Friday, December 13, 2024

 *జ్యోతిషాం అపి తత్ జ్యోతిః.....*

మనకు ఈ ప్రపంచంలో వెలుగును ఇచ్చే జ్యోతులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, దీపం, విద్యుత్తు. ఇవన్నీ వెలుపలి జ్యోతులు. కన్ను, ముక్కు, మనస్సు, బుద్ధి - ఇవి అంతరంగ జ్యోతులు. ఇవన్నీ స్వయం జ్యోతులు కాదు. ఎవరో ఒకరు శక్తినిస్తే వెలిగేవి మాత్రమే. ‘వేడినీరు’ అన్నప్పుడు వేడి ఆ నీటిది కాదు. అది అగ్ని లక్షణం. అలాగే ఈ జ్యోతులన్నింటికి వెలిగే శక్తి వాటిది కాదు. ఆ శక్తి ఆత్మది. సూర్యుడు - నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అని సైన్స్ చెబుతుంది. కాని అవి కూడా ఆత్మ యొక్క శక్తి వల్లనే ప్రకాశిస్తున్నాయి. అలాగే మన కన్ను, ముక్కు మొ॥న ఇంద్రియాలు కూడా ఆత్మశక్తి వల్లనే పనిచేస్తున్నాయి. అన్నింటిని తెలుసుకో గలుగుతున్నాయి.

పరమాత్మ జ్యోతిస్వరూపుడని కొందరు కళ్ళు మూసుకొని ప్రకాశ రూపంలో - వెలుగు రూపంలో చూడటానికి ప్రయత్నిస్తారు. కాని పరమాత్మ దృశ్య వస్తువు కాదు. ఈ కంటితో చూచేందుకు, మనస్సుతో భావించేందుకు. ఈ కంటికి కనిపించేది ఏదైనా భ్రమ మాత్రమే, మిథ్య మాత్రమే.

ఈ విషయాన్ని తెలియజేసే ఘట్టం బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. అది జనక యాజ్ఞ వల్క్యుల సంవాదరూపంలో ఉన్నది. 

దానిని గురుశిష్య సంవాద రూపంలో శంకరాచార్యుల వారు ఒక్క శ్లోకంలో చెప్పారు. దాని భావం వినండి...

గురువు: నీకు జ్యోతి ఏది?
శిష్యుడు: పగలు సూర్యుడు, రాత్రి దీపం.  
గురువు: ఆ సూర్యుణ్ణి గాని, దీపాన్ని గాని చూడటానికి నీ దగ్గర ఉన్న సాధనం ఏమిటి? 
శిష్యుడు: కన్ను. 
గురువు: కళ్ళు మూసుకుంటే అప్పుడు నీకు ప్రకాశం (సాధనం) ఏది? 
శిష్యుడు: బుద్ధి. 
గురువు: ఆ బుద్ధిని తెలుసుకోవాలంటే? 
శిష్యుడు: 'నేనే'. 
గురువు: కనుక నీవు పరమజ్యోతివి గదా! స్వయం జ్యోతివి గదా!
శిష్యుడు: అవును ప్రభూ! ఆ పరమ జ్యోతిని - జ్యోతులకు జ్యోతిని నేనే. 
సూర్యచంద్రులే నిజమైన జ్యోతులని బాహ్యదృష్టిగల శిష్యుడన్నాడు. గురువు క్రమంగా అతడి దృష్టిని అంతర్ముఖం చేయాల్సివచ్చింది. అందుకే కన్నే జ్యోతియని, బుద్ధియే జ్యోతియని, చివరకు ఆత్మయే జ్యోతియని స్థిర నిశ్చయం కలిగించాడు. అన్నింటిని చూపగలిగినదేదో అదే జ్యోతి. బయటి వస్తువులన్నింటిని దీపం చూపుతుంది. కళ్ళు లేనివాడు దీపాన్ని చూడలేడు. కంటిని చూపేది బుద్ధి. బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మ. ‘ధియోయోనః ప్రచోదయాత్’ అని వేదమాత గాయత్రి బుద్ధిని ప్రచోదనం చేసేది ఆత్మయని తెలియజేసింది.

No comments:

Post a Comment