Tuesday, April 22, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-481.
4️⃣8️⃣1️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*70. వ శ్లోకము:*

*“అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోఃl*
 *జ్ఞానయజ్ఞేన తేనాహ మిష్ణస్స్యా మితి మే మతిఃll”*

“ఎవరైతే మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంవాదమును శ్రద్ధతో అధ్యయనం చేస్తారో, దానినే జ్ఞాన యజ్ఞము అని అంటారు. ఈ జ్ఞాన యజ్ఞము చేత నేను ఆరాధింపబడతాను. ఇదే నా నిశ్చయము.”
```
‘భగవంతుని ఆరాధించడం అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆవాహన చేయడం, అలంకరించడం, పూజించడం, ఆరాధించడం, నివేదనలు అర్పించడం, ఊరేగింపులు చేయడం, దేవాలయాలు కట్టించడం, ఉత్సవాలు జరిపించడం (సగుణోపాసన) అనేకరకాలుగా చేస్తుంటారు. మరి కొంత మంది నిర్గుణోపాసన అంటే నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్మను శాస్త్రములు చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ధ్యానము చేయడం, తద్వారా ఆత్మజ్ఞానమును పొందడం, మొదలగు పక్రియల ద్వారా ఆరాధిస్తుంటారు.

కాని ఈ కృష్ణార్జున సంవాదము ఉపనిషత్తుల సారము, యోగ శాస్త్రము, బ్రహ్మవిద్య, ఈ మూడు కలిపి చిలికి వడబోస్తే వచ్చిన సారము గీత. 
ఈ గీతను చదవడం, అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానము సంపాదించవచ్చు. 
దీనినే గీతా జ్ఞాన యజ్ఞము అని అంటారు. 
గీతా జ్ఞాన యజ్ఞము చేయడం, అంటే గీతను భక్తి శ్రద్ధలతో చదవడం, అధ్యయనం చేయడం, ఇతరులకు చెప్పడం ఇవి అన్నీ భగవతారాధనలలో అత్యుత్తమమైనవి. అదే నాకు చాలా ఇష్టమైనది అని కృష్ణుడు గట్టిగా నొక్కి చెప్పాడు. గీతను ఇతరులకు చెప్పే ముందు అతడు బాగా అధ్యయనం చేయాలి. గీతా సారం తెలుసుకోవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడే ఇతరులకు బోధించగలడు. గీతను ఇతరులకు చెప్పడమే భగవంతుని ఆరాధన, గీతను చదవడం, అర్ధం చేసుకోవడం, ఇతరులకు చెప్పడం ఈ మూడు ప్రక్రియలు భగవంతుని పూజించడం ఆరాధించడంతో సమానము. దాని వలన తనకు తాను మేలు చేసుకుంటాడు. ఇతరులకు మేలు చేసినవాడవుతాడు.

ఈ గీతా జ్ఞాన యజ్ఞములో జ్ఞానమే హెూమాగ్ని, గీతను బోధించేవాడు యాజ్ఞికుడు. గీతను వినేవాడు యజమాని. యజమానిలో ఉన్న అజ్ఞానమే ఆహుతులు. అతని అహంకారమే బలిపశువు. ఈ గీతాజ్ఞాన యజ్ఞములో యజమానిలో పేరుకుపోయిన అజ్ఞానము అనే ఆహుతులను అగ్నిలో వేసి హుతం చేస్తున్నాడు. అహంకారము అనే పశువును బలి ఇస్తున్నాడు. ఆ యజ్ఞం చేయడం ద్వారా జ్ఞానము అనే ఫలాన్ని పొందుతున్నాడు. ఇదే గీతా జ్ఞానయజ్ఞము. గీతలో భక్తి,జ్ఞాన, వైరాగ్యాల గురించి ముఖ్యంగా చెప్పబడ్డాయి. గీతను చదివినా ఇతరులకు చెప్పినా ఈ మూడుగుణాలు కొంచెం కొంచెం అయినా వంటబడతాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. కృష్ణుడే ఇది నా నిశ్చయము అని ఉద్ఘాటించాడు. కాబట్టి గీతా పఠనం, గీతా బోధన పరమాత్మకు ఇష్టం అని మనకు తెలుస్తూ ఉంది.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment