Tuesday, April 22, 2025

 *శ్రీ కాశీఖండం - 1*

శ్రీనాధ మహాకవి రచించిన,  *'కాశీఖండం అయ : పిండం'* అని పండితులు చెప్పుకోవడం కలదు.   

అనగా ఆ మహాకవి రచించిన ఆ మహద్గ్రంథం నడక ఉక్కుముద్దలాగా కఠినంగా సామాన్యులకు కొరుకుడు పడదని భావన.  
* * *

అయితే,  శివానుగ్రహం వలన వేదవ్యాస ప్రోక్తమైన స్కాందపురాణంలో వున్న *'శ్రీ కాశీఖండం'*  సరళమైన శైలి లో అతి క్లుప్తంగా  వున్నది.  ఇంకా దాని గురించి  ధారాళంగా తెలుసుకోవాలనుకుంటే,  వారు మూలలలోకి వెళ్ళి మధించవచ్చు.    
* * *

*గజాననమ్ భూతగణాధి సేవితం కపిథ జంబూఫల చారుభక్షణం*
*ఉమాసుతమ్ శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం.*
*విశ్వేశం మాధవం డుంఢిమ్ దండపాణించ భైరవం*
*వందే కాశీమ్   గుహాం గంగాం  భవానీం మణికర్ణికాం.*

ముందుగా కాశీక్షేత్రం గురించి క్లుప్తంగా...

స్వర్గపాతాళాలకు మధ్యనున్న భూలోకంలో  కాశీనగరం అన్నిలోకాలనూ రక్షిస్తూ వుంటుంది.    ఈ క్షేత్రం మూడు లోకాలనూ పునీతం చేసే గంగానది ఒడ్డున వుండడం వలన,  ఈ క్షేత్రంలో మరణించే అన్ని జీవులూ తప్పక మోక్షాన్ని పొందుతాయి.  అందులో ఇసుమంత అయినా సందేహం లేదు. 
* * *

కాశీఖండ విశిష్టతను సూతునికి, శౌనకాదిమహామునులకు కృష్ణ ద్వైపాయనుడు వివరించారు. 

ఒకసారి నారదమహర్షి నర్మదానదిలో స్నానంచేసి,  ఓంకార నాధుని సేవించి, రేవానదీ తీరంలోవున్న వింధ్యపర్వతాన్ని చూడడం తటస్థించింది.   స్థావర జంగమ రూపమై వింధ్యపర్వతం *‘కావలసినప్పుడు సంచరించే శక్తి‘* కలిగి వున్నది.   అనేక ఓషధులతో,  వృక్షరాజాలతో ఎంతో ఠీవీగా కనబడే  వింధ్యపర్వత ప్రాశస్త్యం వర్ణింప వీలుకానిది. 

వింధ్యపర్వత వైభవాన్ని చూసి దేవతలే ముచ్చటపడి తరచూ ఆ విధ్యపర్వతం పైకి విహారం కోసం రావడం  ఆ సమయంలో  వింధ్యపర్వతం ఆతిధ్యం యివ్వడం జరుగుతూ వుంటుంది.   

అదే విధంగా నారదులవారు తనను సందర్శించినప్పుడు,  ఆయన పాదాలకు మెత్తగా వుండేటట్లు మెత్తని పచ్చికను తివాచీగా పరిచి ఆయనకు ఆనందం కలిగించింది.  గురుశుశ్రూషలో వింధ్యపర్వతం కూడా ఆనందం పొందింది. 

నారదులవారితో సంభాషిస్తూ, యధాలాపంగా,  

*'నేను భూమిని భరిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా వున్నది.   స్వామీ మీరు త్రిలోకసంచారులు కదా!  నేను మేరుపర్వతం కంటే గొప్పవాడిని కాదా ?   నాకంటే ఈవిషయంలో మేరు పర్వతం ఏ విధంగా అధికమైనది ?'* 

అని స్వోత్కర్ష చేసుకోవడం మొదలుపెట్టింది.

వింధ్యపర్వతం లో అహంకారం పాలు హెచ్చినదని గమనించిన నారదమహర్షి,  శిఖరదర్శన మాత్రాననే మోక్షం ప్రసాదించే శ్రీశైలపర్వతంలాంటి అనేక పర్వతాలు వుండగా,  ఈ వింధ్య పర్వతానికి ఇంత గర్వమెందుకు?  అని భావించి, 

*'ఓ వింధ్యపర్వతమా ! ప్రసిద్ధిచెందిన మేరు పర్వతాన్నే నువ్వు కించపరుస్తున్నావు.   ఇది నీకు తగదు.  అయినా ఇతరుల బలము, బలహీనతల గురించి అలోచించి అనవసరంగా సమయం వృధా చేసుకోవడం మంచిది కాదు'* 

అని చెప్పి వెళ్ళిపోయాడు.  
* * *

నారదుని మాటలకు వింధ్య పర్వతం కోపం తెచ్చుకుని, అలిగి,  మేరుపర్వతం మీద మాత్సర్యం పెంచుకుని,  విశ్వేశ్వరుని స్మరించుకుని, సూర్యభగవానుడు  మేరుపర్వతాన్ని చుట్టి ఇవతలకు రావడానికి అవకాశం లేకుండా  తన  పరిమాణాన్ని పెంచి ఆకాశాన్ని అంటింది.  

*‘మాత్సర్యముతో మదించినవారు కర్తవ్య విస్మరులై  వుంటారని చెప్పుకోవడానికి వింధ్యపర్వతం చేసిన విధానమే నిదర్శనము‘* 
* * *

ఆ విధంగా తన పరిణామాన్ని పెంచిన వింధ్యపర్వతము,  *'ఇప్పుడు సూర్యుడు గానీ, బ్రహ్మగానీ, నన్ను దాటి దక్షిణ భాగం లోనికి ఎలా ప్రవేశిస్తారో చూస్తాను'*  అని  తాను చేసిన పనికి సమర్ధించుకుంటూ ఊరట పొందసాగింది. 
* * *

ఇది శ్రీ స్కందపురాణంలో కాశీఖండములోని *'వింధ్యావర్ధన వర్ణము'* అనబడే మొదటి అధ్యాయంలోని సంక్షిప్తభాగము.

No comments:

Post a Comment