అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-483.
4️⃣8️⃣3️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*అర్జున ఉవాచ:*
*73. వ శ్లోకము:*
*”నష్టోమోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాఽచ్యుతl*
*స్థితోఽస్తి గతసన్దేహః కరిష్యే వచనం తవll”*
“అచ్యుతా! నీ అనుగ్రహము వలన నా లోని మోహము నశించినది. నాకు స్మృతి కలిగినది. నాలోని సందేహములు అన్నీ తొలగి పోయాయి. నీవు ఏం చెబితే అది చేస్తాను..”
```
కృష్ణుడు అడిగిన ప్రశ్నకు అర్జునుడు ముచ్చటగా మూడు ముక్కలలో సమాధానం చెప్పాడు. అర్జునుడి సమాధానం “నష్టో” అనే క్రియా పదంతో మొదలయింది. హనుమంతుడు లంకలో సీతను చూచి వచ్చిన తరువాత రామునితో ఇదే విధంగా “చూచితి సీతను” అని “చూచితి” అనే క్రియా పదంతో మొదలు పెట్టాడు. అంటే తాను చేసిన కార్యాన్ని, పొందిన అనుభూతిని మొట్టమొదటి పదంలోనే స్పష్టం చేయడం. ఇక్కడ కూడా అర్జునుడు నష్టో అంటే నష్టం అయింది అని గట్టిగా అన్నాడు. తరువాత మోహ అని అన్నాడు. అంటే నాలో ఉన్న మోహము, అజ్ఞానము పూర్తిగా నశించి పోయింది అని అర్థం. అంటే నాకు జ్ఞానోదయం అయింది. ఎలా అంటే వెలుగు రేఖలు రాగానే చీకటి దానంతట అదే పోతుంది. చీకటి అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. వెలుగు లేకపోవడమే చీకటి, అంధకారము. మనం అందరం జ్ఞాన స్వరూపులము, ఆనంద స్వరూపులము. కాకపోతే మనకు మనమే ఆ జ్ఞానానికి ఆనందానికి మసిపూసుకున్నాము. ఆ మసి తుడిచేసుకుంటే, జ్ఞానం ప్రకాశిస్తుంది. అదే మాట ఇక్కడ అన్నాడు అర్జునుడు. నాలోని అజ్ఞానం నశించింది అని అన్నాడు.
మరి ఆ అజ్ఞానం ఎలా నశించింది అనే దానికి సమాధానం పక్కనే అన్నాడు. “త్వత్ప్రసాదాన్మయాఽచ్యుత” అంటే నీ అనుగ్రహం వలన నా అజ్ఞానము నశించింది అని అర్థం. మనలో ఉన్న అజ్ఞానం పోవడానికి భగవంతుని అనుగ్రహం తప్పక ఉండాలి. లోకాలను ఆవరించిన అంధకారం తొలగాలంటే సూర్యోదయం కావాలి. అలాగే మనలో ఉన్న అజ్ఞానం నశించాలంటే మనకు పరమాత్మ అనుగ్రహం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది. సందేహాలు నశించి పోతాయి. ఎంత ఎక్కువ చదివితే అన్ని ఎక్కువ సందేహాలు వస్తాయి. ఏమీ చదువుకోని వాళ్లు పరమాత్మను గుడ్డిగా నమ్ముతారు. ఆయనకు ఆత్మార్పణం చేసుకుంటారు. దానికి ఉదాహరణ గోకులంలో గోపికలు. వారికి చదువురాదు. వారికి కృష్ణుడి గురించి ఎటువంటి సందేహములు లేవు. దానిని మూఢభక్తి అని అందరూ ఎగతాళి చేస్తారు. సందేహాలు కలిగిన జ్ఞానము కన్నా ఎటువంటి సందేహములు లేని మూఢభక్తి మేలు కదా! అందుకే అర్జునుడు నాలో ఉన్న సందేహాలు అన్నీ తొలగి పోయాయి అని గట్టిగా ఉద్ఘాటించాడు.
ఇంక ఆఖరుది. “కరిష్యే వచనం తవ.” అంటే కృష్ణా! నీవు చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు.
అంటే సంపూర్ణ శరణాగతి. నీవే తప్ప నితఃపరం బెరుగ అనే స్థితి. మనం కూడా క్రమక్రమంగా ఆ స్థితికి చేరుకోవాలి. దానికి మూడు మెట్లు, ఒకటి మనలో ఉన్న అజ్ఞానం పోవాలి. రెండు మనలో ఉన్న సందేహాలను విడిచి పెట్టాలి. మూడు పరమాత్మను సంపూర్ణ శరణాగతి పొందాలి. ఈ మూడు ఆచరిస్తే మనకు అనంత మైన సుఖము శాంతి కలుగుతాయి. ఏ చింతా ఉండదు.
గీతను కేవలం వినడమే కాదు ఆచరించాలి అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అంతర్లీనంగా చెప్పాడు వ్యాసుడు. కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు అని కాకుండా వెంటనే ఫలితం కూడా ప్రకటించాడు. అంటే అర్జునుడు గీతను ఆచరణలో పెట్టాడు. తనలో అజ్ఞానం పోయిందన్నాడు. నీకు పూర్తిగా శరణాగతి అన్నాడు నీవు చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు. మనం కూడా గీతను విన్న దానికి ఫలితం దానిని ఆచరణలో పెట్టాలి. అజ్ఞానం తొలగించుకోవాలి. పరమాత్మను ఏకాగ్రబుద్ధితో నమ్మాలి. కేవలం కోరికల కోసమే పరమాత్మను పూజించ కూడదు. దేవుళ్లను మార్చకూడదు. దేవుళ్ల మధ్య భేదము చూపించకూడదు. ఇష్టదైవాన్ని నమ్మాలి. ఆయనకు శరణాగతి కావాలి. అప్పుడే సుఖము శాంతి లభిస్తాయి.
ఇంకొంచెం వివరంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాము.
“నష్టో మోహం స్మృతిర్లబ్ధా” అంటే మోహం పోయింది. పూర్వజ్ఞానం వచ్చింది. అంటే మనకు స్వతఃసిద్ధంగా జ్ఞానం ఉంది. అది మోహంతో మూసుకుపోయింది. సంసారము, ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలు అనే ఈ మోహం తొలిగిపోతే మనలో ఉన్న అజ్ఞానము అనే చీకటి తొలగిపోతే, జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. ముందు మనం ఆ పని చేయాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మనసుకు పట్టిన మకిలను తుడిచేసుకోవాలి.
ఈ సందర్భంలో జగద్గురు శంకరాచార్యులవారి ఆత్మబోధలోని శ్లోకం గుర్తుకు తెచ్చుకుందాము.```
*ఆత్మా తు సతతం ప్రాప్తో హ్యప్రాప్తవదవిద్యయా తన్నానే ప్రాప్తవద్భాతి స్వకంఠా భరణం యథా*```
మనలో ఆత్మ ఎల్లప్పుడూ ఉంది. కాని మనలో ఉన్న అవిద్య వలన ఆత్మను గుర్తించలేకపోతున్నాము. శరీరమే నేను అనుకుంటున్నాము. శరీరమే నేను అనే అవిద్య తొలగిపోతే, మెడలో ఉన్న కంఠహారం కనపడినట్టు మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది.
కాబట్టి పరమాత్మ అన్ని జీవరాసులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కాని మనలో జన్మజన్మల నుండి పేరుకుపోయిన అజ్ఞానం వలన మనం ఆత్మను గుర్తించడం లేదు. గీత, గురువు మొదలగువారు ప్రసరించే వెలుగు సాయంతో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి. దానికి మనకు కావాల్సింది “త్వత్ప్రసాదాత్” గురువుల యొక్క, పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. అజ్ఞానము అనే మాయను దాటడానికి గురువు చుక్కాని లాంటి వాడు. మనకు సరి అయిన దారి చూపిస్తాడు. (గురువు, శిక్షకుడు, టీచర్ వీటిని మనం ఒకే అర్థంలో వాడుతుంటాము. కాని వాటి అర్థాలు వేరు. గురువు అంటే తన శిష్యుడిని చీకటిలో నుండి వెలుగులోకి నడిపించేవాడు. జ్ఞానదాత. శిక్షకుడు అంటే కేవలం శిక్షణ ఇచ్చేవాడు. టీచర్ అంటే బోధించేవాడు. శిక్షకుడు, బోధకుడు కేవలం తమ పనులు తాము నిర్వర్తిస్తుంటారు. శిష్యుని గురించి పట్టించుకోరు. కాని గురువు అలా కాదు. తన శిష్ముని వేలుపట్టుకొని చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తాడు.)
శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు అయినా గర్గుడు, సాందీపుడు మొదలగు గురువుల వద్ద విద్య నేర్చుకున్నాడు. మనకు అంతా తెలుసు అనుకోవడం పొరపాటు. గురువును ఆశ్రయించి తెలియనివి తెలుసుకోవడం విజ్ఞుల లక్షణం. దాని వలన కలిగే లాభం “గతసందేహః” అంటే మనలో ఉన్న సందేహాలు తొలగి పోతాయి. మనలో కలిగే సందేహాలను తీర్చే సమర్ధత ఉన్న వాడు గురువు ఒక్కడే, కాబట్టి సమర్థుడైన గురువును ఆశ్రయించడం ప్రతివాడి కర్తవ్యం.
ఆఖరు వాక్యం కరిష్యే వచనం తవ అంటే నీవు చెప్పినట్టు చేస్తాను, పరమాత్మ చెప్పినట్టు చేస్తాను, అని అర్థం. అంటే నేను చేస్తున్నాను అంతా నా వల్లే జరుగుతూ ఉంది అనే అహంకారము, కర్తృత్వభావన వదిలిపెట్టి, శరణాగతి పొందడం. ఇదే మానవుని అంతిమ లక్ష్యం.
(ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు గత సందేహః అని అన్నాడు. అంటే నా సందేహాలు, అనుమానాలు, అపోహలు అన్నీ తొలగి పోయాయి అని అర్థం. మహాత్మా గాంధీ గారు తనకు ఏ విషయంలో ఏ సందేహం వచ్చినా నేను గీతను చదువుతాను, నా సందేహాలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పారు. ఇది నేటి కాలానికి కూడా వర్తిస్తుంది అని ఇటీవల వచ్చిన హింది సినిమా
‘ఓ మైగాడ్’ అనే సినిమాలో నిరూపించారు. అందులో ఒకడు పరమాత్మ మీద నష్ట పరిహారం కొరకు దావా వేస్తాడు. దేవుడి వలననే అతనికి నష్టం జరిగింది అని నిరూపించమంటుంది కోర్టు. భగవద్గీతలో అతనికి సమాధానం దొరికింది. ఇది కేవలం వినోదానికి ఉపయోగించుకున్నా, మనకు ఈనాడు కలిగే సందేహాలు అన్నిటికి కాకపోయినా కనీసం కొన్నింటికైనా గీతలో సమాధానాలు దొరుకుతాయి అని నిస్సందేహంగా చెప్పవచ్చు)
ఇంతటితో కృష్ణార్జున సంవాదం పూర్తి అయింది. అమ్మయ్య తన పని పూర్తి అయింది అని కృష్ణుడు రథం తోలడానికి నొగల మీద కూర్చున్నాడు. యుద్ధం చేయడానికి అర్జునుడు రథం మీద పెట్టిన గాండీవం చేతులోకి తీసుకున్నాడు. అమ్ముల పాది సరి చూసుకున్నాడు. యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇంక వారి మధ్య మాటలు లేవు. ఇంక మాట్లాడాల్సింది సంజయుడు. ఇక్కడి నుండి తరువాతి ఐదు శ్లోకాలలో సంజయుడు తాను పొందిన అనుభవం, అనుభూతి ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment