అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-479.
4️⃣7️⃣9️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*67. వ శ్లోకము:*
*”ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచనl*
*న చాఽశుశ్రూషనే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతిll”*
“ఓ అర్జునా! ఇప్పుడు నేను నీకు బోధించిన ఈ గీతాశాస్త్రమును, తపస్సు, భక్తి, వినడంలో ఆసక్తి లేని వారికీ, దైవము యందు నమ్మకము లేకుండా దైవదూషణ చేసేవారికి ఎప్పుడూ బోధించకూడదు.”
```
ఈ హెచ్చరిక ఈనాడు మనందరికీ పరమాత్మ చేసిన హెచ్చరిక. ఈ గీతను ఎవరికి బోధించాలి, గీతను వినడానికి ఎవరు అర్హులు అనే విషయం ఇక్కడ వివరంగా చెప్పాడు కృష్ణుడు. గీతను వినడానికి మొట్టమొదటి అర్హత తపస్సు అంటే అడవులకు పోయి తపస్సు చేయడం కాదు. గృహస్థుగా ఉంటూనే ధర్మచింతన, క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపేవారు అని అర్థం. క్రమశిక్షణ, ధర్మ ఆచరణ లేనివారికి భగవద్గీత చెబితే వాడు దానిని తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. తరువాతి లక్షణం.. భక్తి, దైవభక్తి లేని వారికి, ఏకాగ్రతలేని వారికి, చెప్పకూడదు. మనం కృష్ణుడిని దేవుడిగా పూజిస్తున్నాము. అందుకే శ్రీకృష్ణుడిని భగవాన్ అని సంబోధిస్తున్నాము. అటువంటిది దేవుడి మీద భక్తి లేని వాడికి భగవద్గీత చెప్పడం చెవిటి వాడి ముందు శంఖం ఊదడం లాంటిది. వాడు వినడు. పక్కన ఉన్న వాడిని విననివ్వడు. అటువంటి వారికి చెప్పకూడదు. తరువాత లక్షణం పరధ్యానంగా ఉండటం. గీతాజ్ఞాన యజ్ఞానికి వస్తారు, కూర్చుంటారు. మనసు ఎటో పోతుంటుంది. ఏం చెబుతున్నారో తెలియదు. పక్కన ఉన్న వాడిని ఇంకా ఎంతసేపురా ఈ సోది అని అంటుంటాడు. అంటే వీడికి వినడం ఇష్టం లేదు. కాబట్టి, వినడం ఇష్టం లేని వారికీ, దైవమును పూజించని వారికీ, దైవమును దూషించే వారికి చెప్పకూడదు. చెప్పి ప్రయోజనము లేదు.
ఎందుకంటే, పైన చెప్పిన లక్షణములు కలవారు ‘గీతలో ఏముంది, మనకు తెలిసిందే కదా! మనకు తెలియంది ఏముంది’ అనే మూర్ఖత్వంతో ఉంటారు. వారికి తెలియదు ఒకరు చెబితే వినరు. వారు బాగా చదువుకున్న విద్వాంసులు కావచ్చు. ప్రాపంచిక విద్యలు ఎన్నో నేర్చి ఉండవచ్చు. ఎన్నో డిగ్రీలు సంపాదించి ఉండవచ్చు. అటువంటి వారు తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించుకోవాలనే ఆతురతగా ఉంటారు కాని సత్యము అసత్యము వీటి మధ్య ఉన్న భేదములు తెలుసుకోలేని, తెలుసుకోవడానికి ఇష్టంలేని మూర్ఖులు. వారికి తెలియదు ఒకరు చెబితే వినరు. తమకు తెలిసిందే సత్యం అని నమ్ముతారు. అటువంటి వారు గీతను సరిగా అర్ధం చేసుకోలేరు.
మనసు నిర్మలంగా లేకపోతే ఏమి చెప్పినా తలకు ఎక్కదు. బుద్ధి నిలవదు. గీతను వింటూనే ఉంటాడు మనసు మాత్రం ప్రాపంచిక విషయముల వెంట పరుగెడుతూ ఉంటుంది. అటువంటి వారికి చెప్పడం వృధా. తపస్సు అంటే అడవులలోకి పోయి ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు. ఈ ప్రాపంచిక విషయముల నుండి, సంసార బంధనముల నుండి ఎలా విడివడాలా అనే తపన చెందడం. క్రమశిక్షణ కలిగి ఉండటం. చేసే పని యందు ఏకాగ్రత కలిగి ఉండటం. అదే తపస్సు.
దీని తరువాత మరొక దుర్గుణం గురించి కూడా చెప్పారు వ్యాసులవారు. ‘అభ్యసూయతి’ అంటే దుర్బుద్ధి, అసూయ ఉండకూడదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్లు కూడా భగవద్గీతను శ్రద్ధగా చదువుతారు, వింటారు. కాని వీరికి భగవంతుని మీద, ఆయన చెప్పిన గీత మీద నమ్మకం ఉండదు. గీతలో ఏమేమి అసంధర్భాలు, తప్పులు, అవాచ్యాలు ఉన్నాయా అని వెదుకుతారు. ప్రతిదీ సందేహిస్తారు. విమర్శనాత్మక దృష్టితో చూస్తారు. గీతలో ఉన్న 700 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పలేదు. వీటిలో కొన్ని తరువాత కలిపారు అంటూ తమకు ఇష్టం లేని శ్లోకాలను తీసేసి కొత్త గీతను తయారు చేస్తారు. ఇంకా కొంత మంది గీతలో చెప్పిన విషయాలు అన్నిటికీ కారణాలు చూపించమంటారు. తుదకు గీత అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారు. ఇటువంటి మనస్తత్వము కలవారికి కూడా గీతను చెప్పకూడదు.
మరి ఈ గీత ఎటువంటి వారికి చెప్పాలి అంటే గీత యందు, పరమాత్మ యందు భక్తి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేసే వారయిఉండాలి. చేసే పని మీద ఏగాగ్రత కలిగి ఉండాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా గీతను వినడంలో ఆసక్తి, అందులో ఏముందో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. ఇటువంటి వారికి గీతను బోధించవచ్చు. ఆడ, మగ, ధనిక, పేద, ఉన్నత కులము, నీచకులము, విద్యావంతులు, విద్యాగంధము లేని వారు, అనే తేడా లేకుండా పై లక్షణములు ఉన్న వారికి గీతను బోధించాలి. అటువంటి వారు గీతను సరిగా అర్థం చేసుకోగలరు అని పరమాత్మ అభిప్రాయము. గీతను వినడానికి కావాల్సిన యోగ్యతలను, అటువంటి యోగ్యతలను ప్రతి వ్యక్తి పెంపొందించుకోవలసిన ఆవశ్యకతను, ఈ శ్లోకంలో చక్కగా వివరించారు వ్యాసులవారు.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment