Thursday, February 20, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


106. చరన్నై మధు విందతి చరన్ స్వాదుముదుంబరం

చరించువాడు మధువును పొందుతున్నాడు - తీయని ఫలాలను
అనుభవిస్తున్నాడు(యజుర్వేదం)

'చవేతి చరైతి' అని వేదమాత బోధిస్తోంది.
-
హరిశ్చంద్రుని పుత్రుడైన రోహితునకు ఇన్ద్రుడు గోచరించి “చరైవేతి” అనే పదంతో పూర్తయ్యే ఐదు మంత్రాలను బోధించాడు.

'చరించు' - అని దీని భావం. 'ఆచరించు' అని కూడా అర్థాన్ని స్వీకరించాలి.'చరించుట' - అంటే ‘నడచుట' అని అర్థం.

'నిద్రించకు-నడువు' అని బోధ.

వ్యక్తి నిరంతరం ఆచరించాలి. ఆచరణ-అంటే కర్మానుష్ఠానం. ఈ జీవితం కర్మాచరణకు లభించింది. సత్కర్మను ఆచరించి, బ్రతుకును సార్థకం చేసుకోవాలి.
ఆచరించడమే మన పని.

ఆచరిస్తూ సాగాలి జీవితం.

సోమరితనం, అకర్మణ్యత-మనిషికి కూడదు. 'విశ్రాంతి' మన జీవిత విధానం కాకూడదు. శ్రమించడానికి తగిన బలాన్ని పుంజుకునేందుకు, సేదతీరడానికి మాత్రమే 'విశ్రాంతి'. అంతేకానీ 'విశ్రాంతి' కోసమే జీవితం కాదు. శరీరాన్ని విశ్రమింపజేయాలనుకున్నా మనస్సు విశ్రమించదు. ఏ శ్రమా లేనివారి జీవితంలో మనసు వికృత భావాలను పెంపొందించుకుని, మానసిక రుగ్మతలకు లోనవుతుంది.
అందుకే భౌతిక, శారీరక శ్రమ అవసరం. శ్రమించడానికే ఈ దేహం ఏర్పడింది.

సూర్యస్య పశ్య స్థేమానం
యోన తన్హయతే అనిశం ||

'సూర్యుని నిత్య కర్మణ్యతని చూడమని ఆదేశించాడు ఇన్ద్రుడు. విశ్రమించకుండా నిరంతరం (ఆ)చరిస్తున్న సూర్యచక్రుల నుండి మనం నిత్యకర్మణ్యతని గ్రహించాలి.
'నిద్రపోవద్దు' - అజాగ్రత్త, అలసత్వం పనికిరాదు.

స్వస్తిపంథామను చరేమ సూర్యాచన్ద్ర మసావివ (ఋగ్వేదం) - సూర్యచంద్రుల వలె శుభమార్గాన్ని అనుసరిద్దాం అని బోధిస్తోంది వేదం.

విధ్యుక్తమైన విహిత ధర్మాన్ని అనుసరించి నిరంతరం ఉత్తమ కార్యాలను ఆచరిస్తూనే ఉండాలి. ‘సోమరి కన్నా దొంగ మేలు' అని స్వామి వివేకానంద ఘోషించారు. దీని
అర్థం దొంగతనాన్ని ప్రోత్సహించడం కాదు, దానికంటే సోమరితనం మహాపాపం అని చెప్పడం ఆ మహాత్ముని ఉద్దేశం.

ఒక పడవ నదిలో ప్రయాణించడానికే తయారు చేయబడింది. అంతేగానీ, ఒడ్డున కూర్చోబెట్టడానికి కాదు. అలాగే ఈ శరీరం కర్మకై ప్రభవించింది. అంతేగానీ పనికిమాలిన వాక్యాలు వల్లిస్తూ సోమరిగా బ్రతకడానికి కాదు.

ఒక యంత్రాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే క్రమంగా పాడవుతుంది. అలాగే ఈ
శరీరంలో మనస్సును, దేహాన్ని కూడా వాటిపని వాటిని చేయనివ్వాలి.

అలాగని నిరంతరం భుక్తి కోసం వృత్తిని 'మాత్రమే' చేయమని కాదు. ఉద్యోగ వ్యాపారాదులే కాక, ఆధ్యాత్మిక సాధన, నిరంతరం చైతన్యవంతమైన జీవితం,
సానుకూలమైన(Positive) దృక్పథంతో కూడిన చక్కని ఆలోచనలు శక్తిమంతమైన జీవిత విధానాలు.

సంఘంలో ఒక ఉత్పాదక (Productive) క్రియను ప్రతి వ్యక్తీ ఆచరించాలి. తన ఉనికిని సార్థకపరచుకోవాలి. లాభాపేక్షతో చేసినవి మాత్రమే పనులు-అని చెప్పలేం. మన లాభమే కాక పదిమందికీ పనికి వచ్చే కర్మలే సార్థకాలు. వాటిని ఆచరిస్తూ
సాగడమే అసలైన జీవితం.


అంతేకానీ విశ్రాంతిని లక్ష్యంగా చేసుకొని జీవిత ప్రయాణాన్ని సాగించడం తగని పని.

“తగినంత సంపాదించాం, ఇంక విశ్రాంతి తీసుకుందాం” అనే దృక్పథం మంచిది కాదు. “ఇంతవరకు సంపాదన కోసం శ్రమించాం. ఇప్పుడు సంపాదన కంటే విలువైన ధర్మాదుల కోసం శ్రమిద్దాం" అనుకొని జీవితాన్ని నిత్య చైతన్యంగా మలచుకోవాలి.

ఆచరించే వారికే ఆనందం(మధువు), ధర్మం, జ్ఞానం లభిస్తాయి. 'ఆచార ప్రభవో ధర్మః' అనే మాటకి ఇదే అర్థం. సిద్ధి, ఫలం కర్మశీలునకే ప్రాప్తిస్తాయి.      

No comments:

Post a Comment