Wednesday, February 12, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


102. జిజీవిషేత్ శతం సమాః

నూరు సంవత్సరాలు జీవించుగాక(యజుర్వేదం)

శుభాన్ని కాంక్షించడం సంకల్పబలాన్నిస్తుంది. అది జీవితంపై సకారాత్మక (Positive) దృక్పథాన్ని పెంచుతుంది.

జీవితం విలువను వేదసంస్కృతి బహుధా చాటి చెబుతోంది. నిండుగా పూర్ణాయువుతో జీవించాలని వేదమాత దీవెన.

'జీవేమ శరదః శతమ్ నందామ శరదః శతమ్'

'నూరు శరత్తులు (వందేళ్ళు) జీవిద్దాం-ఆనందిద్దాం' అని మరోచోట శుభకామనా మంత్రాన్ని పఠించి కాలస్వరూపుడైన సూర్యభగవానుని ప్రార్థించారు మహర్షులు.

'శత' అనే మాట అనంతాన్ని సూచిస్తుంది. ఈ మంత్రం శతాధిక వత్సరాలు పూర్ణాయువు కలిగిన ఆనాటి యుగాలనాడే చెప్పబడింది. అంటే ఇది 'అనంతం' అనే
అర్థంలోనే వాడబడింది-అని స్పష్టమౌతోంది. 'శతమనంతం భవతి' అని మరొక శ్రుతి వాక్కు

'ఎక్కువకాలం'-అని దీని తాత్పర్యం.

ఈ ‘అనంతత్వం'లోని ఆంతర్యం మూడు విధాలు.

1. పూర్ణాయువుతో జీవించడం.

2. పరమార్థ సాధనకై జీవితం వినియోగింపబడడం, అనుకున్నది (మోక్షం) సాధించడానికే జీవితం.

3. ఆయువు తీరి తాను శరీరాన్ని వదిలినా, సత్కీర్తి స్థిరంగా చిరాయువుతో ఉండడం.

ఈ మూడు విధాల జీవితమే అసలైన పూర్ణజీవనం. జీవితాంతం 'చూస్తూ'
బ్రతకాలనీ, 'వింటూ' ఉండాలనీ, 'సుఖంగా' మనగలగాలనీ... తొలి పలుకులు మేలిమి రతనాలు.

“పశ్యేమ శరదశ్శతం శ్రుణవామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతం...

”జీవితాన్ని నీరసంగా చూసే పనికిమాలిన వైరాగ్య బోధనలు వేదం చేయలేదు.విలువైన జీవితాన్ని మోహంలో ముంచేయకూడదన్నదే వైరాగ్యంలోని ఉద్దేశం.అంతేకానీ జీవితాన్ని జుగుప్సాకరంగా చెప్పడం కాదు.

'వ్యశేమ దేవహితం యదాయుః' - అనే వైదికాకాంక్ష ఉన్నది. దేవహితానికై ఆయువు వెచ్చించాలని దీని భావం. దేవతారాధనకే ఇంద్రియాలు వినియోగింపబడాలన్నది ఇందులో ప్రధానార్థం. “కమలాక్షు నర్చించు కరములు కరములు. దేవదేవుని చింతించు దినము దినము” అని ప్రహ్లాదుడు చెప్పిన మాటలోని పరమార్థమిదే.

అంతేకాక - లోకక్షేమమే దేవహితం. దానికై వెచ్చించినదే అసలైన ఆయువు. ఈ ఆయువంతా “భద్రాన్నే (శుభాన్నే) వినాలనీ, శుభాన్నే చూడాలనీ" వేదరుల కాంక్ష.
అంటే లోకంలో భద్రమే జరగాలని దీని అంతరార్థం.

సంవత్సరంలో ఎన్ని ఋతువులున్నా శరత్తునే చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? 'అశ్విని' నక్షత్రాలలో మొదటిది. ఆ సమయంలో పూర్ణిమ వచ్చిన 'మాసం' ఆశ్వయుజం.అందుకే నక్షత్రరీత్యా ఇది సంవత్సరానికి మొదటి మాసం. యజ్ఞప్రధానమైన అగ్నినక్షత్రాన మాసం కార్తికం. కృత్తిక-అగ్ని నక్షత్రం.

ఈ ఆశ్వయుజ, కార్తికాలు కలిసిన 'శరదృతువు'. యజ్ఞపరమైన ప్రాధాన్యం కలిగి ఉండడాన్ని, వేదం ఎక్కువగా ఈ ఋతువును పేర్కొంది.

శతం జీవ శరదో వర్ధమానః
శతం హేమన్తాచ్ఛతమా వసన్తాన్ ॥

అని శరత్తునీ, హేమంతాన్నీ, వసంతాన్నీ కూడా ఋగ్వేదం పలికింది. అన్ని ఋతువులూ ఆనందసంధాయకాలు కావాలని వేదాశీస్సు.         

No comments:

Post a Comment