అమూల్య సలహాలు
రామరావణ సంగ్రామం జరుగుతోంది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బంధనంతో లక్ష్మణుడితో సహా పలువురు వానరులను పడగొట్టాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుణ్ని ఓషధీ పర్వతం నుంచి మృతసంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అనే నాలుగు ఓషధులు తెమ్మని చెబుతాడు. హనుమ తెచ్చిన వాటి పరిమళానికి బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయిన వారందరూ లేచారు. ఆ విధంగా ఆపదసమయంలో జాంబ వంతుడి సలహా యుద్ధవీరులను కాపాడింది. రావణుడితో యుద్ధం ప్రారంభమయ్యాక అగస్త్య మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయం రాముడికి ఉత్సాహాన్నిస్తుంది. కష్టకాలంలో ఆత్మీయుల సలహాలు మనిషికి ఉపశమనాన్నిస్తాయి. ఒక సందర్భంలో ధృతరాష్ట్రుడు విచారంతో కుమిలిపోతూ మహా బుద్ధిమం తుడైన విదురుణ్ని పిలిపిస్తాడు. మంగళదా యకమైన మాటలు చెప్పమంటాడు. ఆ సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చేసిన ఉపదేశం విదురనీతిగా ప్రసిద్ధికె క్కింది. దాన్ని శ్రద్ధగా విన్న ధృతరాష్ట్రుడు విదురుడు చెప్పినట్లే చేయాలని ఉన్నా, పుత్రవాత్సల్యం వల్ల తన బుద్ధి మారిపో తోందని వాపోతాడు. ప్రారబ్ధాన్ని దాటే శక్తి ఏ ప్రాణికీ లేదని నిరూపిస్తూ ధృతరాష్ట్రుడు కురువంశ నాశనానికి హేతువయ్యాడు. మరోవైపు సొంతవారిని చంపలేనని అస్త్ర సన్యాసం చేయబోయిన కిరీటికి కృష్ణపర మాత్మ గీతను బోధించాడు. ధర్మజ్ఞానాన్ని
అందుకున్న అర్జునుడు సంశయరహితుడై యుద్ధంలో విజయం సాధించాడు. పినతల్లి వల్ల అవమానం పొంది బాధపడుతున్న ధ్రువుణ్ని నారదుడు ఆశీర్వ దిస్తాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని ఉపదేశించి మధువనా నికి వెళ్లమని సలహా ఇస్తాడు. ధ్రువుడు అక్కడికి చేరుకుని శ్రీహరి రూపాన్ని తన మనసులో నిలుపుకొని తీవ్రమైన తపస్సు చేశాడు. శ్రీహరి ప్రత్యక్షమై ధ్రువుడికి వరాన్ని అనుగ్రహించాడు. మూడు లోకాలు నశించేటప్పుడు కూడా నశింపక ప్రకాశించే ధ్రువ నక్షత్రం ఏర్పడటానికి కారకుడు- ధ్రువుడికి మార్గదర్శకం చేసిన నారదుడే!
ఇంద్రాది దేవతలు అనేక సందర్భాలలో త్రిమూర్తులను స్తుతించి వారి సహాయం పొందేవారని మన పురాణాలు చెబుతున్నాయి. కలియుగంలో మానవులు లోభమోహాల్లో చిక్కుకుని బాధలు పడతారని వ్యాసమహర్షి గ్రహించాడు. మానవుల దుఃఖాలకు పరిష్కారాలతో అష్టాదశ పురాణాలను అనుగ్రహించాడు.
మనసు వ్యాకులతకు గురైనప్పుడు అనుభవ సంపన్నులైన కుటుంబ పెద్దలను, ఆయా రంగాల్లో నిష్ణాతులను సంప్రదించాలి. ఆపద వేళ అందరూ సలహాలిస్తారు. ఎవరి సలహాలు పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకున్నవారే వివేకవంతులు. మన శ్రేయోభిలాషులుగా నటించే శకునులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటున్నప్పుడు మన మనసే కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది.
- ఇంద్రగంటి నరసింహమూర్తి
No comments:
Post a Comment