Tuesday, April 22, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-482.
4️⃣8️⃣2️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                   
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*71. వ శ్లోకము:*

*”శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరఃl*
 *సోఽపి ముక్తశ్శుభాన్ లోకా న్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్॥”*

“గీతను చదివిన వాడు, గీతను అధ్యయనం చేసిన వాడు, తాను బాగా అధ్యయనం చేసిన గీతను ఇతరులకు చెప్పివాడు పరమాత్మకు ఇష్టులు అన్నారు.   కాని విన్నవారి సంగతి ఏమిటి అనే సందేహం వస్తుంది. వారి గురించి ఈ శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు.”
```
‘ఎవరైతే ఈ గీతాశాస్త్రమును శ్రద్ధాభక్తులతో గీతా శాస్త్రము మీద నమ్మకంతో, ఇతరుల మీద అసూయా ద్వేషములు లేకుండా వింటాడో అతడు పుణ్యములు చేసిన వారు ఏ లోకములను పొందుతారో, ఆ లోకములు పొందుతాడు. కానీ దానికీ ఒక అర్హత పెట్టాడు. గీతను వింటేనే చాలదు. గీత మీదా గీతలో చెప్పబడిన విషయాల మీదా నమ్మకం ఉండాలి. ఆ ఏదో చెప్పాడు ఏదో విన్నాము అనే విధంగా ఉండకూడదు. అన్నిటి కన్నా ముఖ్యమైనది నమ్మకం. నమ్మకం లేకపోతే ఈ శాస్త్రము సరిగా అర్ధంకాదు. మనసుకు పట్టదు. కాబట్టి గీత మీద, గీతలో చెప్పబడిన విషయాల సంపూర్ణ నమ్మకం ఉంచి వినాలి. గీతను వినిన తరువాత అతడిలో ఉన్న అసూయాద్వేషాలు పోవాలి. అందుకే శ్రద్ధావాన్ అనసూయశ్చ అని వాడారు. శ్రద్ధతో వినాలి. విన్నదానికి ఫలితం ఇతరుల మీద అసూయాద్వేషాలు నశించాలి. అప్పుడే అతడు తాను చేసిన పాపముల నుండి విముక్తుడు అవుతాడు. పుణ్యలోకాలు పొందుతాడు. కాబట్టి ఊరికే వింటే ప్రయోజనం లేదు. శ్రద్ధతో వినాలి. విన్నదానికి ఫలితం మనలో ఉన్న అసూయాద్వేషాలు నశించాలి అని పరమాత్మ అభిప్రాయము. నాకు చదువురాదు, గీతను చదవడంరాదు, చదివినా అర్థం కాదు అని ఎవరూ నిరుత్సాహపడనవసరం లేదు. గీతను శ్రద్ధతో వింటే చాలు. అసూయాద్వేషాలను మనసులో నుండి పారదోలితే చాలు, వారి పాపాలు నశించి, వారికి కూడా పుణ్యలోకాలు వస్తాయి అని అన్నాడు పరమాత్మ.```


*72. వ శ్లోకము:*

*“కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ! త్వయైకాగ్రేణ చేతసాl*
 *కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనజ్ఞయll”*

“ఇప్పటి దాకా అర్జునుడికి గీతను బోధించిన కృష్ణుడు ఈ కింది ప్రశ్న వేసాడు. ‘ఓ అర్జునా! ఇప్పటి దాకా నేను చెప్పింది ఏకాగ్రమైన మనసుతో విన్నావు కదా! ఏమైనా అర్థం అయిందా! ఒంటబట్టిందా! మొట్ట మొదట నీలో పుట్టిన నీ అజ్ఞానము నశించిందా! నేను అందరినీ చంపుతున్నాను అన్న మోహం పోయిందా! నీ భ్రమలు అన్నీ తొలగి పోయాయా!’ అని అడిగాడు.”
```
‘ఏకాగ్రచిత్తంతో విన్నావా అని అడగడంలో పరమాత్మ ఉద్దేశం, తరువాతి తరాల వారు ఈ గీతను వినేటప్పుడు ఏకాగ్రచిత్తంతో వినాలి. మనసు ఎక్కడో పెట్టుకొని శరీరం గీతాప్రవచనం జరిగే చోట ఉంచకూడదు. ఆ మాటకొస్తే గీతాప్రవచనమే కాదు ఏ పని చేసినా, పూజ, వ్రతము చేసినా ఏకాగ్రచిత్తంలో చేయాలి అనే విషయాన్ని అర్జునుడిని అడగడం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏ పని చేసినా ఏకాగ్రచిత్తంతో, మనసు పెట్టి చేయాలి కానీ అన్యమనస్కంగా చేయకూడదు. ధ్యానం చేసేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, దేని గురించైనా విచారణ చేసేటప్పుడు కానీ, మనస్సు నిలిపి చేయాలి. ఏకాగ్ర చిత్తంతో చేయాలి. చంచలమైన మనస్సు ఉండకూడదు. కొంత మంది ఉపన్యాసాలకు వస్తారు. నిద్రపోతుంటారు. అందుకే హరి కథలలో మధ్య మధ్యలో హరినామస్మరణ చేయిస్తుంటారు. చిత్తం ఏకాగ్రంగా, నిలకడగా ఉంటే చదివేది, విన్నది అర్ధం అవుతుంది. చక్కని నిర్ణయాలు తీసుకోగలము. దాని వలన జ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం నశిస్తుంది.

మనం గీతను చదవడం, వినడం, అధ్యయనం చేయడం, పూజలు, వ్రతాలు చేయడం అన్నీ కూడా మన లోపల ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేసుకోడానికే. ప్రవృతి మార్గంలో నుండి నివృతి మార్గంలోకి మళ్లడానికే, అదే ఇక్కడ అన్నాడు కృష్ణుడు. ఈ గీతా శాస్త్రము విన్న తరువాత నీలోని అజ్ఞానము మోహము భ్రమలు నశించాయా అని అడిగాడు. గీతను విన్నదానికి, చదివినదానికీ, పూజలు, వ్రతాలు చేసినదానికి ఫలితం మనలో ఉన్న అజ్ఞానం కొంచెం అయినా నశించాలి. భ్రమలు కొన్ని అయినా తొలగి పోవాలి. వాస్తవాలు తెలియాలి. అది లేకపోతే కేవలం ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్టు అవుతుంది.

ఈ శ్లోకంలో అర్జునుడిని సంబోధన కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ధనంజయ అంటే రాజసూయయాగములో అందరి రాజులను జయించి ధనరాసులను సంపాదించాడు. అలాగే ఇప్పుడు కూడా నీలో ఉన్న కామ క్రోధములను, మోహమును జయించి, జ్ఞానము అనే ధనమును సంపాదించావా అని అడిగాడు కృష్ణుడు.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment