Tuesday, December 10, 2024

 నారద భక్తి సూత్రములు 
         71 వ సూత్రము 
          "మోదంతే పితరో నృత్యంతి దేవతాః సనాధా చేయం భూర్భవతి"  
ఆ మహా భక్తుణ్ణి తిలకించిన పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు,వారిని చూచి దేవతలు ఆనందం తో నాట్యం చేస్తారు,వారితోనే అప్రకటితంగా సంచరిస్తారు.సిద్ద యోగులు వృక్షాలు,రాళ్ళూ,జంతువులుగా వారిచుట్టూ పకృతి లో   మమేకం మై  పులకిస్తారు. అనాధ అనుకున్న భూమి సనాధ అన్నట్లుగా మహా సంతృప్తిని సుఖాన్ని పొంది కాస్త విశ్రాంతి తీసుకుంటుంది.
వారి వంశ ఋషులు,పితృ దేవతలు హర్షిస్తారు,వారి వంశం పునీతం అయిందని.వారి వంశంలోని పితరులందరికీ సర్వవిధ బుణాలు వాటంతట అవే తీరిపోతాయి,ముక్తిని పొందుతారు.
దేవతలు యజ్ఞ యాగాదుల వలన తృప్తి పడతారు. ఈ మహా భక్తులు చేసే సత్కార్యాలు,ప్రవచనాలు,మంత్ర సాధన, తీర్ధయాత్ర సందర్శనమ్ తో  యజ్ఞ యాగాదులు లేకుండానే దేవతలు తృప్తిచెందుతారు.యజ్ఞ శేషం దేవతలకు దానంతట అదే చెరుతుంది.           
వీరి సాగంత్యము,దర్శనం,వీరి నామ స్మరణ,వీరి చరిత్ర పారాయణం వల్ల సకల మానవులు సుఖ సంతోషాలతో భక్తి మార్గంలో పయనించి పరమాత్మ అనుగ్రహణ పొందుతారు.

         72 వ సూత్రము 
           "నాస్తి తేషు జాతి విద్యా రూప కుల ధన క్రియాది బెధః"   
భగవత్రసన్నత్వం కలిగిన భక్తి లో జాతిభేధాలు ఉండవు, జ్ఞాన,అజ్ఞానాలు, కులమత భేదం, రూప భేదం, స్త్రీ పురుష భేదం, ధనిక పేద భేదం వంటివి ఉండవు.ముఖ్యభక్తి కలిగాక ఎటువంటి ద్వంద్వాలు తోచవు. భగవదనుగ్రహం కోసం భక్తునికి కావాల్సింది విశ్వాసం,ఆత్మజ్ఞానం,జిజ్ఞాస,అభ్యాసం,సమాధినిష్ఠ,విష్ణు భజన మాత్రమే.
       
ఎవరైనా సరే భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసంతో  భక్తి ప్రపత్తులు ఉన్నవారు, జాతి మత, లింగ భేదం లేకుండా అనన్య పరమ ప్రేమభక్తి ద్వారా భగవంతునిచే అనుగ్రహింప బడతారు. భక్తి చేయడానికి గాని, తరించడానికి గాని అందరూ అర్హులే, కాని భక్తి తీవ్రతను బట్టి మాత్రమే  భగవంతుని అనుగ్రహం ఉంటుందని గ్రహించాలి.          

No comments:

Post a Comment