☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
45. మహాఁస్త్వేవ గోర్మహిమా
గో మహిమ మహోన్నతమైనది (శతపథ బ్రాహ్మణం)
గోమహిమ అపారం. స్థూలదృష్టికీ, పరిమితమైన జ్ఞానానికి అది గోచరించదు.
కలియుగ పురుషునికి ప్రజానాశనం, ప్రజాదుఃఖం, దౌర్భాగ్యం ఇష్టమైన విషయాలు. అవి కలిగించడమే అతడి పని. అందుకే ప్రజాక్షేమంకరమైన విషయాలు జరగనీయడు.
క్షేమంకరమైన విషయాలు చెప్పినా, వాటిపై ఆసక్తినీ, శ్రద్ధనీ కలగనీయడు. సరికదా,తూలనాడేలా చేస్తాడు. శ్రేయస్సును కలిగించే వాటిని నశింపజేసే బుద్ధి పుట్టిస్తాడు.
అందుకే ఇప్పుడు గోవధ జరుగుతున్నా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. గోసేవ చేయాలని
అనుకోవడం లేదు. శాస్త్రాలు చెబుతున్న సత్యాలను చాదస్తాలని కొట్టిపారేస్తున్నాం.
గోవు శరీరంలో ప్రత్యణువులో దేవతాశక్తులున్నాయని అతీంద్రియ దర్శనశక్తి కలిగిన మహర్షులు దర్శించి చెప్పారు. మనకూ సూక్ష్మదర్శన శక్తి ఉంటే మనమూ గ్రహించవచ్చు. ఇతర జంతువులకు లేని లక్షణం - గోవుకు మాత్రమే ఉండే లక్షణం...చివరికి వాటి మలినాలైన మూత్రం, మలాలకు కూడా ఔషధ గుణాలు ఉండడం.
గోవు నుండి ప్రసరించే శక్తి తరంగాలు మహాశక్తిమంతమైనవి. వాటి 'ఆరా' (కాంతి ఆవరణ) చాలా దూరం విస్తరించి ఉంటుంది. అందుకే గోశాల దేవాలయమంతటి పవిత్రమైనది.
గోవు సమీపంలో ఉండి దేవతాస్తోత్రాలు, పారాయణలు, జపాలు చేస్తే అత్యధిక ఫలం లభిస్తుంది.
గోశాలను శుభ్రపరిచి, గోవును పూజించి శాలలో ఒకవైపు చిరుదీపాన్ని వెలిగించితే అన్ని దుష్టశక్తులూ అంతరిస్తాయి. ఐశ్వర్యమూ, మంగళములూ లభిస్తాయి.పిశాచశక్తులకు గోవులంటే గిట్టదు. పైశాచిక శక్తులు ఆక్రమించిన బుద్ధులు తమ విజృంభణకోసం, దేశారిష్టం కోసం గోవును నశింపజేయడానికే ప్రయత్నిస్తాయని
పురాణాల హృదయం.
ఇంట్లో చేసే జపం కన్నా గోశాలలో చేసే జపానికి అధికరెట్ల ఫలం.
గోవు పేడతో కల్లాపి జల్లినా ఇంట్లోకి విషశక్తులు ప్రవేశించలేవు.
సర్వదేవతామయమైన గోవును సేవిస్తే దేవతలందరూ సంతోషిస్తారు.
గ్రహదోషాలు పోవాలంటే గోవును సేవించుకోవడం అన్నిటికంటే
అత్యుత్తమమైన మార్గం.
మనకి ఒకొక్కగ్రహానికి ఒకొక్క ధాన్యం చెప్పబడింది. అలా నవధాన్యాలనూ
చెప్పారు. ఆయారోజుల్లో ఆయా ధాన్యాలను, బెల్లమూ, ఆకుకూరలూ, పళ్ళూ మొదలైన వాటితో కలిపి గోవుకు పెడితే ఆయా గ్రహాల బాధలు తొలగుతాయి.
పితృతిథులలో, శ్రాద్ధాదులలో సక్రమంగా విధివిధానంగా చేసే అవకాశం లేనివారు ఆకుకూరలు, పళ్ళు ఆవుకి సమర్పిస్తూ, పితృదేవతలను స్మరిస్తే చాలు -
పితరులు ఉత్తమ లోకాలను పొందుతారు. పితృఋణం తీర్చుకున్న పుణ్యం లభిస్తుంది.
సక్రమంగా శ్రాద్ధాదులు చేసినా సరే, ఈ విధంగా ఆవుకు 'గోగ్రాసం' సమర్పణ
చేస్తే చక్కగా సత్ఫలితాలు దక్కుతాయి.
గోగ్రాసాదులను పుష్కలంగా ఏర్పాటు చేసిన వారికి గొప్ప గొప్ప యజ్ఞాలు
చేసిన ఫలం లభిస్తుంది.
యజ్ఞాలలో సర్వదేవమయునిగా అగ్నిని భావించి, దేవతలందరికీ ఇచ్చే
ఆహుతులను అగ్నిలో సమర్పిస్తాం. తద్వారా ఆయా దేవతలు తృప్తిపడతారు.
అటువంటి యజ్ఞాగ్ని వంటిదే గోవు. మన అభీష్ట దైవాన్ని స్మరిస్తూ గోవుకి
గ్రాసాన్ని అందిస్తే ఆ దేవతానుగ్రహం మనకు పుష్కలంగా లభిస్తుంది.
ఆవు నేతితో దీపం వెలిగించిన ఇంట మహాలక్ష్మి కొలువుంటుంది.
ఇవన్నీ వేదశాస్త్రాలు చెప్పిన సత్యవచనాలు. మనం గోవుని పెంచలేకపోతే, వాటిని పోషించే గోశాలలకు వెళ్ళి ఈ సేవలు చేయవచ్చు. లేదా గోపోషణ చేసే అవకాశం ఉన్నవారికి గోవును సమర్పణ చేయవచ్చు.
No comments:
Post a Comment