Tuesday, April 22, 2025

 *ఏప్రిల్ 20 ఆదివారం భాను సప్తమి*
🪷🪷🪷🪷🪷🪷🪷


ఆదివారం రోజు సప్తమి తిథి వస్తే దానిని భాను సప్తమి అంటారు. భాను సప్తమి చాలా దివ్యమైన రోజు. ఈరోజు సూర్యునికి సంబంధించిన పర్వదినం. ఈ రోజు గొప్ప యోగవంతమైనదిగా భావిస్తారు. ఈ రోజు చేసే స్నానం, దానం, జపం, హోమం లక్ష రెట్ల ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నం సూర్య దేవుడికి నివేదన చేస్తారు.

నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే ఎవరికైనా అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది.

*ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే*
*సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా*
*స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే*
*న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి*

తినకూడని పదార్ధాలు, మద్యం, మాంసం మొదలైనవి తినేవారు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు. ఆజన్మాంతం దరిద్రం వెంటాడుతుంది. స్త్రీ సమాగమం, తైలం రాసుకోవడం, మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టిన వారికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. వారు సరాసరి సూర్యలోకానికి వెళతారు.

ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పాడు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం. సూర్యనమస్కారాలు చేయడం ఎన్నో శుభఫలితాలు, ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి.

ప్రతి ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో ప్రధానంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు, ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక, ఆహార నియమాలు పాటించని వారికి రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెప్పాడు. శ్రీరామచంద్రుడంతటివాడు రావణున్ని యుద్ధంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు. ప్రతి రోజు సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేసినవారికి అన్నింటా విజయం కలుగుతుంది.

సప్తమి తిథికి అధిపతి సూర్యుడు. సప్తసంఖ్యకు సూర్యునికీ అవినాభావ సంబంధం ఉంది. సూర్యుని జన్మ తిథి సప్తమి. అతని రథానికి గుర్రాలు ఏడు. సూర్యుడు తిరిగేది సప్త ద్వీప పర్యంతం. అతని కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక.

సూర్యునినుండే దిక్కులు ఏర్పడుతాయి. వారాలలో తొలి రోజైన ఆదివారం, తిథుల్లో సప్తమి - సూర్యారాధనకు ప్రశస్తమని పురాణ వచనం రెండూ కలసి రావడం అంటే అది మరింత విశిష్టమైనదిగా చెబుతారు.

సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలి, ఒక నమస్కారం సమర్పిస్తే సంతృప్తుడై అనుగ్రహిస్తాడు. అలాంటి మహిమగల సూర్యభగవానుడిని ప్రార్థించి, స్తోత్రాలు పఠించి భానుసప్తమి రోజున మనందరం ప్రత్యక్ష భగవానుడైన సూర్య నారాయణుడి అనుగ్రహం పొందుదాం.

No comments:

Post a Comment