
యుద్ధం కూడా యజ్ఞమే!
భగవద్గీత ఆవిర్భావం కూడా ఈ యుగావసరమే. అడవిలో ముక్కు మూసుకుని కూర్చున్న సర్వసంగపరిత్యాగి తన శిష్యులకు ఏకాంతంగా నూరిపోసిన ధర్మోపదేశం కాదిది.. పద్దెనిమిది అక్షౌహిణల మహాసైన్యం యుద్ధరంగంలో మోహరించి, కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్కంఠ స్థితి. తాత్కాలిక నిర్వేదానికి గురై ధర్మసంకటంలో పడిన మహాయోధుణ్ణి కార్మోన్ముఖుణ్ణి చేసేందుకు ప్రవచించిన ఉపదేశం. ఈ లోకానికంతటికీ వర్తించే ధీరవచనం. గీతాచార్యుడిగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం శిఖరసమానమైంది. ఆయుధాన్ని పట్టనని ప్రకటించిన శ్రీకృష్ణుడు, భీమార్జునులను ఆయుధాలుగా మలుచుకుని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని సాగించాడు. యుద్ధాన్ని క్రతువు అన్నాడు పరమాత్మ. క్రతువు అంటే యజ్ఞం. ‘న మమ’ అనుకోవడం యజ్ఞంలో ప్రధానాంశం. ‘నాది కాదు’ అని ఆ మాటకు అర్థం. ఏం చేసినా, ఏం పొందినా ‘న మమ’ అనే భావనతో ఉండడం యోగి లక్షణం. అహంకార, మమకారాలను ఆహుతి చేసే మహోన్నత పరిణిత త్యాగశీలతనే కృష్ణుడు కర్మయోగం పేరిట అర్జునుడికి బోధించాడు. అది ఎప్పటికీ, సర్వమానవాళికీ అనుసరణీయం.
స్నేహితుడి కోసం గీతాసారం
కృష్ణా! ఓ మాట అడుగుతాను. నిజం చెబుతావా...? మనం ఆపదలో ఉన్నప్పుడు అడగకపోయినా వచ్చి మనకు సాయం చేసేవాడే స్నేహితుడని నువ్వే చెప్పావు కదా. మరి పాండవులు అన్ని కష్టాల్లో కూరుకుపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెబితే ధర్మరాజు జూదం ఆడేవాడు కాదు కదా? లేదా నువ్వే ధర్మరాజు పక్షాన ఆడి అతడిని గెలిపించవచ్చుకదా.
మరి నువ్వెందుకు అలా చూస్తుండిపోయావు? అంటూ నేరుగా కృష్ణుడినే అడిగాడు ఉద్ధవుడు. మరొకరైతే కృష్ణుడిని ఈ ప్రశ్న అడగటానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. కానీ, ఇక్కడ అడిగినవాడు ఉద్ధవుడు. కృష్ణుడికి పరమ ప్రాణమిత్రుడు. రూపంలో కూడా అచ్చం కృష్ణుడిలాగా ఉండేవాడు.ఎంతటి ప్రాణమిత్రుడంటే నిద్రలో కూడా కృష్ణుడి పేరునే కలవరించేవాడు. అంతటి మిత్రుడు అడిగేసరికి శ్రీకృష్ణుడు కూడా మొహమాటం లేకుండా సమాధానం చెప్పాడు. ఉద్ధవా! విజయం ఎప్పుడూ వివేకవంతుడినే వరిస్తుంది. దుర్యోధనుడు వివేకవంతుడు. అందుకు ఆటలో నైపుణ్యం ఉన్న శకునితో తన ఆట ఆడించాడు. ధర్మరాజు మాత్రం తానే ఆట ఆడాలని అనుకున్నాడు. పైగా నేను అటువైపు రాకూడదని కోరుకున్నాడు. అందుకే అతడు పిలిచేవరకు రాకూడదని నిశ్చయించుకున్నా. పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్లేవాడిని అన్నాడు. అంటే కృష్ణా! తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే గానీ రావా అంటూ మరోప్రశ్న వేశాడు ఉద్ధవుడు. మిత్రమా! జీవితంలో ప్రతిదీ కర్మానుసారమే జరుగుతుంది. నేను పక్కన ఉండి చూస్తుంటాను కానీ కర్మను మార్చలేను అన్నాడు కృష్ణుడు. అదేంటి కృష్ణా! నీ భక్తుల పక్కనే ఉంటూ వారు ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అన్యాయం కదూ అన్నాడు ఉద్ధవుడు. కృష్ణుడు నవ్వుతూ... మిత్రమా! నేను పక్కన ఉన్నాననే భావన ఉంటే అసలు తప్పే చెయ్యరు కదా భక్తులు అన్నాడు. తత్త్వం బోధపడింది ఉద్ధవుడికి. ఇంకా ఎన్నో సందేహాలు అడిగాడు. అన్నిటికీ తృప్తిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ. అవతార పరిసమాప్తి కాలంలో ఉద్ధవుడి పేరు మీద లోకం తన మీద వేసే నిందలు, వేసే ప్రశ్నలన్నింటికీ పరమాత్మ సమాధానం చెప్పాడు. ఈ సమాధానాల సమాహారమే ‘ఉద్ధవగీత’గా ప్రసిద్ధిపొందింది.
ఆ అయిదు భావాలు...
శ్రీకృష్ణుడు లీలామానుష రూపుడు. మానవుడిగా, దైవంగా మార్చిమార్చి తన వైభవాన్ని ప్రదర్శించాడు. శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య, మధుర భావాలను భక్తులు భగవంతుడిని చేరుకునే సులభ మార్గాలుగా భావించాలి. వాటిని స్వయంగా శ్రీకృష్ణుడి జీవితంలో కూడా మనం చూడొచ్చు.
శాంతం:
ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా నందనందనుడు శాంతంగా వ్యవహరించాడు. శిశుపాలుడు నిండు సభలో అవమానపరిచి అనరాని మాటలు అంటున్నా ప్రతిఘటించలేదు. ఉద్రేకపడలేదు. భీష్మాదులు శిశుపాలుడిని హెచ్చరిస్తున్నా తాను మాత్రం పౌరుషానికి పోలేదు. ఇచ్చిన మాట ప్రకారం నూరు తప్పులను శాంతంగానే కాచాడు.
దాస్యం:
పెద్దల వద్ద వినయ విధేయతలతో ఉండడమే దాస్యభావం. దేవాదిదేవుడైనా అగ్రజుల వద్ద అణకువగానే మెలిగాడు. గురువు సాందీపుని వద్ద బంటులా పనిచేశాడు. రేపల్లెలో గోవుల కాపరిగా ఆ మూగజీవాలనూ సేవించాడు. అందుకే దాస్యంలో ఆయనను మించిన దివ్యాంశుడు లేరంటారు.
వాత్సల్యం:
చిన్న వాళ్లతో ప్రేమగా, ఆదరంగా ఉండడం వాత్సల్యం. ధీరగంభీరుడైన దేవకీపుత్రుడు వాత్యల్యానికి కూడా మారుపేరు. తనను ఆశ్రయించిన వారిని ఆదుకోవడంలో ఆయనను మించిన కరుణామూర్తి మరొకరు కానరారు. ద్రౌపది ‘అన్నా! నీవే దిక్కు’ అన్నందుకు నిండు సభలో ఆమె గౌరవాన్ని కాపాడాడు. సుయోధనుడు రాజభోగాలను సిద్ధంచేసినా, విదురుని ప్రేమపూర్వక ఆహ్వానాన్నే మన్నించాడు.
సఖ్యం:
సన్నిహితులతో, స్నేహితులతో ప్రేమగా ఉండడం సఖ్యం. సఖ్యభావంతో సన్నిహితుల హృదయాల్లో నిలిచిపోయాడు ఈ హృషీకేశుడు. చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు నిరుపేదైనా, సతీసమేతంగా అతని పాదాలు కడిగి ఆ జలాన్ని తన తలపై చల్లుకున్నాడు. ఆయన తెచ్చిన అటుకులనే మధురపదార్థాలుగా స్వీకరించాడు. ఇక అర్జునుడికి ఇష్టసఖుడిగా తుదివరకు వెన్నంటి కాపాడాడు.
మధురభావం:
తనను ఆరాధించే వాళ్లతో అంతే ఆరాధనతో ఏకమైపోవడం మధురభావం. గోపికలను మధురభావంతో ముంచెత్తి వాళ్లను అనేక లీలల్లో ఓలలాడించాడు. వారికి అలౌకికమైన ఆనందాన్ని అందిస్తూనే అంతిమంగా వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. మధురభావం పరమాత్మ ఏ ఇతర అవతారంలోనూ కనిపించదు.
No comments:
Post a Comment