*అహంభావన.....*
శరీరమే నేను అనే భావన నాటుకుపోయి ఉండటం వలన అదే అహంభావనగా అవతరించింది. చైతన్యమే జీవనం కోసం అహంభావనగా మారింది. దానికి గల ఆ దేహభావన పోతే మిగిలేది ఆత్మభావనే. దైవపూజలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు కూడా వస్తున్నాయని బాధపడతాం.
నిజానికి ఆ చెడు ఆలోచన ఎక్కడిది ? అహంభావన లోనుండి వచ్చిన తలంపే కదా.. అహంభావన అంటే నేను అనే భావనే. దైవం నీకు వేరుగా ఉన్నదని భావించినప్పుడు కోరుకోవటం, యోగ్యతననుసరించి వరాలు పొందటం అనే భావన ఉంటుంది. అయితే ఈ అహంభావన, నీలో ఉదయించే తలపులు ఏవీ నీ ఆత్మకు భిన్నమైనవి కావని భగవాన్ శ్రీరమణమహర్షి స్పష్టం చేస్తున్నారు.
నీటిలో పుట్టే బుడగ ఆ నీటికి భిన్నమైనది కాదు. బుడగ నీటికి నష్టాన్ని కలిగించదు. అలాగే తాను పగలటం వలన కూడా ఆ బుడగకు ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే బుడగగా ఉన్నా పగిలినా తాను అంతకు పూర్వం ఉన్న నీటి రూపాన్నే అది పొందుతుంది. మన అహంభావన కూడా ఆ బుడగ లాంటిదే.. అది మనలో ఆత్మగావున్న దైవానికి భిన్నంగా లేదు. అదిపోతే వచ్చే నష్టం కూడా లేదు..
No comments:
Post a Comment