Monday, April 21, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-478.
4️⃣7️⃣8️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________```
సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. మనకు రెండు మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాము కదా. ఒకటి ప్రవృత్తి మార్గము రెండు నివృత్తి మార్గము. సర్వధర్మములు అంటే ప్రవృత్తి మార్గములో లభించేవి. ప్రాపంచిక విషయములు, విషయవాంఛలు, బంధు మిత్రులు, ఆస్తి, ధనము, బంధనములు, ఇవన్నీ వదలాలి. ఊరికే వదిలితే సరిపోదు. పరమాత్మను శరణు వేడాలి. ‘నీవే తప్ప నితః పరం బెరుగ’ అనే స్థాయికి చేరుకోవాలి. అప్పుడు మనం ఏం చేసినా ఆ పాపం మనకు అంటదు. అంటే అకృత్యములు చేయమని కాదు. ఆ స్థాయికి చేరుకున్నవాడు దుర్మార్గములు, అకృత్యములు చేయనే చేయడు. పరమాత్మను పట్టుకున్నవాడికి చిన్న చిన్న ధర్మములు, పూజలు, వ్రతములు చేసి ప్రయోజనము లేదు. గంగానది పక్కన ఉన్న వాడికి బావి నీళ్లతో పనిలేదు. అందుకే సన్యాసులు ఏమీ చేయరు. కేవలము పరమాత్మను మనసులో నిలుపుకొని ధ్యానిస్తుంటారు. కాని మనం సన్యాసులం కాదు కదా. సంసారంలో ఉన్నాము కాబట్టి మనం కర్మలు చేయాలి తప్పదు. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము అని ఇదివరకే చెప్పబడింది. ఆ కారణం చేత ఇక్కడ ‘సర్వధర్మాన్ పరిత్యజ్య’అంటే సర్వధర్మములను ఆచరిస్తూనే, వాటిని నేను చేయడం లేదు. అన్ని ప్రకృతిసిద్ధంగా జరుగుతున్నాయి. నేను కేవలం సాక్షిగా చూస్తున్నాను అనే భావన అలవరచుకోవాలి. నేను చేస్తున్నాను అనే కర్తృత్వభావన వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆత్మ వేరు శరీరం వేరు. మనసు, బుద్ధి, అహంకారాలు, శరీరము ఇవే పనులు చేసేది. ‘గుణా గుణేషు వర్తంతే’అని ఇదివరకే చెప్పబడింది. అంటే మనలో ఉన్న సత్వ,రజస్తమోగుణములు. బయట ప్రకృతిలో ఉన్న రజస్తమోగుణములతో చేరి, ప్రవర్తిస్తున్నాయి. దాని వలన కర్మలు జరుగుతున్నాయి.

ఉదాహరణకు సత్వగుణం కలిగిన అందమైన వస్తువును కానీ, పూవును కానీ చూచి మనలో ఉన్న సత్వగుణము దానిని చూడమనీ, దాని దగ్గరకు వెళ్లమని సూచిస్తుంది. అప్పుడు మనం దాని దగ్గరకు వెళతాము. కాని రజోగుణము, తమోగుణము కలిగిన పామును, పులిని చూచి మనలో ఉన్న రజస్తమోగుణములు, దానిని చంపు లేకపోతే పరుగెత్తు అని సూచిస్తుంది. వెంటనే మనం ధైర్యం ఉంటే కత్తో, కర్రో తీసుకుంటాము లేకపోతే పరుగు లంకించుకుంటాము. ఇవన్నీ ఆత్మ కేవలం సాక్షి మాదిరి చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం స్వధర్మనిష్ట కలిగి ఉండాలి. కర్మలు చేయాలి కానీ అవన్నీ మనలో ఉన్న గుణముల ప్రభావంతో, ప్రకృతిసిద్ధంగా జరుగుతున్నాయి కానీ వాటిని నేనే చేస్తున్నాను అని అనుకోకూడదు. నేను వేరు శరీరం వేరు అనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ విషయాలను తెలుసుకోవాలి అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి అనే అర్థాన్ని ఈ ‘సర్వధర్మాన్ పరిత్యజ్య’ అనే పదాలు స్ఫురింపజేస్తున్నాయి.

‘మామేకమ్’ అంటే పరమాత్మను ఒక్కడినే శరణు వేడాలి. అనన్య భక్తి కలిగి ఉండాలి. మనసు చంచలం కాకూడదు. చెట్టుకు మొదట్లో నీరు పోస్తే చిటారు కొమ్మకు కూడా చేరినట్టు, పరమాత్మను ఏకాగ్రబుద్ధితో పూజించి ధ్యానిస్తే, అన్ని దేవతలను పూజించినట్లే. అన్నిధర్మములు ఆచరించినట్టే, అన్ని కర్మలు చేసినట్టే. ‘ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’ అంటే ఆకాశం నుండి భూమి మీద పడిన నీరు నానావిధాలుగా సముద్రం చేరినట్టు, మనం ఎంత మంది దేవతలను, దేవుళ్లను వివిధ రకాలుగా పూజించినా అవి అన్ని కూడా ఆ పరమేశ్వరునికే చెందుతాయి.అందుకే ‘మామ్ ఏకం’ అని వాడారు. ఇక్కడ ఏకం అంటే నన్నే పూజించు అని కాదు. అన్ని దేవతా స్వరూపాలు ఆయన రూపాలే. ‘ఏకమేవా అద్వితీయం బ్రహ్మ’ --బ్రహ్మము ఒక్కటే ఇద్దరు కాదు.. అనే స్థితికి చేరుకోవాలి. దేవుళ్ల మధ్య భేదభావమును వదిలిపెట్టాలి.

దానికి ఫలితం ఏమిటి అంటే ‘అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి’ అంటే మానవులు తమ సమస్తపాపముల నుండి విముక్తులు అవుతారు. సంసార బంధనముల నుండి, ప్రాపంచిక విషయముల నుండి, విషయ వాంఛల నుండి ముక్తి కలుగుతుంది. ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు. మనం చేయాల్సింది చేస్తే ఆయన చేయాల్సింది చేస్తాడు. మనం ఏమీ చేయకుండా అంతా దేవుడే చూసుకుంటాడు అని అనుకోవడం సోమరితనానికి దారి తీస్తుంది. కృష్ణుడు అర్జునుని తన కర్తవ్యమును నెరవేర్చమన్నాడే కానీ సోమరిగా కూర్చోమనలేదు.

ఆఖరున ‘మాశుచః’ అంటే అర్జునా శోకించకయ్యా నాకు ఏడవడం అంటే పడదు అని అన్నాడు కృష్ణుడు. ఇందాక చెప్పినట్టు సంతోషంగా ఉండటం మానవుల లక్షణం. దుఃఖములు మనం తెచ్చిపెట్టుకుంటాము. అర్జునుడు కూడా జరగనివి, జరగబోయేవి ఏవేవో ఊహించుకొని బాధపడుతున్నాడు. అవి వదిలిపెట్టు. భారం నా మీద వేసి యుద్ధం చెయ్యి నీ ధర్మం నెరవేర్చు నీకు ఏ పాపము అంటదు అని బోధించాడు కృష్ణుడు.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment