🌹. శ్రీ దత్తాత్రేయుని 24 గురువులు 🌹
నిర్జర విరచితం
దత్తాత్రేయుని సాక్షాత్తూ ఆ త్రిమూర్తుల అవతారంగా భావిస్తుంటాము. కోరి చెంతకు చేరిన మూఢుని సైతం బ్రహ్మజ్ఞానిగా మార్చగల ఆ దత్తాత్రేయునికి గురువు ఎవరై ఉంటారు అని ప్రశ్నస్తే... తాను ప్రకృతిలో గమనించిన 24 గురువుల నుంచి జ్ఞానాన్ని సంపాదించానని పేర్కొంటారు.
ఆధ్మాత్మిక తత్వాన్ని గ్రహించాలనుకునే జ్ఞానసాధకులకైనా, భక్తి యోగాన్ని అనుసరించే జీవులకైనా, సంసారంలోనే ఉంటూనే కర్మయోగంతో మోక్షాన్ని సాధించాలనుకునే ముముక్షువలకైనా... ఇహపర తృప్తిని అందించగల దైవం దత్తాత్రేయుడు. ఎటువంటి గురుబోధా లేకుండానే ప్రకృతిని పరిశీలించడంతోనే ఆయన సిద్ధగురువుగా అవతరించారంటారు.
ఆ 24 గురువులనీ ఒక్కసారి స్మరిస్తే... వాటి నుంచి మనకి కూడా ఎంతో కొంత స్థిరచిత్తత అలవడుతుందని ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.
మరి ఆ గురువులలో ఎవరి నుంచి ఏం నేర్చుకున్నారంటే...
🌻 1. భూమి-
క్షణమైనా తన బాధ్యతని విస్మరించని నిబద్ధత. పరులు కీడు తలపెట్టినా తిరిగి ఆహారాన్ని అందించగల క్షమ. ఎంతటి బాధనైనా ఓర్చుకోగల సహనం.
🌻 2. గాలి -
తనలో ఎన్ని భావాలు మెదులుతున్నా వేటినీ అంటిపెట్టుకుని ఉండకుండా, తన నిజస్వరూపంలోనే నిలిచి ఉండటం. ప్రాపంచిక వస్తు వాసనలకు అతీతంగా మనసుని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నిలుపుకోవడం.
🌻 3. ఆకాశం-
తనలోని ఆత్మకు ఎలాంటి ఎల్లలూ లేవన్న సత్యాన్ని గ్రహించడం. అనంతంగా వ్యాపించి ఉన్నా, ఏ వస్తువునీ సొంతం చేసుకోకపోవడం. అనంతమైన భగవత్ తత్వాన్ని గ్రహించడం.
🌻 4. నీరు-
తన చెంతకు ఎలాంటి వారు వచ్చినా కూడా పక్షపాతం లేకుండా ఆదరించడం. స్వచ్ఛత అనే సహజగుణాన్ని కాపాడుకోవడం.
🌻 5. నిప్పు-
జ్ఞానం అనే అగ్నిలో ఈ లోకంలోని అజ్ఞానాన్నీ, పాపకర్మలనీ దహించివేయడం. తన చుట్టూ ఉన్న లోకాన్ని ఆ జ్ఞానాగ్నితోనే పరిశీలంచడం.
🌻 6. చంద్రుడు-
చంద్రుని మీద పడే నీడలోని మార్పుల కారణంగా అది పెరుగుతున్నట్లుగానో, తరుగుతున్నట్లుగానో కనిపిస్తుంది. కానీ చంద్రుని నిజరూపంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. జనన మరణాలకు అతీతంగా ఆత్మ కూడా అంతే నిశ్చలంగా ఉంటుంది.
🌻 7. సూర్యుడు-
సూర్యుని ప్రతిబింబం ప్రతి నీటిమడుగులోనూ కనిపిస్తుంది. కానీ సూర్యుడు మాత్రం ఒక్కడే! ఆత్మ కూడా వేర్వేరు శరీరాలలో జీవిస్తున్నట్లు తోచినా.... దాని మూలం ఒక్కటే!
🌻 8. పావురాళ్లు-
ఒక పావురం వలలో చిక్కుకుంటే, దాని తోటి పావురం కూడా అదే వలలోకి వెళ్లి చిక్కుకునేందుకు ఇష్టపడుతుంది. ప్రాపంచిక బంధాలు ఎంత మోహపూరితంగా ఉంటాయో ఈ పావురాళ్ల తీరు తెలియచేస్తుంది.
🌻 9. కొండచిలువ-
తన దగ్గరకి వచ్చినదేదో తిని, దానినే అరాయించుకుంటూ తృప్తిగా ఓ చోట పడి ఉంటుంది కొండచిలువ. అంతేకానీ ఆహారం కోసం అటూఇటూ పరుగులు తీయదు.
🌻 10. తుమ్మెద-
తేనె ఎక్కడ ఉంటే అక్కడికి తుమ్మెద చేరుకుంటుంది. ఒక పూవుని గ్రోలినంత మాత్రాన అది తృప్తి పడిపోదు. మనిషి కూడా అంతే! జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటూ ఉండాలి.
🌻 11. తేనెటీగ-
తేనెటీగలు నానాకష్టాలూ పడి తేనెని సేకరిస్తాయి. కానీ వాటిని ఏ ఎలుగుబంటో, వేటగాడో హరించుకుపోతాడు. అవసరానికి మించి దాచుకునే ధనం పరుల పరం కాక తప్పదు. ప్రాపంచిక సంపదని ప్రోదిచేసుకుంటే దుఃఖమే మిగులుతుంది.
🌻 12. ఏనుగు-
ఆడ ఎనుగుని చూసినంతనే ఏనుగు వెనకాముందూ ఆలోచించకుండా వెళ్లి ఉచ్చులో కూరుకుపోతుంది. మోహం, కామం ఎంతటివాడినైనా బలహీనుడిగా మార్చివేస్తాయి.
🌻 13. జింక-
వేటగాళ్లు డప్పులను మోగిస్తూ చప్పుడు చేయగానే జింక భయంతో అటూ ఇటూ పరుగుదీస్తూ చివరికి ఉచ్చులో చిక్కుకుపోతుంది. భయం అనే లోపంతో అది తన స్వేచ్ఛను వదులుకుంటుంది.
🌻 14. చేప-
ఎర కనిపించగానే ముందూ వెనుకా ఆలోచించకుండా దానికి చిక్కుకుపోతుంది. ఆశకి కనుక విచక్షణ తోడవకుంటే మానవుడి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.
🌻 15. గద్ద-
ఆబగా ఆహారాన్ని నోట కరుచుకుంటుంది. కానీ దాని చుట్టూ ఉన్న పక్షులన్నీ వెంటపడటంతో చివరికి ఆ ఆహారాన్ని వదిలేసి పారిపోతుంది. అవసరానికి మించి సేకరించే సంపదలను కూడా ఇలాగే ఆపదలు వెన్నాడతాయి.
🌻 16. సాలీడు-
భగవంతుడు తననుంచే సాలెగూడులాంటి విశ్వాన్ని సృష్టించి తిరిగి తనలోకే లీనం చేసుకుంటాడు. కానీ జీవి అలా కాదు, తాను సృష్టించుకున్న ఊహా ప్రపంచంలోనే తానే చిక్కుకుని విలవిల్లాడిపోతాడు.
🌻 17. సముద్రం-
సముద్రంలోకి ఎంత నీరు చేరినా కూడా గుంభనంగానే ఉంటుంది. ఇంద్రియాల ద్వారా అనేక విషయ వాసనలకు లోనయ్యే మనిషి కూడా అంతే నిశ్చలంగా ఉండగలగాలి.
🌻 18. వేశ్య-
సంపదల కోసం ప్రతి ఒక్కరూ తమ శరీరాన్నో, విశ్వాసాలనో, వ్యక్తిత్వాన్నో తాకట్టుపెడుతూనే ఉంటారు. కానీ చివరికి తాము చేసిన పనికి ప్రాయశ్చిత్తంతో... మనశ్శాంతికై పరుగులు తీస్తారు. తన జీవిత పరమార్ధం ఎక్కడుంతో అన్న వెతుకులాటను మొదలుపెడతారు.
🌻 19. కన్య-
ఒక పేద యువతి తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం వంట ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. కానీ అందుకోసం అప్పటికప్పుడు పిండిని ఆడించి, రొట్టెలు చేయాల్సిన పరిస్థితి ఆమెది. తన దుస్థితి అతిథులకు తెలియకుండా ఉండటానికి
ఆ యువత తన చేతికి ఉన్న గాజులను పగలకొట్టింది. ఒకే ఒక్క గాజుతో ఎలాంటి శబ్దమూ రాకుండా పనిని కొనసాగించింది. యోగి అనేవాడు చప్పుడు చేయకుండా అన పనిని చేసుకుపోతుండాలి.
🌻 20. లోహకారుడు-
ఓ లోహకారుడు తన పనిలో ఎంత నిమగ్నమైపోయి ఉన్నాడంటే... అతని ఇంటి ముందర నుంచే వెళ్తున్న రాజుగారి ఊరేగింపుని కూడా అతను గమనించుకోలేదు. అలాంటి తదేక ధ్యానంతో ఆత్మసాక్షాత్కారాన్ని సైతం సాధించగలం.
🌻 21. పసివాడు-
ప్రతిక్షణాన్నీ సంపూర్ణంగా స్వీకరించి, ఆస్వాదించగల నిర్వలత్వం.
🌻 22. శలభము-
మంటని చూసీ చూడగానే మరో ఆలోచన లేకుండా దానివైపు ఆకర్షింపబడతాయి శలభాలు. చివరికి అదే మంటలో మాడిపోతాయి. అందుకనే ఇంద్రియాలు గ్రహించే విషయాన్ని యధాతథంగా తీసుకుండా... వానికి ప్రశ్నించి, విశ్లేషించే విచక్షణ కలిగి ఉండాలి.
🌻 23. కందిరీగ-
ఒక చిన్న పురుగుగా గూడులోకి చేరుకుని... చివరికి కందిరీగలా మారి వెలుపలికి వస్తుంది. పరమాత్మ మీద మనసుని లగ్నం చేసి నిరంతరం అదే ధ్యాసలో నిలిచే భక్తుడు సైతం తను ఆరంభించిన స్థాయికి మించిన స్థితిని చేరుకోవడాన్ని గమనిస్తాడు.
🌻 24. సర్పం-
పాము తన కుబుసాన్ని విడిచి ఎలాగైతే కొత్త చర్మాన్ని ధరిస్తుందో... మనలో అనవసరం అనుకున్న భావనలు, అహేతుకమైన విశ్వాసాలను వదిలించుకునే ధైర్యం కలిగి ఉండాలి. అప్పుడే కొత్త జీవితం సాధ్యమవుతుంది.
దత్తాత్రేయ స్వామి వారి విశేష అనుగ్రహముచే మనకు ఈ లక్షణాలు సంప్రాప్తించు గాక!
🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment