Tuesday, April 22, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-480.
4️⃣8️⃣0️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*68. వ శ్లోకము:*

*”య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతిl*
 *భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయఃll”*

“ఈ పరమ రహస్యమైన గీతా శాస్త్రమును ఎవరైతే ఇతరులకు చెబుతారో వారు నా యందు భక్తిని కలిగి ఉండాలి. గీత గురించి గానీ, పరమాత్మను గురించి గానీ, ఆత్మతత్వమును గురించి గానీ అతనికి ఎటువంటి సందేహములు ఉండకూడదు. అప్పుడే అతడు గీతను ఇతరులకు బోధించగలడు. గీతను ఇతరులకు బోధించిన దానికి ఫలితంగా అతడు నన్నే పొందగలడు. గీత మీద అవగాహన లేకుండా, పరమాత్మ ఎడల విశ్వాసం లేకుండా గీతను ఎవరూ ఇతరులకు బోధించలేరు. కాబట్టి గీతను వివేవాళ్లే కాదు, గీతను బోధించే వాళ్లు కూడా కొన్ని నియమములను కలిగి ఉండాలి.

పురాతన కాలం నుండి అనేక మంది గీతాచార్యులు గీతకు ఎన్నో భాష్యాలు రాసారు. వివరణలు రాసారు. వాఖ్యలు రాసారు. జ్ఞాన యజ్ఞముల పేరిట ఎంతో మందికి గీతను బోధిస్తున్నారు. అందరికి గీత తో పరిచయం కలిగిస్తున్నారు. 'మన గురించి చెబుతున్న శాస్త్రము... గీత అనే పేరుతో ఒకటి ఉన్నది' అనే జ్ఞానాన్ని అందరికీ కలిగిస్తున్నారు. దీనిని జ్ఞాన యజ్ఞము, జ్ఞాన దానముగా పరిగణించవచ్చు. గీతా జ్ఞాన యజ్ఞములను, గీతా జ్ఞాన దానమును, గీతను ఒక తపస్సుగా భావించే వీరందరూ ఆ పరమాత్మకు అత్యంత ప్రియులు. అటువంటి గీతాచార్యులు ఎటువంటి సంశయము లేకుండా తుదకు పరమాత్మనే పొందగలరు. అంటే గీతా జ్ఞానమును ఇతరులకు పంచి బెడితే అతడికి మోక్షము లభిస్తుంది. ఇది వ్యాసుల వారు గీతాచార్యులకు ఇచ్చిన వాగ్దానం.”
```
‘కాకపోతే, గీతను ఇతరులకు బోధించే ముందు, ఆ బోధించే వారికి గీత యందు, గీత చెప్పిన శ్రీకృష్ణుని యందు పరమమైన భక్తి కలిగి ఉండాలి. భక్తి లేని వాడు భక్తి యోగాన్ని ఎలా బోధించగలడు. కాబట్టి గీతాచార్యులు అందరూ ముందు గీతను భక్తిశ్రద్ధలతో చదివి, అర్థం చేసుకొని, మననం చేసి, ఆచరించి, తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. వారి హృదయాలకు హత్తుకునేటట్టు చెప్పగలిగి ఉండాలి. అంతే కానీ కేవలం పెద్దవారు రాసిన భాష్యములను చదివి వినిపించడం గీతా బోధ కాదు. అటువంటి వారు చివరకు నన్నే పొందుతారు అని గీతాచార్యులవారు మనకు వాగ్దానం చేస్తున్నారు.```


*69. వ శ్లోకము:*

*”న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమఃl*
 *భవితా న చ మే తస్మా దన్యః ప్రియతరో భువిll”*

“గీతను ఇతరులకు భక్తితో బోధించే వారు మాత్రమే నాకు అత్యంత ప్రియులు. వారి కంటే నాకు ప్రియమును కూర్చువారు ఈ భూమి మీద మరొకరు లేరు    అని భగవానుడు ఇక్కడ చెబుతున్నాడు. అంటే పరమాత్మ అనుగ్రహం పొందాలంటే, గీతను చదవడం గానీ, అధ్యనం చేయడం కానీ, అర్థం చేసుకొని బోధించడం కానీ చేయాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. అప్పుడే వారు పరమాత్మకు అత్యంత ప్రియులు అవుతారు. ఇంతకన్నా ప్రియులు 
ఈ భూలోకంలో ఇకముందు కూడా ఉండబోరు. అంటే ఏ పని చేసినా ఇంతకంటే ప్రియమైన పని మరొకటి లేదు అని అన్నాడు పరమాత్మ.”
```
మానవులు పరమాత్మకు ప్రియమైన పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారు. వాటన్నిటితో పాటు, గీతను చదవడం, ఇతరులకు చెప్పడం ఉత్తమము. అటువంటి వారు నాకు ఇష్టులు అంటున్నాడు కృష్ణుడు. గీతా సారమును ఎవరికి వారు తమలోనే అట్టిపెట్టుకోకుండా ఇతరులకు కూడా పంచిపెట్టాలనీ అందరికీ ఆత్మజ్ఞానము గురించి తెలియజెప్పాలనీ కృష్ణుని అభిమతము. ఇటువంటి వారికన్నా నాకు అత్యంత ప్రియుడు భూలోకంలో ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మరొకడు ఉండబోడు అని చెప్పాడు పరమాత్మ. వీటి అర్థం ఒకటే. గీతను శ్రద్ధగా సరిగా చదివి, అర్థం చేసుకొన్నా, తాను అర్థం చేసుకున్న విషయాలను ఇతరులకు భోధించినా, అతడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. తాను వేరు శరీరం వేరు, తాను ఆత్మస్వరూపుడు అనే ఙ్ఞానం కలుగుతుంది. తద్వారా పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుంది.ఇదే గీతా సారము.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment