*🌺🕉️ జైశ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*సహనం ప్రధానం*
*జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. చాలామంది ఎన్నో ముఖ్యమైన విలువల విషయంలో ‘అది నాకు సంబంధించింది కాదు’ అని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే, ప్రతిరోజూ ఎరుకలేకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో, తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. చిత్రమేమిటంటే ఆ అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం. సహనం అంటే ఏమిటి? నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషి. అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం, పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం... పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం.*
*కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే, శిఖరాలను అధిరోహించాలంటే- సహనం తప్పనిసరి. ప్రపంచం మనుగడే సహనంతో ముడివడిఉంది. మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం... అన్నింటినీ ఈ పుడమి భరిస్తూనే ఉంది. అందుకేనేమో తమిళకవి, తత్వవేత్త తిరువళ్ళువర్ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. ఎంత ప్రతిభఉన్నా, గొప్ప కళాకారుడిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా- సహనం అవసరం. సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తాయి. గొప్పగొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టికరవడం... ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు- అసూయాద్వేషాలకు నివాసస్థలం.*
*శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ, నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞతని అంటాడు. కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ, ఇష్టాయిష్టాలను పక్కనపెడితే ఎరుకలో ఒక కొత్తస్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదనవల్ల భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది. సహనం మానసిక స్వచ్ఛతకు దారిచూపి భగవదనుగ్రహానికి చేరువ చేస్తుంది. విలువైనదేదీ త్వరితగతిన దక్కదు. లక్ష్యసాధనలో ఆటుపోట్లు తప్పవు. కష్టనష్టాలను భరించగలిగే సహనాన్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ద్వంద్వాలతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్న మనిషికి చిత్తశుద్ధి అవసరం. ఎరుకతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. నాణేనికి బొమ్మ బొరుసూ ఉంటాయి. మనిషి అన్నీ తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజం. ఒక అదృశ్యశక్తి పరిస్థితుల్ని నియంత్రిస్తూంటుంది. మనిషి సదాలోచనలు, సహనమే ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి. ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనంలేని దుర్యోధనుడే కారకుడు. అసహనంవల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు. మత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చిత్రమేమిటంటే- మతాలన్నీ సహనాన్నే బోధిస్తాయి.*
*మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴
No comments:
Post a Comment